పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించ దగ్గ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు బలపడి 39,758 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పుంజుకుని 11,669 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,335 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఇక నిఫ్టీ 11,726- 11,557 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సెకండ్ వేవ్‌లో భాగంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతుండటంతో వారాంతాన అమెరికా, యూరోపియన్ మార్కెట్లు డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలినట్లు తెలియజేశారు.
బ్యాంకుల జోరు
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ నిఫ్టీ 4.2 శాతం జంప్‌చేయగా.. రియల్టీ 3.2 శాతం ఎగసింది. అయితే ఐటీ, ఫార్మా 0.9-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్ 6.5-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో క్యూ2 ఫలితాల కారణంగా ఆర్‌ఐఎల్ 9 శాతం పతనమైంది. ఇతర దిగ్గజాలలో దివీస్, ఐషర్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టీసీఎస్, బీపీసీఎల్, యూపీఎల్, ఐవోసీ, విప్రో 3-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి.
ఫైనాన్స్ భళా
డెరివేటివ్ కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, హావెల్స్, బీవోబీ, ఎల్‌ఐసీ హౌసింగ్, పీఎఫ్‌సీ, పీవీఆర్, పీఎన్‌బీ, బంధన్ బ్యాంక్, అశోక్ లేలాండ్, డీఎల్‌ఎఫ్ 9- 4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. కోఫోర్జ్, టాటా కెమికల్స్, కేడిలా, ఇన్‌ఫ్రాటెల్, జీ, అపోలో హాస్పిటల్స్, పేజ్, అరబిందో, పెట్రోనెట్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ 0.4 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.7 శాతం క్షీణించింది. ట్రేడైన షేర్లలో 1,563 నష్టపోగా.. 1,099 లాభపడ్డాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 871 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 631 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment