కొలువుల బ్యాంకింగ్ | Hiring in banking sector likely to go up by 30% this year | Sakshi
Sakshi News home page

కొలువుల బ్యాంకింగ్

Published Thu, Oct 3 2013 1:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

Hiring in banking sector likely to go up by 30% this year

ముంబై: ఈ ఏడాది బ్యాంక్ కొలువులు భారీగా రానున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా జోరుగా విస్తరణ కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది మొత్తంమీద కొత్తగా 80 వేల నుంచి లక్ష వరకూ బ్యాంక్ ఉద్యోగాలు నమోదుకానున్నట్లు పరిశ్రమ నిపుణులంటున్నారు. గత ఏడాది వచ్చిన ఉద్యోగాలతో పోల్చితే ఇది 30 శాతం అధికమని వారంటున్నారు. బ్యాంకులు తమ బ్రాంచీ, పోర్ట్‌ఫోలియో  విస్తరణ, ఉద్యోగుల వలస, రిటైర్మెంట్, కొత్త బ్యాంకుల ప్రవేశం తదితర కారణాల వల్ల భారీ సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు రానున్నాయని టాలెంట్‌స్ప్రింట్ ఎండీ, సీఈవో శంతను పాల్ చెప్పారు.
 
 ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోనే ఆర్‌బీఐ కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు ఇస్తుందని, ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 వేల బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాయని, ప్రైవేట్, గ్రామీణ, విదేశీ బ్యాంకులు తమ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తున్నాయని, ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని వివరించారు. బ్యాంకింగ్ రంగంలో కొలువులు పెరుగుతుండటంతో గత ఏడాది 45గా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ల సంఖ్య ఈ ఏడాది 210కు పెరిగిందని తెలిపారు.
 
 ఐసీఐసీఐలో 6,000 ఉద్యోగాలు
 కాగా ఈ ఏడాది 5,000-6,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 300  బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని 2,000-2,200 కొత్త ఉద్యోగాలివ్వనున్నామని ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ ఎం.ఒ. రెగో చెప్పారు. కొత్త బ్యాంకుల రాక కారణంగా తమ బ్యాంక్ నుంచి అధికంగా ఉద్యోగులు వలసపోతారని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భావిస్తోంది. అంతేకాకుండా ఈ ఏడాది 800 మంది రిటైరవుతున్నారని, అందుకే తమకు అవసరమైన దానికంటే 30 శాతం అధికంగా ఉద్యోగులను తీసుకోనున్నామని, ఈ ఏడాది 2,000 ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ సి.వి.ఆర్. రాజేంద్రన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement