
ప్రత్యామాయం ఉంది
బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన పరిణీతి చోప్రా ఇప్పటికీ ఓ ప్రత్యామ్నాయం ఉంచుకుంది.
నటి పరిణీతి చోప్రా
ముంబై: బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన పరిణీతి చోప్రా ఇప్పటికీ ఓ ప్రత్యామ్నాయం ఉంచుకుంది. ఒకవేళ ఈ రంగంలో విజయం సాధించలేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా బ్యాంకింగ్ సెక్టార్‌ను ఎంచుకున్నానని ఈ 25 ఏళ్ల తార తన మనసులో మాట బయటపెట్టింది. ప్రతి ఒక్కరూ తన మాదిరిగానే తప్పనిసరిగా ఎప్పటికీ ఓ ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని యశ్‌రాజ్ నిర్మించిన ‘లేడీస్ వర్సెస్ రికీ బెహల్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ సుందరి హితవు పలికింది.
‘ఒకవేళ నేను నటించిన సినిమాలు కనుక ఫ్లాప్ అయ్యే రోజు వస్తే బ్యాంకింగ్ రంగం వైపు అడుగులు వేస్తా. ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించుకోవాలంటే ఇదొక్కటే సరైన, సురక్షితమైన ఐచ్ఛికం’ అని తెలిపింది. బాలీవుడ్‌లోకి అడుగిడకముందు యశ్‌రాజ్ సినిమాలకు మార్కెటింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించింది. పరిణీతి నటించిన ‘ఇషక్ జాదే, హసీ తో ఫసీ, శుద్ధ్ దేశీ రొమాన్స్ తదితర సినిమాలు అందరి ప్రశంసలందుకున్నాయి. ‘మరిన్ని ఇబ్బందులు పడకుండానే సినిమా రంగంలోకి అడుగిడే అదృష్టవంతులు చాలామంది ఉన్నారు. నటనపై ఆసక్తి ఉంటే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాల్సిందే.
ఒకవేళ ఇక్కడ నిలదొక్కుకునే పరిస్థితులు లేకపోతే ఇబ్బందులపాలు కాకుండా ఉండేందుకు ఎప్పటికీ ఓ ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. పరిశ్రమలో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం’ అని చెప్పింది. ప్రస్తుతం పరిణీతి ‘దావత్-ఇ- ఇష్క్, కిల్ దిల్’ సినిమాల్లో నటిస్తోంది. బ్యాంకింగ్ కోర్సును ఇండియాతోపాటు ఇటలీ లో కూడా అభ్యసించానని చెప్పింది. అయితే ఇంగ్లండ్‌లో ఆర్థికమాంద్య పరిస్థితులు నెలకొనడంతో స్వదేశానికి తిరిగి వచ్చానని తెలిపింది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థలో దరఖాస్తు చేయగానే ఉద్యోగం లభించిందని తెలిపింది. ఏడాదిన్నరపాటు అక్కడ పనిచేశానని చెప్పింది.