
బ్యాంకింగ్ రంగం పరుగులు మా హయాంలోనే..
మదురై: గడచిన పదేళ్లలో బ్యాంకింగ్ రంగం వృద్ధిబాటలో పరుగులు తీసిందని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. ఇదంతా తమ యూపీఏ ప్రభుత్వ పాలనలో సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. సోమవారం ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 103వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా విత్తమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బ్యాంకింగ్ రంగంలో వృద్ధి జోరును అందరూ గుర్తించారు. ఇది కచ్చితంగా మా ప్రభుత్వం ఘనతే. దీన్ని సాధించేందుకు సర్కారు చాలా నిబద్ధతను కనబరిచింది. బ్యాంకుల చీఫ్‌లు, సిబ్బంది పాత్రకూడా ఎనలేనిది ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,10,000 బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఇందులో గత తొమ్మిదేళ్లలో ఏటా 7,000-8,000 శాఖలు కొత్తగా ఏర్పాటుకాగా, ఈ ఏడాది ఈ సంఖ్య 10,000 మార్కును చేరనుంది’ అని చిదంబరం పేర్కొన్నారు. శాఖలతోపాటు ఏటీఎం సదుపాయాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. గతంలో పరిమితంగా ఉన్న ఏటీఎంలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. కాగా, బ్యాంక్ తన 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని 103 కొత్త శాఖలు, 103 ఏటీఎంలను చిదంబరం ప్రారంభించారు. మొత్తంమీద ఈ సంవత్సరంలో 231 బ్రాంచ్‌లను సెంట్రల్ బ్యాంక్ ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు. పలు అంశాలపై ఆయన ఇంకా ఏంచెప్పారంటే...
విరివిగా రుణాలు...
పదేళ్ల క్రితం విద్యా రుణాలు అందుకున్న విద్యార్థుల సంఖ్య వేలల్లో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య లక్షల్లోకి పెరిగింది. కోట్లాది స్వయం సహాయక బృందాలకు చౌకగా రుణాలు లభిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలు విస్తరించడం దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తోంది. బ్యాంకింగ్ విస్తరణ వల్ల మరో గొప్ప ప్రయోజనం ఉద్యోగాల కల్పన.. కొత్త శాఖల జోరుతో వేలాదిమందికి బ్యాంకు కొలువులు లభిస్తున్నాయి. రుణాల లభ్యత పెరగడంతో పలు రంగాల్లోనూ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయి. కొత్త కంపెనీల చట్టంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద కంపెనీలు తప్పకుండా తమ లాభాల్లో కొంత మొత్తాన్ని ఖర్చుచేయాలన్న నిబంధనలను చేర్చడం కూడా యూపీఏ సాధించిన మరో కీలక ఘనతే.
సెంట్రల్ బ్యాంక్ కొత్త మొబైల్ యాప్
103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒక కొత్త మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్(యాప్)ను అందుబాటులోకి తెచ్చింది. ఈఎంవీ(యూరోపే, మాస్టర్‌కార్డ్, వీసా) సౌలభ్యంతో ‘రూపే’ డెబిట్ కార్డును కూడా ప్రవేశపెట్టింది. ట్రేడర్లు రోజుకు రూ.40 వేల నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఈ కార్డు ప్రత్యేకత అని, అంతర్జాతీయ లావాదేవీలకైతే రూ. లక్ష పరిమితి ఉంటుందని బ్యాంక్ సీఎండీ రాజీవ్ రుషి పేర్కొన్నారు. కాగా, రూ.611 చెల్లింపుద్వారా 1.03 లక్షల పేద గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం కల్పించేవిధంగా చోళ ఆరోగ్యబీమా పథకాన్ని కూడా బ్యాంక్ ప్రారంభించింది. చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యంతో అందించే ఈ స్కీమ్‌లో వైద్య అవసరాల కోసం రూ.30,000 వరకూ బీమా కవరేజీ ఉంటుంది. ఇంకా 103 ప్రభుత్వ పాఠశాలలకు ఫ్యాన్‌లు ఇతరత్రా సౌకర్యాలను సెంట్రల్ బ్యాంక్ అందించనుంది.