
వాల్‌స్ట్రీట్‌కు గుండెకాయలా నిలుస్తున్న బ్యాంకులకు సరికొత్త ముప్పు వచ్చేస్తోంది. ఇప్పటికే వస్త్రాలు, బుక్స్, ఫుడ్ షాపింగ్‌పై తనదైన హవా సాగిస్తున్న అమెజాన్.కామ్ తన తర్వాతి ప్రాజెక్టుగా బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకుంటోంది. గత రెండేళ్లుగా ఈ దిగ్గజం ఆర్థిక ఆవిష్కరణ వంటి పలు విస్తృత విషయాలపై బ్యాంకింగ్ రెగ్యులేటర్లతో సంప్రదింపులు జరుపుతుందని అమెరికన్ బ్యాంకర్ బహిర్గతం చేసింది. 2011లోనే ఇది లెండింగ్ కార్యకలాపాలను ప్రారంభించిందని, తన మార్కెట్‌ప్లేస్‌లో విక్రయాలు జరుపుకోవడానికి మర్చంట్లకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఈ యూనిట్ ఇటీవల విపరీతంగా వృద్ధి చెందుతుందని, 12 నెలల కాలంలోనే 1 బిలియన్ డాలర్ల రుణాలను ఇచ్చింది. బ్యాంకింగ్ లావాదేవీలను జరుపుకోవడానికి నాన్ సంప్రదాయ సంస్థలను కూడా ప్రోత్సహించే విధంగా కొత్త అమెరికా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు సిద్ధమవుతున్నాయని తెలిసింది.
ఆన్‌లైన్‌గా రుణాలు ఇవ్వడానికి, మార్కెట్‌ప్లేస్ లెండర్లకు ఇటీవల కాలంలో వృద్ధిని చూస్తున్నామని ది యాక్టింగ్ కంప్ట్రోలర్ ఆఫ్ ది కరెన్సీ కీత్ నోరేకా చెప్పారు. ఒకవేళ అమెజాన్ లేదా ఆల్ఫాబెట్ లాంటి కంపెనీలు ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ను లేదా సెక్యురిటీస్ ట్రేడింగ్ సిస్టమ్‌ను ఏర్పాటుచేస్తే ప్రస్తుత ఆర్థిక సంస్థలకు తీవ్ర పోటీ వాతావరణం నెలకొంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెజాన్‌కు విస్తృత లక్ష్యాలున్నాయని పీక్‌ఐక్యూ వ్యవస్థాపకుడు రామ్ అహ్లువాలియా చెప్పారు. ఒక్క అమెజాన్ మాత్రమే కాక పేపాల్, గూగుల్ సంస్థలు కూడా బ్యాంకింగ్ రంగంలోకి దిగాలని యోచిస్తున్నట్టు తెలిసింది.