
ఉద్యోగుల్ని కాపాడుకోండి
బ్యాంకింగ్ రంగంలోకి మరిన్ని ప్రైవేటు సంస్థలు అడుపెట్టనున్న నేపథ్యంలో నిపుణులైన ఉద్యోగులు వలసపోకుండా తగు చర్యలు చేపట్టాలని...
బ్యాంకులకు ఆర్‌బీఐ సూచన
ముంబై: బ్యాంకింగ్ రంగంలోకి మరిన్ని ప్రైవేటు సంస్థలు అడుపెట్టనున్న నేపథ్యంలో నిపుణులైన ఉద్యోగులు వలసపోకుండా తగు చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ బ్యాంకింగ్ పరిశ్రమకు సూచించారు. పేమెంట్, చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు ఆర్‌బీఐ త్వరలో లెసైన్స్‌లు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో భారీగా ఉద్యోగుల వలసలు ఉంటాయని.. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ వలసల సమస్యను ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు.సెబీ నేతృత్వంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీస్ మార్కెట్స్ శుక్రవారమిక్కడ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బ్యాంకింగ్ పరిశ్రమలోని నిర్దిష్ట విభాగాలకు చెందిన నిపుణులకు భారీగా డిమాండ్ పెరగనుంది. నైపుణ్యం, ప్రత్యేకతలు ఉన్న సిబ్బంది ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోవచ్చని బ్యాంకులకు మేం చెబుతూవస్తున్నాం.
గతంలోమాదిరిగా.. ఒక క్యాడర్‌ను నిర్మించుకొని ఎల్లకాలం వారినే కొనసాగించే పద్ధతి మారిపోనుంది. వలసలు అనేవి ఈ రంగంలోనూ సాధారణం కానుంది’ అని గాంధీ పేర్కొన్నారు. అయితే, తాజా వలసల రేటు ఏస్థాయిలో ఉంటుందనేది చెప్పలేమని.. కొత్త బ్యాంకులు వస్తే అనుభవం, నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు కచ్చితంగా డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.