కొంచెం ఊరట ! | RBI leaves rates on hold; election, monsoon in focus | Sakshi
Sakshi News home page

కొంచెం ఊరట !

Published Wed, Apr 2 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

కొంచెం ఊరట !

కొంచెం ఊరట !

ముంబై: గతానికి భిన్నంగా... మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడ్డాయి. పాలసీరేట్లలో ఎటువంటి మార్పులూ జరగలేదు. దీనితో గృహ, కారు వంటి వాటిపై బ్యాంకింగ్ రుణ వినియోగదారుడిపై నెలసరి వాయిదా చెల్లింపు(ఈఎంఐ)ల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. మార్కెట్ అంచనాలకు భిన్నమైన నిర్ణయాలను గత రెండు పాలసీ సమీక్షల్లో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. ఈ దఫా ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం నెలకొని ఉండడమే రేట్లు తగ్గించకపోవడానికి కారణమని ఆర్‌బీఐ సూచించింది. అయితే తగ్గుదల ధోరణి కొనసాగినంతకాలం రేట్ల పెంపునకు కూడా అవకాశం ఉండదని పేర్కొంది. వెరసి మొదటి ద్వైమాసిక పరపతి సమీక్ష సందర్భంగా రెపో రేటు ప్రస్తుత 8% వద్ద, సీఆర్‌ఆర్ 4% వద్ద యథాతథంగా కొనసాగనున్నాయి.

 పరపతి విధాన సమీక్షలో ముఖ్యాంశాలు...
 స్వల్పకాలిక రుణ(రెపో-బ్యాంకులకిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) రేటు యథాతథం. రెపో ప్రస్తుతం 8%గా ఉంది.

 బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిర్దిష్ట మొత్తానికి సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)లో సైతం మార్పు లేదు. ఇది 4 శాతంగా కొనసాగనుంది.

{దవ్యోల్బణం తగ్గుదల ధోరణి కొనసాగుతున్నంతకాలం రేటులో ఎటువంటి పెంపూ ఉండబోదు.
 2014-15లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు అంచనా స్వల్పంగా 5.6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గింపు.

 ఇక ఈ ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ అంటే ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న నికర వ్యత్యాసం) సైతం జీడీపీలో 2 శాతంగా ఉండే అవకాశం ఉంది.

 2014లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉంటుందని అంచనా.
బ్యాంకింగ్ విలీనాలకు ద్వారాలు. అయితే ఈ విషయంలో పోటీ, స్థిరత్వం అంశాల్లో రాజీ ప్రశ్నే ఉండబోదు. బ్యాంకుల విలీనం వల్ల మరింత విలువ సృష్టి జరిగే అవకాశం ఉంది.
 7 రోజులు, 14 రోజుల రెపో పరిమితులను 0.50 శాతం నుంచి 0.75 శాతానికి పెంచడం జరిగింది. ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) పెరుగుదల అవసరాలకు ఈ అంశాలు దోహదపడతాయి.

 తదుపరి పాలసీ 0సమీక్ష జూన్3న జరుగుతుంది.
 
 కనీస బ్యాలెన్స్ లేకుంటే జరిమానాలొద్దు..
 బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనలను పాటించని కస్టమర్లపై జరిమానానాలు విధించరాదని బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ఏదైనా సమస్యల వల్ల ఖాతాదారులు ఈ నిబంధన పాటించ లేకపోతుండవచ్చని, అంతమాత్రం చేత బ్యాంకులు దీన్నుంచి అనుచిత లబ్ది పొందాలని చూడకూడదని ఆయన పేర్కొన్నారు. కనీస బ్యాలెన్స్ పాటించని బేసిక్ సేవింగ్స్ ఖాతాలపై జరిమానాలు విధించడం కాకుండా...అవసరమైతే కొన్ని సర్వీసులను కుదించాలని రాజన్ సూచించారు. మళ్లీ ఖాతాలో బ్యాలెన్స్ నిర్దేశిత స్థాయికి వచ్చిన తర్వాత ఆయా సేవలను పునరుద్ధరించవచ్చని తెలిపారు.

అలాగే, నిర్వహణలో లేని ఖాతాల విషయంలో కూడా మినిమం బ్యాలెన్స్ లేని వాటిపై పెనాల్టీ విధించొద్దని రాజన్ చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్‌బీఐ.. కనీస బ్యాలెన్స్ లేని ఖాతాలపై ఎటువంటి పెనాల్టీలూ విధించడం లేదు. అయితే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటివి మాత్రం త్రైమాసికానికి రూ. 750 మేర చార్జీలు విధిస్తున్నాయి. ఈ తరహా బ్యాంకులకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో మూణ్నెల్లకు రూ. 10,000, ఓ మాదిరి పట్టణ ప్రాంతాల్లో రూ. 5,000 కనీస బ్యాలెన్స్ పాటించాల్సి ఉంటోంది. మరోవైపు, చలన వడ్డీ రేటుపై రుణాలను ముందస్తుగా చెల్లించాలనుకునే వారిపై కూడా ఎలాంటి పెనాల్టీ విధించకుండా ఉండేలా చూసే అంశాన్ని కూడా బ్యాంకులు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.
 
 వడ్డీరేట్లు తగ్గిస్తేనే వృద్ధికి చేయూత: పరిశ్రమలు
 వృద్ధి రేటు పెరగడానికి వడ్డీరేట్లను ఆర్‌బీఐ తగ్గించాల్సిందేనని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగివస్తున్న ధోరణిని పాలసీ రేట్లను తగ్గించడానికి అవకాశంగా ఆర్‌బీఐ తీసుకుంటే బాగుండేదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల పెట్టుబడుల పునరుత్తేజానికి అవకాశం ఉంటుందని అన్నారు.  కేవలం పరపతి విధానంపై ఆధారపడి ద్రవ్యోల్బణం కట్టడి అసాధ్యమన్నది తమ అభిప్రాయమని ఫిక్కీ అధ్యక్షుడు సిద్దార్థ్ బిర్లా అన్నారు.

దీనికి పాలనా పరమైన చర్యలు కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. పాలసీ రేటు తగ్గితే ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడే అవకాశం ఉంటుందని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ యథాతథ విధానం పారిశ్రామిక వృద్ధికి నిరుత్సాహకరమేనని, నిధుల కోసం అధికంగా వ్యయపర్చాల్సివుంటుందని పీహెచ్‌డీ చాంబర్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు.
 
 వడ్డీరేట్లలో మార్పుండదు: బ్యాంకర్లు
 ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్లలో ఎటువంటి మార్పూ ఉండకపోవచ్చని బ్యాంకర్లు పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారు నెలవారీ చెల్లింపులపై(ఈఎంఐలు) తక్షణం ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్ల విషయంలో మరికొంతకాలం ప్రస్తుత పరిస్థితే కొనసాగే అవకాశం ఉందని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ కేఆర్ కామత్ వ్యాఖ్యానించారు
 
 .రియల్టీ హర్షం...
 కాగా వడ్డీరేట్లు తగ్గించకపోయినా, పెంచకపోవడమూ ఒక సానుకూల అంశమేనని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ పేర్కొంది. వడ్డీరేట్లు అధిక స్థాయిలో ఉన్నాయని, భవిష్యత్తులో ఇవి తగ్గడానికే అవకాశం ఉందని పాలసీ సంకేతాలు ఇస్తోందని భారత రియల్డీ డెవలపర్ల సంఘం (క్రెడాయ్) చైర్మన్ లలిత్ కుమార్ జైన్ అన్నారు.
 
 యథాతథం... తప్పదు: రాజన్
 ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించక తప్పదని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. గత యేడాది సెప్టెంబర్, అలాగే  2014 జనవరి మధ్య రేట్ల పెంపు నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో తన లక్ష్యాలను నెరవేరుస్తోందని రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆహారం, ఇంధనాలను మినహాయిస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 8 శాతంగానే కొనసాగుతోందని ఆయన అన్నారు. డిమాండ్ ఇంకా అధిక స్థాయి వద్దే వున్న అంశాన్ని ఈ పరిస్థితి ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతం, అటుపై యేడాది 6 శాతం దిశగా కొనసాగుతుంటే మాత్రం రెపోరేటును పెంచబోమని గవర్నర్ స్పష్టం చేశారు.
 
 వృద్ధి సామర్థ ్యం 6 శాతం కంటే తక్కువే...
 పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్‌బీఐ స్థూల ఆర్థిక వ్యవస్థ, పరపతి పరిణామాలపై ఒక నివేదికను సైతం ఆవిష్కరించింది.  భారత్ వృద్ధి సామర్థ్యం ప్రస్తుత పరిస్థితుల్లో 6 శాతంకన్నా తక్కువేనని ఈ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఇంతక్రితం 8 శాతం అంచనాలను సవరించింది. ఫైనాన్షియల్ పొదుపులు, పెట్టుబడులు తగ్గుతుండడం, అధిక ద్రవ్యోల్బణం, దిగువ స్థాయిలో వాణిజ్య విశ్వాసం వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement