‘ఎన్‌పీఏలపై అతి చేయొద్దు’
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలోని మొండి బకాయిల(ఎన్‌పీఏ) అంశంపై అతి చేయడం మంచిది కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. దీంతో మొత్తం రుణ కార్యకలాపాలకు ఆటంకం కలగవచ్చని, వృద్ధికి విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. శనివారం రిజర్వు బ్యాంక్ బోర్డు భేటీ అనంతరం జైట్లీ, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ అంశంపై రాద్ధాంతం మంచిది కాదు. ప్రజలు రక్షణాత్మక ధోరణితో వ్యవహరించడం వల్ల మొత్తం రుణ కార్యకలాపాలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే పరిస్థితులు దాపురించాయి’ అని జైట్లీ చెప్పారు.
కొన్ని రంగాల్లో వృద్ధి మందగించడం వంటి వాటివల్ల ఎన్‌పీఏ సమస్య తలెత్తింద న్నారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాన్ని రూపొంది స్తున్నట్లు రాజన్ చెప్పారు. వీరికి సంబంధించిరిజిస్ట్రీ నిర్వహిస్తున్నామని, జరిమానాలను అధికం చేశామని పేర్కొన్నారు. గతేడాది మార్చి నాటికి 5.43 శాతంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు అదే ఏడాది డిసెంబర్‌నాటికి 7.30 శాతానికి పెరిగాయి. విలువ పరంగా రూ.2.67 లక్షల కోట్ల నుంచి రూ.3.61 లక్షల కోట్లకు పెరిగాయి.