వాషింగ్టన్‌లో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశంలో (ఎడమ నుంచి వరుసగా) అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జనెట్ యెలెన్, అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ జే
♦ పరస్పర సహకారానికి భారత్,
♦ అమెరికాల మధ్య అంగీకారం
వాషింగ్టన్: పరస్పర ఆర్థిక, వాణిజ్య లావాదేవీలకు సంబంధించి పన్ను ఎగవేతలు, మనీ ల్యాండరింగ్ వంటివి నిరోధించడానికి భారత్-అమెరికాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇందులో భాగంగా పరస్పర సమాచార మార్పిడి, సంయుక్త ఆడిటింగ్ నిర్వహించాలని గురువారం ఇక్కడ జరిగిన ‘భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం’(ఈఎఫ్‌పీ) ఆరో వార్షిక సమావేశంలో ఇరు దేశాలూ అంగీకరించాయి. తద్వారా అక్రమ నిధుల వలసను ఉగ్రవాదులకు అందుతున్న నిధులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించాయి. ఈ అంశంపై అధికారిక చర్చలు జరపాలని భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ జే ల్యూలు ఒక అంగీకారానికి వచ్చారు.
ఇరు దేశాలకు చెందిన సంబంధిత శాఖల అధికారులు కలసి ఈ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారని సమావేశం అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో వెల్లడించింది. దీంతోపాటు భారత్ మౌలిక సదుపాయాల్ని వృద్ధిపర్చుకోవడానికి నెలకొల్పిన నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్)కు తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా పేర్కొంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జెనెట్ యెలెన్, భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కరెన్సీ విలువ తగ్గింపునకు స్వస్తిచెప్పాలి: జైట్లీ
అంతర్జాతీయ వృద్ధిని పెంచేందుకు జీ20 దేశాల మధ్య మరింత సహకారం అవసరమని, ఆయా దేశాలు వాణిజ్య రక్షణాత్మక చర్యల్ని నివారించాలని, పోటీపడి కరెన్సీ విలువ తగ్గించడం మానుకోవాలని భారత్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో మాట్లాడారు. పరపతి విధాన సాధనాల సామర్థ్యం.. పరిమితిని చేరిందని, ఇక ప్రభుత్వ పెట్టుబడులపై దేశాలు దృష్టినిలపాలన్నారు.
అంతా బాగుంటే మరోసారి రేటు కోత: రాజన్
వాషింగ్టన్: మంచి వర్షపాతం, తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణంపై ఆధారపడి తదుపరి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు(ప్రస్తుతం 6.5 శాతం-ఐదేళ్ల కనిష్ట స్థాయి) నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. 2015 జనవరి నుంచీ ఈ రేటు 1.5 శాతం తగ్గిన నేపథ్యంలో వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.