జైట్లీతో అభిప్రాయభేదాల్లేవు...
ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
♦ విద్యాబోధనవైపు వెళ్లాలన్నది కోరికని వెల్లడి
♦ బ్యాంకింగ్‌లో ప్రభుత్వ జోక్యం లేకుండా
♦ చేశారని ప్రధాని మోదీపై ప్రశంసలు
♦ ఆర్థిక రంగం సరైన దారిలో ఉందని విశ్లేషణ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సుహృద్భావ సంబంధాలున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం చెప్పారు. కీలక అంశాలపై భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ లేవన్నారు. సెప్టెంబర్ 4 తరువాత తన పదవీకాలాన్ని పొడిగించే అంశంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ప్రకటన వచ్చే వరకూ నిరీక్షించమని సూచించారు. ‘‘విద్యా బోధన వైపు వెళ్లాలన్నది నా చిరకాల కోరిక. ఆలోచన, పరిశోధనా, విద్యాబోధన నాకు అత్యున్నతమైన అంశాలు’’ అని ఒక టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ జోక్యానికి ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు పలికారని రాజన్ ప్రశంసించారు. ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి ఉంటేనే.. తదుపరి రేటు కోత ఉంటుందనీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఆ ఆరోపణల్లో పసలేదు...
మానసికంగా తాను భారతీయుడిని కాదని బీజేపీ పార్లమెంటు సభ్యుడు సుబ్రమణ్యస్వామి చేసిన ఆరోపణల గురించి అడిగిన ఒక ప్రశ్నకు రాజన్ సమాధానం చెబుతూ, ఈ ఆరోపణల్లో అసలు అర్థంలేదని, నిరాధారమైనవని అన్నారు. ‘ఆధారాల్లేని ఆరోపణల గురించి మాట్లాడితే... ఆయా అంశాలకు మరింత బలం చేకూర్చినట్లు అవుతుంది. దేశం గురించి ఆలోచించేవారికి దేశం పట్ల ప్రేమ కూడా ఉంటుంది. కర్మయోగి (స్వలాభం చూసుకోకుండా... ఆదర్శవంతంగా నడుచుకునే వ్యక్తి) తన పనితాను చేసుకుపోతాడని మా అత్తగారు చెబుతుంటారు’’ అని రాజన్ ఈ సందర్భంగా అన్నారు. వ్యక్తిగత ఆరోపణలను అసలు తాను పట్టించుకోనని, విధానపరమైన అంశాల్లో తప్పులు ఎత్తిచూపితే... వాటిని పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోడానికి వెనుకాడనని కూడా ఈ సందర్భంగా అన్నారు.
రాజకీయ జోక్యం లేదు...
మొండిబకాయిలకు సంబంధించి రాజకీయ జోక్యం చెదురుమదురు అంశంగా ఆయన పేర్కొన్నారు. మొండిబకాయిల సమస్యకు ప్రపంచ మందగమన పరిస్థితులు సహా పలు అంశాలు కారణమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని మాత్రమే కేంద్రం కోరుకుంటోందని, మిగిలిన అంశాలకు సంబంధించి రాజకీయ జోక్యం, ఫోన్ల ప్రశ్నే ఉండదని రెండేళ్ల క్రితం బ్యాంకింగ్‌కు సంబంధించి జ్ఞాన్‌సంఘంలో ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తంమీద రుణ బకాయిల విషయంలో రాజకీయ జోక్యం పోయిందన్నది తన అభిప్రాయమని వివరించారు.
తగిన దిశలో ఆర్థిక వ్యవస్థ...
భారత్ ఆర్థిక వ్యవస్థ తగిన దిశలో నడుస్తోందని రాజన్ పేర్కొన్నారు. తగిన వర్షపాతం, వినియోగ డిమాండ్ పెంపుసహా, ముందస్తు ప్రణాళికలతో దేశ వృద్ధి మరింత పునరుత్తేజం అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రైవేటు పెట్టుబడుల్లో వృద్ధి ప్రస్తుతం కీలక ముఖ్య అంశమని వివరించారు.
తగిన సమయంలో నిర్ణయం: సిన్హా
ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్‌నే కొనసాగించాలా... లేక కొత్త వారిని నియమించాలా... అన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలు తగిన సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా బుధవారం విలేకరులకు తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత్ ప్రతిష్ట, గుర్తింపు మరింత ఉన్నత స్థాయికి చేరిందని ప్రధాని అమెరికా పర్యటనను ఉద్దేశించి సిన్హా పేర్కొన్నారు.