రాజన్ను విమర్శించడం సరికాదు
♦ ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టీకరణ
♦ వ్యక్తిగత విమర్శలు సరికాదని హితవు
టోక్యో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి చేస్తున్న తీవ్ర ఆరోపణలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మరింత స్పష్టంగా ఖండించారు. వ్యక్తులపై వ్యక్తిగతంగా విమర్శలు ఎంతమాత్రం తగవని పేర్కొన్న ఆయన, విధానాల్లో తప్పులపై మాత్రమే చర్చ జరపాల్సి ఉంటుందని సూచించారు. అయితే ఆయన సెప్టెంబర్ 4 తర్వాత ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా? లేదా? అన్న అంశంపై సమాధానాన్ని మాత్రం దాటవేశారు. ‘‘వ్యక్తిగత అంశాలకు సంబంధించినంతవరకూ ఎవరి విమర్శలనూ నేను సమర్థించను. ఎందుకంటే... ఆర్‌బీఐ, దానికి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలకం.’’అని చెప్పారు. జపాన్‌లో ఆరు రోజుల పర్యటనలో ఉన్న జైట్లీ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌బీఐ గవర్నర్‌పై వస్తున్న విమర్శలపై ఈ విధంగా స్పందించారు.
‘స్పెషల్ విండో’ను వినియోగించుకోండి
కాగా నల్లడబ్బు పోగేసుకున్న వారికి ఆర్థికమంత్రి తీవ్ర హెచ్చరిక చేశారు. అప్రకటిత ఆస్తుల వెల్లడికి సంబంధించిన వెసులుబాటు (విండో) జూన్ 1 నుంచీ ప్రారంభంకానున్న అంశాన్ని జైట్లీ ప్రస్తావిస్తూ... ఈ అవకాశాన్ని నల్లడబ్బు వెల్లడికి వినియోగించుకోవాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జైట్లీ అన్నారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
భారత్‌లో వృద్ధి అవకాశాలను వివరించి జపాన్ పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా తన పర్యటన జరుపుతున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్‌లో మౌలిక రంగం వృద్ధిపై కేంద్రం దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో వెయ్యి జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఈ సంఖ్యను రెట్టింపు చేయాలన్నది లక్ష్యంగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌వైపు సాఫ్ట్‌బ్యాంక్ దృష్టి...
జపాన్ ప్రధాని షింజో అబీ ఇతర సీనియర్ అధికారులతో జైట్లీ తన రెండవరోజు పర్యటనలో సమావేశమయ్యారు. సాఫ్ట్‌బ్యాంక్ తమ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆంధప్రదేశ్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. పర్యటనలో తొలి రోజు జైట్లీ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సీఈఓ మసయోషీ సన్‌తో సమావేశమయిన సంగతి తెలిసిందే.