సుబ్రమణ్య స్వామి వర్సెస్ జైట్లీ!
న్యూఢిల్లీ: ఒకవైపు ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి రఘురామ్ రాజన్ను తొలగించాలంటూ బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్యం స్వామి డిమాండ్ చేస్తుంటే.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం రాజన్ను వెనకేసుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తిపై ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం కాస్త గందరగోళానికి తావిస్తోంది. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ తీసుకునే నిర్ణయాలు ఆర్థికవృద్ధి రేటుకు విఘాతం కల్గిస్తున్నాయని పేర్కొంటూ సుబ్రమణ్యం స్వామి ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా మరోసారి లేఖ రాయడంపై అరుణ్ జైట్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఒక అంశంపై కాకుండా ఒక వ్యక్తిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని జైట్లీ పేర్కొన్నారు. ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని తాను ఎంతమాత్రం ఆమోదించనని తెలిపారు.
'ఆర్బీఐ అనేది ప్రముఖసంస్థ. ఆ సంస్థకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వారి నిర్ణయం ఆమోదయోగ్యం లేకపోతే దానిపై చర్చ జరగాలి. అంతేగానీ ప్రజావేదికగా ఇలా రచ్చకెక్కడం తగదనేది నా అభిప్రాయం'అని జైట్లీ తెలిపారు. రఘురామ్ రాజన్ ను తొలగించాలని సుబ్రమణ్యం స్వామి రెండో సారి లేఖ రాసిన సంగతి తెలిసిందే. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు అధిక వడ్డీ రేట్లను అమలు చేసి వృద్థిరేటును అడ్డుకున్న రాజన్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్బీఐ అత్యున్నత పదవిలో ఉండటానికి అర్హుడు కాదన్నారు. అవసరం లేకపోయినా అధిక వడ్డీ రేట్లను దీర్ఘ కాలం అమల్లో ఉంచి దేశ వ్యతిరేక విధానాలకు తెరలేపిన రాజన్ ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాని కారణంగానే దేశ ఆర్ధికాభివృద్ధి వేగాన్ని అడ్డుకున్నారన్నారు. ప్రస్తుతం గ్రీన్ కార్డ్ను రెన్యువల్ చేయించుకునే పనిలో ఉన్న రాజన్ తరచు అమెరికా పర్యటనలు కొనసాగిస్తున్నారని సుబ్రమణ్యం స్వామి తన లేఖలో విమర్శించారు.