వచ్చే జనవరికల్లా తపాలా బ్యాంకు
న్యూఢిల్లీ: తపాలా శాఖ త్వరలో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టనుంది. వచ్చే జనవరి నాటికి పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూత్ర ప్రాయంగా అంగీకారాన్ని తెలిపిందని సీనియర్ అధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికి గానీ, వచ్చే జనవరికి గానీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) ప్రారంభించి తీరుతాం. గత పదిహేనేళ్ల నుంచి వెస్ట్రన్ యూనియన్‌తో భాగస్వామిగా ఉన్నాం అని ఇండియా పోస్ట్ మెంబర్ ఫర్ బ్యాంకింగ్, హెచ్‌ఆర్‌డీ ఎంఎస్.రామానుజన్ తెలియజేశారు. ఈ బ్యాంకులకు అవసరమైన సిబ్బందిని తపాలా శాఖలో చేస్తున్న వారితోపాటు బయటినుంచి తీసుకుంటామన్నారు. పేమెంట్స్ బ్యాంకు కోసం తపాలా శాఖ ఇప్పటికే పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు(పీఐబీ) నుంచి క్లియరెన్స్ పొందిందని. త్వరలోనే ఆర్థిక శాఖ ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.