రిలయన్స్, ఎయిర్‌టెల్ బ్యాంకులు! | Reliance, Airtel banks | Sakshi
Sakshi News home page

రిలయన్స్, ఎయిర్‌టెల్ బ్యాంకులు!

Published Thu, Aug 20 2015 12:59 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

రిలయన్స్, ఎయిర్‌టెల్ బ్యాంకులు! - Sakshi

రిలయన్స్, ఎయిర్‌టెల్ బ్యాంకులు!

11 పేమెంట్ బ్యాంకులకు ర్‌బీఐ సూత్రప్రాయ అనుమతులు
- లిస్టులో వొడాఫోన్, ఆదిత్య బిర్లా నువో స్టల్ డిపార్ట్‌మెంట్ కూడా
ముంబై:
రిలయన్స్ ఇండస్ట్రీస్, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సహా 11 సంస్థలు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం ‘సూత్రప్రాయంగా’ అనుమతులు ఇచ్చింది. సూత్రప్రాయ అనుమతులు 18 నెలల పాటు వర్తిస్తాయి. ఈలోగా పూర్తి స్థాయి అనుమతులు సాధించేందుకు అవసరమైన నిబంధనలను ఈ సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఎటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలూ నిర్వహించకూడదు. తొలి విడత అనుభవాల ఆధారంగా భవిష్యత్‌లో మరిన్ని కొత్త లెసైన్సుల జారీ విషయంలో నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుత రౌండులో పర్మిట్లు పొందని వాటికి తర్వాతి విడతల్లో లెసైన్సులు దక్కవచ్చని పేర్కొంది. మొత్తం 41 సంస్థలు పేమెంట్ బ్యాంకు పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మరిన్ని నిధులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేందుకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు పేమెంట్ బ్యాంకులు తోడ్పడగలవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఎస్‌బీఐ లాంటి దిగ్గజాలతో పాటు పలు బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు మరింత విస్తరించడంపై దృష్టి పెడుతున్నాయని ఆయన చెప్పారు. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టల్ శాఖ అందివచ్చిన అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకోగలదని ఆశిస్తున్నట్లు కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ఇది పోస్టల్ శాఖకు గర్వకారణమైన సందర్భం అని పేర్కొన్నారు.
 
పర్మిట్ పొందినవి ..

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువో, వొడాఫోన్ ఎం-పెసా, ఎయిర్‌టెల్ ఎం కామర్స్ సర్వీసెస్, చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, టెక్ మహీంద్రా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీ ఎల్), ఫినో పేటెక్ మొదలైన సంస్థలతో పాటు సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ప్రతిపాదిత బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ఎస్‌బీఐతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్.. పేమెంట్ బ్యాంకును ఏర్పాటు చేయనుంది. ప్రతి పాదిత వెంచర్‌లో ఎస్‌బీఐకి 30% వాటాలు ఉంటాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ తమ వెంచర్‌లో 19.9% వాటాను కొటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఇవ్వనుంది. ఆదిత్య బిర్లా నువో.. ఐడియాతో కలిసి  పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఐడియాకి 49% వాటాలు ఉంటాయి. పోస్టల్ శాఖకు దేశవ్యాప్తంగా 1,54,000 పైచిలుకు పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో 1,30,000 పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. టెలినార్, ఐడీఎఫ్‌సీలతో కలిసి దిలీప్ సంఘ్వీ ఫ్యామిలీ అండ్ అసోసియేట్స్ (డీఎస్‌ఏ) పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేస్తోంది.
 
సమగ్ర ఆర్థిక సేవలందిస్తాం..
సమగ్రమైన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు అందించేందుకు తాజా లెసై న్సు ఉపయోగపడగలదని వొడాఫోన్ ఇం డియా ఎండీ సునీల్ సూద్ అన్నారు. మారుమూల ప్రాం తాల్లోనూ నగదు బదిలీ, చెల్లింపుల సేవలందిస్తూ.. ఇప్పటికే 90,000 పైచిలుకు ‘ఎం-పెసా’ ఏజెంట్లు ఉన్నారని వివరించారు. సాధ్యమైనంత త్వరగా బ్యాంకు ఏర్పా టు చేయాలని భావిస్తున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. అందరికీ ఆర్థిక సేవలు అం దుబాటులోకి తెచ్చే దిశగా ఇది మరో అడుగని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. కొత్త పేమెంట్ బ్యాంక్‌లో తమకు, మహీంద్రా ఫైనాన్స్‌కు సమాన వాటాలు ఉంటాయని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ తెలిపారు. కొత్త బ్యాంకులో రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని, మ రిన్ని నిధులను సమీకరిస్తామని పేటెక్ సీఈవో రిషి గుప్తా చెప్పారు.
 
తీరుతెన్నులివీ..
చిన్న వ్యాపార సంస్థలు, వ్యక్తుల బ్యాంకింగ్ అవసరాలకు తోడ్పడే ఉద్దేశంతో పేమెంట్ బ్యాంకుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇవి పూర్తి స్థాయి బ్యాంకుల్లాగా కాకుండా డిపాజిట్‌ల స్వీకరణ, రెమిటెన్స్ సేవలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నగదు బదిలీ సేవలు, బీమా..మ్యూచువల్ ఫండ్స్ విక్రయాలు మొదలైన కొన్ని సేవలు మాత్రమే అందిస్తాయి. రుణ వితరణ కార్యకలాపాలు చేపట్టడానికి అనుమతులు ఉండవు. ప్రాథమికంగా వ్యక్తుల నుంచి రూ. 1 లక్ష దాకా డిపాజిట్లను ఈ బ్యాంకులు సమీకరించవచ్చు. ఏటీఎం/డెబిట్ కార్డులు జారీ చేయొచ్చు కానీ క్రెడిట్ కార్డులకు మాత్రం అనుమతి లేదు. ఈ పేమెంట్ బ్యాంకులు సేకరించిన డిపాజిట్లలో 75 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి చేయాలి. మిగిలిన 25 శాతం ఇతర వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం దేశీయంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేట్, 44 విదేశీ, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement