
ముంబై: దేశ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా, సుస్థిరంగానే ఉందని, వదంతుల ఆధారంగా భయపడిపోవాల్సిన పని లేదని దేశ ప్రజలకు భరోసానిస్తూ ఆర్‌బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకులో సంక్షోభంతోపాటు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రతికూల వార్తలు చలామణి అవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘కొన్ని బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకుల పట్ల వదంతులు చలామణి అవుతున్నాయి. ఇవి డిపాజిటర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగా, స్థిరంగా ఉందని, ఈ వదంతులను విని భయపడిపోవాల్సిన అవసరం లేదని సాధారణ ప్రజలకు ఆర్‌బీఐ హామీ ఇస్తోంది’’ అని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు మంగళవారం స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ రంగ స్టాక్స్ సైతం తీవ్ర నష్టాల పాలయ్యాయి.