సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 25వ గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత్ దాస్ నూతన గవర్నర్‌గా తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎంపిక కావడం గౌరవనీయమైన గొప్ప అవకాశమంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ టీం తో కలిసి పనిచేస్తాం...భారతదేశ ఆర్థికవ్యవస్థ కోసం ప్రతిఒక్కరితో కలిసి పనిచేయడానికి తన శాయశక‍్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. లిక్విడీటీ, ప్రధానంగా తాను బ్యాంకింగ్ రంగంపై దృష్టిపెట్టనున్నట్టు వివరించారు.
ఆర్‌బీఐ విశ్వసనీయత, స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తామని, ఆర్‌బీఐ ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. జవాబుదారీతనానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థకవసరమయ్యే చర్యలను సమయానుసారంగా తీసుకోవాలని పేర్కొన్నారు. డిసెంబర్ 14, శుక్రవారం ఆర్‌బీఐ బోర్డు సమావేశం కానుందన్నారు.
ద్రవ్యోల్బణ నియంత్రణ ఆర్‌బీఐ తక్షణ కర్తవ్యమన్నారు శక్తికాంత్ దాస్. త్వరలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో ముంబైలో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నా మన్నారు. అనంతరం ప్రయివేటు రంగ బ్యాంకులతో కూడా సమావేశం కానున్నట్టు చెప్పారు. అలాగే ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య విదాదాల్లోకి తాను వెళ్ల దలుచు కోలేదని అయితే ప్రతి సంస్థ దాని స్వయంప్రతిపత్తిని కొనసాగించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.
మరోవైపు డిప్యూటీ గవర‍్నర్ విరేల్ ఆచార్య పదవిలో ఉన్నారా అని ప్రశ్నించినపుడు.. కొద్దిసేపటిక్రితమే ఆయనతో టీ తాగాను. నాకు తెలిసినంతవరకు ఆయన పదవిలోనే ఉన్నారంటూ మీడియా ప్రతినిధులతో ఉత్సాహంగా, నవ్వుతూ చమత్కారంగా సమాధానాలిచ్చారు.
కాగా ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇటీవల రగిలిన వివాదాల నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఆర్‌బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను వైదొలగుతున్నట్టు ప్రకటించిన ఆయన తన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో నూతన గవర్నర్‌గా శక్తికాంత్ దాస్‌ను అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినేట్ (ఏసీసీ) ఎంపిక చేసింది. మూడేళ్ల పాటు ఈ శక్తికాంత్ పదవిలో కొనసాగనున్నారు.1980 తమిళనాడు కేడర్ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శక్తికాంత దాస్ కేంద్ర కేబినేట్ సెక్రటరీ హోదాలో పలు శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో సహా కేంద్ర ప్రభుత్వంలోనూ పనిచేసిన అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment