సహకార బ్యాంకుల ‘టెక్‌’ బాట! | New big opportunity for IT firms as cooperative banks finally go digital | Sakshi
Sakshi News home page

సహకార బ్యాంకుల ‘టెక్‌’ బాట!

Published Sat, Jun 8 2019 5:06 AM | Last Updated on Sat, Jun 8 2019 5:27 AM

New big opportunity for IT firms as cooperative banks finally go digital - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతుండటంతో పట్టణ ప్రాంత సహకార బ్యాంకులు (యూసీబీ) కూడా డిజిటల్‌ బాట పడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, హైస్పీడ్‌ కనెక్టివిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ వంటివి ప్రాచుర్యంలోకి వస్తుండటంతో కేవలం శాఖలకు మాత్రమే పరిమితమైతే కుదరదని యూసీబీలు గ్రహిస్తున్నాయి. టెక్నాలజీ వైపు మళ్లక తప్పదని ఇప్పటికే గుర్తించినా... డిజిటల్‌ చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

1966లో యూసీబీలను క్రమబద్ధీకరించి, నియంత్రణ సంస్థ పరిధిలోకి తెచ్చారు. అప్పటి నుంచీ అవి క్రమంగా సేవలు మెరుగుపర్చుకుంటూ వస్తున్నాయి. కానీ ఆర్థికంగా బలంగా లేని యూసీబీల సంఖ్య తగ్గుతోంది. గతేడాది రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2004లో 1,926 యూసీబీలుండగా.. 2018 మార్చి ఆఖరు నాటికి ఈ సంఖ్య 1,551కి పడిపోయింది. స్థూల మొండిబాకీలు 25 శాతం స్థాయి నుంచి 10 శాతం దిగువకు వచ్చాయి. ప్రక్షాళనతో సంస్థలు నిలదొక్కుకుంటున్నప్పటికీ.. భవిష్యత్‌లోనూ మనుగడ సాగించేందుకు టెక్నాలజీ బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది.

దేశీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 2017లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై  ఏకంగా 19.1 బిలియన్‌ డాలర్ల మేర ఖర్చు పెట్టాయి. ఇప్పటికే ఉన్న ఇన్‌ఫ్రాను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం, కొత్త ఇన్‌ఫ్రా ఏర్పాటుకు ఈ నిధులు వెచ్చించినట్లు 2017 నవంబర్‌లో గార్ట్‌నర్‌ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. అయితే యూసీబీ రంగానికి సంబంధించి ఇలాంటి గణాంకాలేమీ అందుబాటులో లేవు. కొత్త తరహా బ్యాంకింగ్‌ శరవేగంగా వాస్తవ రూపం దాలుస్తున్న నేపథ్యంలో యూసీబీలు సైతం వేగంగా డిజిటల్‌ వైపు మళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, ఈ క్రమంలో అనేక సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి.

చౌకగా హోస్టింగ్‌ సేవలు..
సాధారణంగా చిన్న బ్యాంకులకు సొంతగా క్లౌడ్‌ ఆధారిత సొల్యూషన్స్‌ను తయారు చేసుకునేంత ఆర్థిక సామార్ధ్యాలు ఉండవు. ఈ విషయం వాటిక్కూడా తెలుసు. అందుకే టెక్నాలజీ కంపెనీలు ఆఫర్‌ చేసే హోస్టింగ్‌ సర్వీసులపై మొగ్గు చూపుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ (సాస్‌) విధానంలో బ్యాంకులకు కావాల్సిన సొల్యూషన్స్‌ను టెక్నాలజీ సంస్థలు అందిస్తాయి. బ్యాంకులు ఎంచుకునే మాడ్యూల్‌కు సంబంధించి లావాదేవీకి ఇంతని టెక్‌ సంస్థలు చార్జ్‌ చేస్తాయి.

సహకార బ్యాంకులకు ఈ విధానం అనువైనదిగా ఉండగలదని ఐ–ఎక్సీడ్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఈడీ ఎస్‌ సుందరరాజన్‌ అభిప్రాయపడ్డారు. ఐ–ఎక్సీడ్‌ ప్రస్తుతం కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, డీబీఎస్‌ మొదలైన వాటికి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం సహకార బ్యాంకులతో కూడా చర్చలు జరుపుతోంది. ఇలాంటి థర్డ్‌ పార్టీ హోస్టింగ్‌ విధానంలో బ్యాంకులకు మౌలిక సదుపాయాల ఖర్చులు గణనీయంగా మిగిలిపోతాయి. అవి సొంతంగా సర్వర్లు లేదా విడిగా డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం వంటి వాటిపై ఖర్చు చేయనక్కర్లేదు.

సింపుల్‌గా అన్ని శాఖలను, సర్వీస్‌ ప్రొవైడర్స్‌ను ఇంటర్నెట్‌ ద్వారా అనుసంధానించే కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ ఒకటి అమలు చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఐటీ ఇన్‌ఫ్రా వ్యయాలు తగ్గడంతో పాటు సిస్టమ్స్‌ కూడా సురక్షితంగా ఉంటాయి. కొన్ని కోఆపరేటివ్‌ బ్యాంక్స్‌ ఇప్పటికే ఐబీఎం లాంటి పేరొందిన టెక్నాలజీ ప్రొవైడర్స్‌ అప్లికేషన్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ‘సాధారణంగా కొన్ని కోఆపరేటివ్‌ బ్యాంకులు.. చిన్న తరహా వ్యాపారుల ఖాతాలను తెరవడానికి సుమారు రెండు వారాల దాకా సమయం పట్టేస్తూ ఉంటుంది.  అదే క్లౌడ్‌ ఆధారిత ప్లాట్‌ఫాం ఎంచుకోవడం వల్ల ఈ సమయం రెండు రోజులకు తగ్గిపోయింది‘ అని ఐబీఎం ఇండియా చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ నటరాజన్‌ పేర్కొన్నారు.

ఎస్‌వీసీ బ్యాంక్, సారస్వత్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్, కాస్మోస్‌ బ్యాంక్‌ వంటి యూసీబీలు పేరుకు సహకార బ్యాంకులే అయినా పరిమాణంలో ఓ చిన్న స్థాయి కమర్షియల్‌ బ్యాంక్‌ స్థాయిలో ఉంటాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్‌ టెక్నాలజీవైపు వేగంగా మళ్లుతున్నాయి.  ఇన్ఫోసిస్‌ రూపొందించిన ఫినాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న సారస్వత్‌ బ్యాంక్‌.. ప్రత్యేకంగా ఐటీ అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం 70 శాతం పైచిలుకు లావాదేవీలు డిజిటల్‌ ద్వారానే జరుగుతున్నాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి. కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు రూపొందించేందుకు అనలిటిక్స్‌ సెల్‌ కూడా ఏర్పాటు చేసుకుంది.  కాస్మోస్‌ బ్యాంక్, ఎర్నాకులం డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ వంటివి కూడా క్రమంగా టెక్‌ వైపు మళ్లుతున్నాయి.

సవాళ్లూ ఉన్నాయి..
ఈ బ్యాంకులు డిజిటల్‌ వైపు మళ్లుతున్నప్పటికీ.. వీటికి ఉండే సవాళ్లు వీటికీ ఉన్నాయి. ఉదాహరణకు కాస్మోస్‌ బ్యాంక్‌ విషయాన్నే తీసుకుంటే పుణె కేంద్రంగా పనిచేసే ఈ సహకార బ్యాంకు ఖాతాల్లో నుంచి ఏటీఎం లావాదేవీల రూపంలో రూ.94 కోట్ల మేర నిధులు చోరీకి గురయ్యాయి. 28 దేశాల్లో ఈ లావాదేవీలు జరిగాయి. దీనిపై అంతర్జాతీయ భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. దీనికి ఉత్తర కొరియాది బాధ్యతగా తేల్చింది. అత్యంత నైపుణ్యమున్న హ్యాకర్లకు.. ఇలాంటి చిన్న బ్యాంకులు సులువుగా టార్గెట్‌గా మారతాయనడానికి ఇదో నిదర్శనం. కాబట్టి ఈ తరహా బ్యాంకులకు సెక్యురిటీ ఇన్‌ఫ్రాను సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా ఉంటోంది. ఇక కొన్ని యూసీబీలు కొత్తగా మారడానికి ఇష్టపడటం లేదు. అలాగే, సహకార బ్యాంకులంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఆర్‌బీఐ నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుంది. దీంతో గవర్నెన్స్‌ పరమైన సమస్యలు వస్తున్నాయి. అటు రాజకీయ నేతల జోక్యం కూడా ఉంటోంది. దీంతో ఆయా బ్యాంకులు కొంగొత్త టెక్నాలజీలకు దూరంగా ఉంటే శ్రేయస్కరమని భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement