
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత నెమ్మదిగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి పరుగందుకున్నాయి. ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో వెనుదిరిగి చూడలేదు. వెరసి సెన్సెక్స్ 499 పాయింట్లు జంప్‌చేసి 35,414 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 128 పాయింట్లు జమ చేసుకుని 10,430 వద్ద నిలిచింది. తద్వారా మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలో స్థిరపడ్డాయి. సమయం గడుస్తున్నకొద్దీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఒక దశలో 35,467వరకూ ఎగసింది. తొలుత 34,927 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో తొలుత 10,300కు స్వల్ప వెనకడుగు వేసినప్పటికీ నిఫ్టీ ఆపై 10,447కు పెరిగింది.
ఎఫ్‌ఎంసీజీ సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్ 3.6 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 2.7 శాతం చొప్పున జంప్‌చేయగా.. మీడియా 2 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఫార్మా, రియల్టీ 1-0.7 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, యూపీఎల్, బజాజ్ ఫిన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, జీ 6.3-2.4 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎన్‌టీపీసీ, నెస్లే, ఎల్‌అండ్‌టీ, శ్రీ సిమెంట్, సిప్లా, బ్రిటానియా, ఎంఅండ్‌ఎం, ఇన్‌ఫ్రాటెల్, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా 2-1 శాతం మధ్య నీరసించాయి.
ఫైనాన్స్ జోరు
డెరివేటివ్స్‌లో ఐబీ హౌసింగ్, ఉజ్జీవన్, బీవోబీ, భారత్ ఫోర్జ్, కెనరా బ్యాంక్, మణప్పురం, పీఎన్‌బీ 8-5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు జిందాల్ స్టీల్, ఐడియా, గ్లెన్‌మార్క్, కాల్గేట్ పామోలివ్, ఎంఆర్‌ఎఫ్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1501 లాభపడగా.. 1281 నష్టపోయాయి.
డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం రూ. 2000 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2051 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1937 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1036 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.