సాక్షి, బిజినెస్ విభాగం: డిజిటల్ మాధ్యమంలో ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటున్నప్పటికీ.. బ్యాంకులు సంప్రదాయ బ్రాంచి బ్యాంకింగ్‌ను కూడా మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇటు మొబైల్, డిజిటల్ అటు బ్రాంచీల సాయంతో మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విధానాన్నే ముద్దుగా ఫిజిటల్‌గా (ఫిజికల్+డిజిటల్) వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ ఉదయ్ కోటక్ తొలుత చేసిన ఈ పదప్రయోగం.. నెమ్మదిగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడటం, నెట్ అందుబాటులోకి రావడం వల్ల 2011 నుంచి మొబైల్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అయితే, వీటితో పాటు శాఖలు కూడా కంటి ముందు కనిపిస్తుంటే ఖాతాదారులకు బ్యాంకుపై భరోసా ఉంటోందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు అటు ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా పోటాపోటీగా శాఖలు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాయి. సాధారణంగా అన్ని వర్గాలకూ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యతతో ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృతంగా శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇపుడు ప్రైవేట్ బ్యాంకులు కూడా కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, డిపాజిట్లను పెంచుకునేందుకు శాఖలను పెంచుకుంటున్నాయి.
డిజిటల్‌తో వినూత్న ప్రయోగాలు..
మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా మరింత వినూత్నమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వీటికి ఖాతాదారుల నుంచి సానుకూల స్పందన కూడా వస్తోంది. అదే సమయంలో డిజిటల్‌కు సమానంగా ఫిజికల్ (భౌతికంగా) శాఖలూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం బ్యాంకింగ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘బ్రాంచీలు ప్రధానంగా కస్టమర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయి. శాఖలపరంగా భారీ నెట్‌వర్క్ ఉంటే కస్టమర్లకు భరోసా ఉంటుంది. ఇక శాఖల నెట్‌వర్క్‌కు డిజిటల్ చానల్స్ అనుబంధంగా పనిచేస్తాయి. మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు, ఇంకొంత మంది కొత్త కస్టమర్స్‌కు చేరువయ్యేందుకు ఉపయోగపడతాయి. ఫెడరల్ బ్యాంక్ విషయం తీసుకుంటే శాఖల్లో జరిగే 75 శాతం పైగా లావాదేవీలు ప్రస్తుతం డిజిటల్ చానల్స్ ద్వారా జరుగుతున్నాయి. మాకు దేశవ్యాప్తంగా పటిష్టమైన శాఖల నెట్‌వర్క్ ఉంది. గడిచిన మూడేళ్లలో కొత్త శాఖలేమీ ప్రారంభించలేదు కానీ.. ఈ ఏడాదిలో దీనిపై మళ్లీ కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇటు డిజిటల్‌తో పాటు అటు బ్రాంచీల తోడ్పాటుతో ఫిజిటల్ సేవలు కొనసాగిస్తాం‘ అని ఫెడరల్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్ హెడ్) జితేష్ పీవీ తెలిపారు.
శాఖల్లో ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం..
డిజిటల్, మొబైల్ మాధ్యమాలు ఉన్నప్పటికీ.. ఖాతాదారులకు ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వటంలో బ్యాంకుల శాఖలు ముందుంటాయని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ ప్రకాష్ సుందరం చెప్పారు. ‘‘సెల్ఫ్ సర్వీస్ డిజిటల్ కావొచ్చు.. అసిస్టెడ్ డిజిటల్ విధానం (బ్యాంకింగ్ సిబ్బంది సహాయంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవడం) కావొచ్చు.. శాఖ తీరు బాగుంటేనే ఆ బ్యాంకుతో లావాదేవీలు నిర్వహించేందుకు కస్టమరు ఇష్టపడతారు. కాబట్టి పరిమాణంలో చిన్నవైనా సరే శాఖల ప్రాధాన్యం తగ్గదు’’ అని ప్రకాష్ సుందరం చెప్పారు. యువతరం ఎక్కువగా మొబైల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ.. కొంత పాత తరం 45–50 ఏళ్ల వాళ్లు ఇప్పటికీ బ్యాంకు శాఖల ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేకంగా లాకరు సదుపాయం, వ్యక్తిగత ఆర్థిక సేవలు కోరుకునే సంపన్న వర్గాలకు కూడా బ్యాంకు శాఖలు అవసరమని ప్రకాష్ చెప్పారు.
యాక్సిస్ ఏటా 400 శాఖలు..
వినూత్న డిజిటల్ సేవలు ఆవిష్కరించడంతో పాటు మరిన్ని శాఖల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి చెప్పారు. ఏటా 400 శాఖలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం శాఖల సంఖ్య 5,500కు చేరే దాకా ఇదే విధానం కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాక్సిస్ ఈ ఏడాది మార్చిలో తమ 4,000వ శాఖను ఏర్పాటు చేసింది. ఆర్‌బీఎల్ వంటి చిన్న బ్యాంకులు కూడా శాఖలను పెంచుకుంటున్నాయి.
2018 మార్చి ఆఖరు నాటికి 265గా ఉన్న ఆర్‌బీఎల్ బ్రాంచీల సంఖ్య 2019 మార్చి 31 నాటికి 324కి పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇటీవల ఫిబ్రవరిలోనే తమ 5,000వ బ్రాంచీని ప్రారంభించింది. అయితే, బ్రాంచీల నెట్‌వర్క్‌పరంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్‌బీ) ఆధిపత్యం ఉంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం గతేడాది జూన్ ఆఖరు నాటికి పీఎస్‌బీ శాఖల సంఖ్య 90,821గా ఉంది. అదే ప్రైవేట్ బ్యాంకుల శాఖల సంఖ్య 28,805కి పరిమితమైంది.
బ్యాంకుల ‘ఫిజిటల్’ మంత్రం!
Published Thu, Jun 6 2019 5:11 AM | Last Updated on Thu, Jun 6 2019 5:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment