న్యూఢిల్లీ: రుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడడమే తరువాయి. దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఐబీసీని గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఐబీసీలో పలు సవరణలు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అయితే, ఇందులో మార్పులు ఏంటన్నది ఆయన వెల్లడించలేదు. రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉన్నందున అప్పటి వరకు వివరాలు వెల్లడించడానికి లేదన్నారు. అయితే, ప్రభుత్వంలోని ఉన్నత వర్గాల సమాచారం మేరకు... రుణ ఎగవేతదారుల ఆస్తులను (స్ట్రెస్డ్ అసెట్స్/ఎన్‌పీఏ) వేలం వేసినప్పుడు... వాటిని రుణ ఎగవేత చరిత్ర ఉన్న ప్రమోటర్లు, మోసపూరిత చరిత్ర కలిగిన ప్రమోటర్లు సొంతం చేసుకోకుండా నిరోధించడమే ఆర్డినెన్స్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అలాగని, బ్యాంకులకు రుణ బకాయి పడిన కంపెనీల ప్రమోటర్లను వేలంలో పాల్గొనకుండా పూర్తి నిషేధం విధించడంగా దీన్ని చూడరాదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ‘‘కార్పొరేట్ పరిష్కార ప్రక్రియను అనుసరించేవారు, తమ బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకునే ప్రమోటర్లు కూడా ఉన్నారు. వీరిని ఐబీసీ కింద వేలం వేసే ఆస్తుల కొనుగోలుకు దూరంగా ఉంచడం లేదు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఆర్డినెన్స్ స్థానంలో సవరణలతో కూడిన చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
వారి ఆస్తులు వారికే దక్కుకుండా..!
ఐబీసీ కింద ఇప్పటికే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో 300 కేసులు పరిష్కారం కోసం దాఖలయ్యాయి. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకు ఈ ఏడాది జూన్‌లో 12 భారీ ఎన్‌పీఏ ఖాతాలను ఐబీసీ కింద పరిష్కారం కోసం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఈ 12 ఖాతాలకు సంబంధించిన రుణ ఎగవేతల మొత్తం రూ.1.75 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఖాతాల్లో ఆమ్టెక్ ఆటో, భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, భూషన్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, మోనెత్ ఇస్పాత్, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, ఎరా ఇన్‌ఫ్రా, జైపీ ఇన్‌ఫ్రాటెక్, ఏబీజీ షిప్‌యార్డ్, జ్యోతి స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటిలో 11 కేసులు ఎన్‌సీఎల్‌టీలో దాఖలు కాగా, దివాళా ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్‌బీఐ 30 నుంచి 40 ఎన్‌పీఏ ఖాతాలతో ఐబీసీ కింద చర్యలు చేపట్టాలంటూ బ్యాంకులకు మరో జాబితా కూడా పంపించింది. అయితే, ఐబీసీ కింద కంపెనీల ఆస్తులను వేలానికి ఉంచినప్పుడు బిడ్ వేసే వారి అర్హతలు ఏంటన్నది చట్టంలో నిర్దేశించలేదు. దీంతో రుణాలు ఏగవేసిన ప్రమోటర్లే తిరిగి ఆస్తులను తక్కువ ధరలకు సొంతం చేసుకునే అవకాశం ఉందంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఇందుకు ఎస్సార్ స్టీల్ కేసే ఉదాహరణ. ఎస్సార్ స్టీల్ రూ.37,284 కోట్ల బకాయిలు బ్యాంకులకు చెల్లించకుండా చేతులు ఎత్తేసింది. ఐబీసీ పరిష్కార ప్రక్రియ కింద ఎస్సార్ స్టీల్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎస్సార్ గ్రూపు ఆసక్తి వ్యక్తీకరించడం గమనార్హం. ‘‘ఈ విధమైన ఆందోళనల నేపథ్యంలో దివాళా చట్టం కింద ఆస్తులకు అర్హత కలిగిన వారే బిడ్ వేసే విధంగా చూసేందుకు చట్టంలో సవరణలు ప్రతిపాదించాల్సి వచ్చింది’’ అని అధికార వర్గాలు తెలిపాయి.
కేబినెట్ ఇతర నిర్ణయాలు...
15వ ఆర్థిక సంఘం ఏర్పాటు
15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ సంఘం పన్నుల ఆదాయ వనరులను మదింపు వేసి వాటిని కేంద్రం, రాష్ట్రాల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలన్న విధానాన్ని రూపొందిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆర్థిక సంఘం తన సిఫార్సులను సమర్పించేందుకు రెండేళ్ల సమయం తీసుకోవడం సాధారణం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు కాలానికి అమల్లో ఉంటాయి.
ఈబీఆర్‌డీలో సభ్యత్వం
యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఈబీఆర్‌డీ)లో భారత సభ్యత్వం తీసుకునేందుకు కేబినెట్ ఇచ్చింది. దీంతో తయారీ, సేవలు సహా వివిధ రంగాలకు కావాల్సిన నిధుల సమీకరణ సులభం కానుంది. ఈబీఆర్‌డీలో సభ్యత్వం తీసుకునేందుకు అవసరమైన చర్యల్ని ఆర్థిక వ్యవహారాల విభాగం చేపడుతుందని జైట్లీ తెలిపారు.
ఐఐసీఏకు రూ.18 కోట్లు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ)కు రూ.18 కోట్ల సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకానికీ కేబినెట్ ఆమోదముద్ర పడింది.
ఇక ఐటీ చట్టాల్లో భారీ మార్పులు!
సమీక్ష కోసం అత్యున్నత స్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్ లిఖించడం, ముసాయిదా రూపకల్పన ఈ కమిటీ కర్తవ్యం. ఆరు నెలల్లో కమిటీ ఈ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంది. ఆరుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీ సభ్యులు (లెజిస్లేషన్) అరవింద్‌మోదీ కన్వీనర్‌గా ఉంటారు. గిరీష్ అహూజా (చార్డెడ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ పార్ట్నర్) మాన్సీ కేడియా (కన్సల్టెంట్, ఐసీఆర్‌ఐఈఆర్) కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కమిటీకి శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం పన్ను వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలు ఏమిటి? దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉండాలి? వంటి అంశాలను తన కర్తవ్య నిర్వహణలో కమిటీ పరిశీలిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment