Bankruptcy law
-
’జీ’ సుభాష్ చంద్రపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం, జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) గౌరవ చైర్మన్ సుభాష్ చంద్రపై దివాలా చట్టం కింద ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ వివేక్ ఇన్ఫ్రాకాన్ తీసుకున్న రుణాలకు గ్యారంటార్‌గా ఉన్న చంద్రపై ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్ఎల్) దాఖలు చేసిన పిటీషన్ మీద ఎన్సీఎల్టీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మరో రెండు సంస్థలు (ఐడీబీఐ ట్రస్టీíÙప్, యాక్సిస్ బ్యాంక్) దాఖలు చేసిన ఇదే తరహా పిటీషన్లను తోసిపుచి్చంది. ఓపెన్ కోర్టులో ఎన్సీఎల్టీ ఈ ఆర్డరులివ్వగా పూర్తి వివరాలతో కూడిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. వివరాల్లోకి వెడితే చంద్రా ప్రమోట్ చేస్తున్న ఎస్సెల్ గ్రూప్‌లో భాగమైన వివేక్ ఇన్ఫ్రాకాన్ సంస్థ 2022లో ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ. 170 కోట్ల రుణం డిఫాల్ట్ అయ్యింది. దీనిపైనే ఐహెచ్ఎఫ్ఎల్ .. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వ్యక్తిగత గ్యారంటార్లు.. దివాలా ప్రొసీడింగ్స్ పరిధిలోకి రారని, తనపై చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీకి ఎలాంటి అధికారాలు ఉండవని చంద్రా వాదనలు వినిపించారు. అయితే, దీన్ని ఎన్సీఎల్టీ తిరస్కరించగా .. చంద్రా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా బకాయిలను తీర్చకపోవడంతో ఐహెచ్ఎఫ్ఎల్ ఈ ఏడాది ప్రారంభంలో కేసును తిరగదోడింది. -
బోరిస్ బెకర్‌కు జైలుశిక్ష
లండన్: దివాలా కేసులో జర్మనీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. 54 ఏళ్ల బెకర్ తన దగ్గర రుణ చెల్లింపులకు ఏమీ లేదని, దివాలా తీశానని ప్రకటించి... ఉన్న ఆస్తిపాస్తుల్ని దాచి, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశాడు. దీనిపై విచారించిన లండన్ కోర్టు దివాలా చట్టం ప్రకారం శిక్ష విధించింది. మొత్తం నాలుగు కేసులకి సంబంధించి గరిష్టంగా ఏడేళ్లదాకా జైలుశిక్ష విధించే అవకాశముంది. అయితే వాదోపవాదాల అనంతరం రెండున్నరేళ్ల శిక్షను ఖరారు చేసింది. జర్మనీలోని బ్యాంక్‌కు 50 లక్షల డాలర్ల (రూ.38.25 కోట్లు) రుణాన్ని చెల్లించకుండా అనైతిక పద్ధతిలో బోరిస్ బెకర్ దివాలా పిటిషన్‌తో బయటపడాలని చూశాడు. 2012 నుంచి బ్రిటన్‌లో నివసిస్తున్న బెకర్ మొత్తం ఆరు (వింబుల్డన్ –1985, 1986, 1989; ఆస్ట్రేలియన్ ఓపెన్–1991, 1996; యూఎస్ ఓపెన్–1989) గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
తుది దశకు సింటెక్స్ రిజల్యూషన్
న్యూఢిల్లీ: దివాలా చట్ట చర్యలలో ఉన్న సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణ పరిష్కార ప్రణాళిక(రిజల్యూషన్) తుది దశకు చేరింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)సహా నాలుగు కంపెనీలు సవరించిన బిడ్స్‌ను దాఖలు చేశాయి. వీటిని రుణదాతల కమిటీ(సీవోసీ) పరిశీలించనుంది. రుణ సమస్యల్లో చిక్కుకున్న టెక్స్టైల్స్ కంపెనీ సింటెక్స్ ఇండస్ట్రీస్ కొనుగోలుకి అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజ్‌తో జత కట్టిన ఆర్ఐఎల్ రూ. 2,800 కోట్ల విలువలో బిడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ఈజీగో టెక్స్టైల్స్(వెల్స్పన్ గ్రూప్), జీహెచ్‌సీఎల్, హిమంత్సింగ్కా వెంచర్స్ సైతం బిడ్స్‌ను దాఖలు చేసినట్లు గత వారమే సింటెక్స్ వెల్లడించింది. సవరించిన బిడ్స్‌ను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ సమీక్షించనున్నట్లు కంపెనీ పేర్కొంది. -
మరింత పటిష్టంగా దివాలా కోడ్..!
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కార్పొరేట్ల కష్టాలను సాధ్యమైనంత వేగంగా, సమర్థవంతమైన రీతిలో పరిష్కరించడం లక్ష్యంగా దివాలా కోడ్ (ఐబీసీ)కు అవసరమైన మరిన్ని సవరణలు తీసుకువస్తున్నట్టు బడ్జెట్ సూచించింది. ముఖ్యంగా విదేశాలకు సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల దివాలా పక్రియను సులభతరం లక్ష్యంగా ఈ సవరణలు తీసుకువస్తున్నట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడించాయి. ప్రస్తుతం విదేశీ రుణదాతలు భారతదేశంలోని దేశీయ కంపెనీకి వ్యతిరేకంగా దావా వేయవచ్చు. అయితే, ఇతర దేశాలలో ఏదైనా దివాలా ప్రక్రియను ఐబీసీ ఆటోమేటిక్‌గా తనకుతానుగా గుర్తించదు. విదేశాల్లో రుణ సంక్షోభంలో కంపెనీల ఆస్తులు, అప్పులను క్లెయిమ్ చేయడానికి, డబ్బును తిరిగి పొందేందుకు రుణ దాతలకు వీలు కల్పిస్తూ ఒక ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్ అవసరమని సోమవారం నాడు ఆవిష్కరించిన ఆర్థిక సర్వే సూచించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛంద లిక్విడేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడంతోపాటు ఈ ప్రక్రియ కోసం ఒకే విండోను ఆవిష్కరించాలని కూడా సర్వే సూచించింది. కంపెనీల దరఖాస్తు నుంచి అన్ని శాఖల ప్రాసెసింగ్ వరకూ లిక్విడేషన్ ప్రక్రియలో అన్ని దశలూ త్వరితగతిన వేగంగా పూర్తయ్యేలా ఒక పోర్టల్‌ను ఆవిష్కరించాలని, దివాలా పక్రియ మరింత వేగవంతానికి ఈ చర్య దోహదపడుతుందని సర్వే సూచించింది. కంపెనీల రుణాలకు సంబంధించి 98 శాతం వరకూ రాయితీలు ఇస్తూ, కంపెనీ ఆఫ్ క్రెడిటార్స్ రిజల్యూషన్ ప్రణాళికల ఆమోదంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వీడియోకాన్ గ్రూప్‌కు వేదాంతా గ్రూప్ సంస్థ ట్విన్ స్టార్ వేసిన బిడ్డింగ్‌ను కొన్ని వార్గాలు ప్రస్తావిస్తున్నాయి. (చదవండి: టాటా నెక్సన్ ఈవీకి పోటీగా అదరగొడుతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ కారు..!) -
దివాలా చట్టంతో రుణ వ్యవస్థలో మార్పు
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ)తో రుణ వ్యవస్థలో పెను సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం తీసుకువచ్చిన ఈ చట్టంతో రుణ దాతలు, రుణ గ్రహీతల వైఖరిలో కూడా మార్పు చోటుచేసుకుందని అన్నారు. ఇచ్చిన రుణం తిరిగి వస్తుందన్న భరోసా రుణదాతకు, తీసుకున్న రుణం తప్పనిసరిగా తీర్చాలన్న అభిప్రాయం రుణ గ్రహీతకు కలిగినట్లు పేర్కొన్నారు. ఆయా అంశాలు దేశంలో సరళతర వ్యాపార వృద్ధికి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దోహదపడుతున్నట్లు వివరించారు. రుణ వ్యవస్థకు సంబంధించి ఐబీసీ ఒక పెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు. రుణ పరిష్కారానికి గతంలో దశాబ్దాలు పట్టేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ప్రతి దశ దివాలా వ్యవహారం నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తయ్యే వ్యవస్థ ప్రస్తుతం నెలకొందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఐసీఏఐ (ఐఐఐపీఐ) ఐదవ వ్యవస్థాపక దినోత్సవంలో గోయెల్ ఈ కీలక ప్రసంగం చేశారు. రానున్న కాలంలో భారత్ విశ్వసనీయత, దేశ ఫైనాన్షియల్ నిర్మాణం మరింత బలపడతాయని గోయెల్ అన్నారు. ఐఐఐపీఐకు ఐదు మార్గదర్శకాలు... పనిలో సమగ్రత, నిష్పాక్షికత, వృత్తిపరమైన సామర్థ్యం, గోప్యత, పారదర్శకత అనే ఐదు మార్గదర్శక సూత్రాలను అనుసరించాలని మంత్రి ఐఐఐపీఐ సభ్యులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ ఐదు సూత్రాలను అనుసరిస్తే, నిపుణులు ఆశించే వృత్తిపరమైన ప్రవర్తన మరింత ఇనుమడిస్తుందని అన్నారు. వీటితోపాటు మరే ఇతర తరహా విధినిర్వహణ తమ సామర్థ్యాన్ని, పనితీరును పెంచుతుందన్న విషయాన్ని సభ్యులు గుర్తించాలన్నారు. మొండి బకాయిల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యమని అన్నారు. వ్యాపార సంస్థల ఏర్పాటు, నిర్వహణలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఐఐఐపీఐ తనవంతు కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కోవిడ్–19 కాలంలో వ్యాపారాలను కష్టాల నుండి రక్షించడానికి, 2020 మార్చి నుండి 2021 మార్చి వరకు డిఫాల్ట్‌ల నుండి ఉత్పన్నమయ్యే దివాలా చర్యలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. -
పిరమల్ చేతికి దివాన్ హౌసింగ్
న్యూఢిల్లీ: దివాళా చట్ట చర్యలకు లోనైన ఎన్బీఎఫ్సీ.. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్)ను పిరమల్ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఆర్బీఐ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రుణ భారంతో కుదేలైన డీహెచ్ఎఫ్ఎల్ను కొనుగోలు చేసేందుకు పిరమల్ గ్రూప్ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఇప్పటికే రుణదాతల కమిటీ(సీవోసీ) ఆమోదముద్ర వేసింది. పిరమల్ గ్రూప్ కంపెనీ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను జనవరి 15న సీవోసీ ఆమోదించింది. భారీ నష్టాలు..: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో డీహెచ్ఎఫ్ఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,095 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ3లో రూ. 934 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లోనూ డీహెచ్ఎఫ్ఎల్ రూ. 2123 కోట్ల నష్టాలు ప్రకటించడం గమనార్హం! ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్పై దివాళా చర్యలకు వీలుగా 2019 నవంబర్‌లో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు సిఫారసు చేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 18 వద్ద ముగిసింది. -
అమెరికాలో బ్రాండ్ల దివాలా..
న్యూయార్క్: అమెరికాలో శతాబ్దాలుగా కొనసాగుతున్న రిటైల్ దిగ్గజ సంస్థలు కరోనా వైరస్ దెబ్బతో మూతబడుతున్నాయి. రోజురోజుకూ ఈ లిస్టు గణనీయంగా పెరుగుతోంది. తాజాగా లార్డ్ అండ్ టేలర్, మెన్స్ వేర్‌హౌస్, జోస్ ఎ బ్యాంక్స్ తదితర సంస్థలు దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. లార్డ్ అండ్ టేలర్ 1824లో ప్రారంభమైంది. దీన్ని గతేడాదే ఫ్రాన్స్‌కి చెందిన దుస్తుల రెంటల్ సంస్థ లె టోట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ రెండూ వేర్వేరుగా దివాలా పిటిషన్లు దాఖలు చేశాయి. కొనుగోలుదారు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లార్డ్ అండ్ టేలర్ వెల్లడించింది. దాదాపు శతాబ్దంపైగా తమ చేతుల్లోనే ఉన్న 11 అంతస్తుల భవంతిని ఈ కంపెనీ గతేడాదే విక్రయించింది. ఇక, సూట్లకు డిమాండ్ పడిపోవడంతో మెన్స్ వేర్‌హౌస్, జోస్ ఎ బ్యాంక్స్ స్టోర్స్ వంటి బ్రాండ్ల మాతృసంస్థ టైలర్డ్ బ్రాండ్స్ కష్టాలు మరింత పెరిగి, దివాలాకు దారితీశాయి. మరోవైపు, దాదాపు అమెరికా అధ్యక్షులందరికీ దుస్తులు అందించిన 200 ఏళ్ల నాటి సంస్థ బ్రూక్స్ బ్రదర్స్ కూడా దివాలా పిటిషన్ వేసింది. మొత్తం మీద గతేడాది మొత్తంమీద దాఖలైన దివాలా పిటిషన్లతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో దాఖలైనవే ఎక్కువ కావడం గమనార్హం. కరోనా వైరస్ మహమ్మారి ప్రబలడం మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా రెండు డజన్లపైగా స్టోర్స్ దివాలా తీశాయి. జె క్రూ, జేసీ పెన్నీ, నైమాన్ మార్కస్, స్టేజ్ స్టోర్స్, ఎసెనా రిటైల్ గ్రూప్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. -
దివాలా చర్యలకు 6 నెలల బ్రేక్!
న్యూఢిల్లీ : కరోనా కష్ట కాలంలో కార్పొరేట్ రుణ గ్రహీతలకు పెద్ద ఉపశమనం కల్పించే విధంగా దివాలా చట్టానికి సవరణలను కేంద్రం తీసుకురానుంది. కంపెనీలు తీసుకున్న రుణాలకు చెల్లింపులు చేయకపోతే దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) చట్టంలోని నిబంధనల ప్రకారం నిర్ణీత కాలం తర్వాత అంటే 90 రోజుల అనంతరం ఎన్పీఏగా గుర్తించి దివాలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, లౌక్‌డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు పనిచేసే అవకాశం లేదు. ఈ ప్రభావం చాలా కాలం పాటు కంపెనీలపై ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. కంపెనీలపై దివాలా చర్యలకు వీలు కల్పించే చట్టంలోని సెక్షన్ 7, 9, 10ను కొంతకాలం పాటు సస్పెండ్ చేసే విధంగా చట్టంలో కేంద్రం సవరణలు తీసుకురానున్నట్టు అధికార వర్గాల సమాచారం. దీంతో చెల్లింపులు చేయలేని కంపెనీల రుణాలను పునరుద్ధరించే వీలు బ్యాంకులకు ఏర్పడుతుంది. తొలుత ఆరు నెలల కాలానికి ఈ నిబంధనలను సస్పెండ్ చేసి, తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి కార్పొరేట్ రుణాల పునరుద్ధరణకు ఆర్బీఐ నిబంధనలు అనుమతించడం లేదు. దీంతో చెల్లింపుల్లో విఫలమైతే ఐబీసీ చట్టం కింద ఆయా రుణ ఖాతాల విషయంలో బ్యాంకులు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. లాక్డౌన్లో జాప్యాన్ని డిఫాల్ట్‌గా చూడవద్దు: సెబీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కలిగి ఉన్న మనీ మార్కెట్, డెట్ సెక్యూరిటీలకు సంబంధించి లాక్డౌన్ కాలంలో అసలు, వడ్డీ చెల్లింపులు, కాల వ్యవధి పొడిగింపులను డిఫాల్ట్‌గా పరిగణించవద్దని వ్యాల్యుషన్ ఏజెన్సీలను సెబీ కోరింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్నందున మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సెబీ దృష్టికి రావడంతో ఈ పరిణామం జరిగింది. మరోవైపు రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియంకు ఆర్బీఐ అనుమతించడం తెలిసిందే. -
సంస్కరణల సారథి
దివాలా చట్టంతో బ్యాంకులకు ఊరట ఒకపక్క స్కాముల కంపు కొడుతున్న వ్యవస్థ, మరోపక్క దిగజారిన విదేశీ నిధులు!!. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎకనమిస్టుకైనా సంస్కరణల అమలు కత్తిమీద సామే. కానీ ఈ రాజకీయ లాయర్‌కు మాత్రం అది ఒక సంక్లిష్టమైన కేసులాగే కనిపించింది. దాన్ని గెలిచేవరకు వదలకూడదన్న పట్టుదలతో రోజుకు 16 గంటలు పనిచేస్తూ చివరకు కేసు గెలిపించారు. ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎకానమీలో రెండు అతిపెద్ద కుదుపులు సంభవించాయి. 2016లో ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు ఎకానమీని స్తంభింపజేసింది. దీంతో దాదాపు రెండు త్రైమాసికాల పాటు జీడీపీ ఒక్కసారిగా కుంచించుకుపోయింది. షాక్ తిన్న ఎకానమీని పట్టాలెక్కించి తిరిగి జీడీపీని గాడిన పెట్టడంలో జైట్లీది కీలక పాత్ర. ఒకపక్క ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మరోపక్క నిర్ణయ పర్యవసానాలను ఎదుర్కొంటూ ఆయన అత్యంత సమర్ధవంతంగా ఎకానమీని నడిపించారని ఎకనమిస్టులు ప్రశంసిస్తారు. నోట్ల రద్దు తర్వాత ఏడాది జీఎస్టీ అమలు చేయడం ద్వారా అప్పటివరకు ఉన్న పన్ను వ్యవస్థ మొత్తాన్ని కదలించారు. నోట్ల రద్దుతో సతమతమై కుదుటపడుతున్న ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ మరో షాక్‌లాగా తగిలింది. దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా ఆలోచనల్లోనే ఉంటూ వచ్చిన ఒకే దేశం, ఒకే పన్ను వ్యవస్థను జైట్లీ సాకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ‘‘పాత భారతం ఆర్థికంగా ముక్కలుగా కనిపిస్తోంది, కొత్త భారతం ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్‌గా మారుతుంది’’ అన్నారు. ఇండియా ఎకానమీలో అతిపెద్ద సంస్కరణగా జీఎస్టీని ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారు. కేవలం సంస్కరణను ప్రవేశపెట్టడం కాకుండా, ఎప్పటికప్పుడు దాని అమలును సమీక్షిస్తూ, అవసరమైన మార్పులు చేస్తూ జైట్లీ జీఎస్టీని సానుకూలంగా మార్చారు. రాజకీయంగా కూడా జీఎస్టీ పట్ల దాదాపు ఏకాభిప్రాయాన్ని సాధించడం ఆయన విజయంగా నిపుణులు అభివర్ణిస్తారు. ఎగవేతదారులకు చెక్ ఈ రెండు సంస్కరణలతో పాటు జైట్లీ హయాంలో తీసుకువచ్చిన మరో ముఖ్యమైన సంస్కరణ దివాలా చట్టం ఏర్పాటు చేయడం. ఈ చట్టంతో క్రెడిట్ కల్చర్‌లో మంచి మార్పులు వచ్చాయి. రుణదాతలకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎగవేతలంటే భయపడే స్థితి ఏర్పడింది. ముఖ్యంగా క్రోనీ క్యాపిటలిజం నిర్మూలనకు ఇది సమర్ధవంతంగా పనిచేసిందని ప్రముఖ ఎకనమిస్టులు కొనియాడారు. ఆర్బీఐ, ద్రవ్యపరపతి సమీక్ష అంశాలపై జైట్లీకి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కేంద్రబ్యాంకుకు మరింత స్వయం ప్రతిపత్తి ఉండాలని, ద్రవ్యోల్బణం కట్టడే సమీక్షా సమావేశ ప్రధాన అజెండా కావాలని ఆయన అభిప్రాయపడేవారు. ఆయన మరణం పట్ల అటు రాజకీయనాయకులతో పాటు ఇటు కార్పొరేట్ వర్గాలు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక సంస్కరణలు సమర్ధవంతంగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా కార్పొరేట్ ప్రపంచం జైట్లీని కొనియాడుతోంది. దేశాభివృద్ధికి విశేష కృషి: కోవింద్ జైట్లీ మరణం తీవ్రవిచారకరం. ఆయనో న్యాయవాది, గొప్ప పార్లమెంటేరియన్, సమర్థుడైన మంత్రి. ఈ దేశ పురోగతి కోసం ఆయన ఎంతో కృషిచేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. విలువైన మిత్రుడు: వెంకయ్య జైట్లీ లేని లోటు పూడ్చలేనిది. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు నష్టమే. పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి మరువలేనిది. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. స్నేహితుడిని కోల్పోయా: మోదీ జైట్లీ మృతితో ఒక విలువైన స్నేహితుడిని కోల్పోయానంటూ ప్రధాని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి భారత సంతతి ప్రజలతో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. ‘దేశం కోసం నిరంతరం సేవ చేసిన అత్యున్నత మేధో సంపత్తి కలిగిన దిగ్గజ రాజకీయ నేత అరుణ్ జైట్లీ. నాకు విలువైన మిత్రుడు. ఆయన లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అరుణ్ జైట్లీ ఎన్నో మంత్రిత్వ శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. కొద్ది రోజుల క్రితమే నా సొదరి, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మనల్ని విడిచి పోయారు. ఆ బాధ మరవకముందే.. నా ప్రియ మిత్రుడు జైట్లీ కూడా లేరనే వార్త రావడం విచారకరం’ అంటూ మోదీ సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ సేవలు చిరస్మరణీయం: కేసీఆర్ జైట్లీ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘జైట్లీ మరణం తీరని లోటు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అంటూ కేసీఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మేధావి, స్నేహశీలి: జగన్ అరుణ్ జైట్లీ ఇకలేరనే వార్తతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘జైట్లీ మరణవార్తపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన ఓ మంచి మేధావి, స్నేహశీలి, చాలా అంశాలపై స్పష్టత కలిగిన వ్యక్తి. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేం’అని జగన్ ట్వీట్ చేశారు. కార్పొరేట్ ప్రపంచం నివాళి న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల దేశ వ్యాపార వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన్ను నిజమైన సంస్కరణవాదిగా కార్పొరేట్ వర్గాలు కొనియాడాయి. జైట్లీ ఒక డైనమిక్ పార్లమెంటేరియన్ అని, వివిధ వర్గాలను సమన్వయం చేసుకోవడంలో ఆయన నేర్పరి అని, న్యూ ఇండియా అవతరణలో ఆయన ఆలోచనలు అత్యంత కీలకపాత్ర పోషించాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కొనియాడారు. జైట్లీ మరణం దేశం పూడ్చుకోలేని లోటని వేదంతా చైర్మన్ అనిల్ అగర్వాల్, సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్సోమానీ, జేఎస్‌డబ్లు్య గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తదితరులు జైట్లీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. –సాక్షి, బిజినెస్ వెబ్ విభాగం -
మొండి బండ.. మరింత భారం!
మొండి బకాయిలు... ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సమస్య తీవ్రత తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ సమస్య కారణంగానే గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నిర్వహణ నష్టాలు రూ.50,000 కోట్లకు మించాయి. అంతే కాకుండా భారీ కంపెనీల కొన్ని బకాయిలు మొండిగా మారే ప్రమాదమూ పొంచి ఉంది. మార్చి క్వార్టర్ చివరినాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల స్థూల మొండి బకాయిలు రూ.7.7 లక్షల కోట్లకు తగ్గింది. అయితే ఇది ఏమంత ఊరటనిచ్చే విషయం కాదని నిపుణులంటున్నారు. దివాలా ప్రక్రియ మంచిదే కానీ... మొండి బకాయిల రికవరీ కోసం రూపొందించిన దివాలా చట్టం మంచి ఫలితాలనే ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియ కారణంగా బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే తక్కువ మొత్తంలోనే రికవరీ కానుండటం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించనున్నది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోవడం కూడా బ్యాంక్‌లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్లో జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి, 5.8 శాతానికి పడిపోయింది. జీడీపీ క్షీణత కారణంగా వ్యవసాయ, రియల్టీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలకు ఇచ్చిన రుణాలు మొండిగా మారిపోయే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఒత్తిడి ఖాతాల కోసం మూలధన నిధులను కేటాయిస్తున్నాయి. భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ అండ్ మోనెట్ ఇస్పాత్, జెట్ ఎయిర్వేస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, కొన్ని ఎన్బీఎఫ్సీ కంపెనీలు...ఇలా ఒత్తిడి ఖాతాలకు నిధులను కేటాయిస్తున్నాయి. ఇది ఆందోళనకరం. ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్‌లకు సంబంధించిన దివాలా కేసులు పూర్తిగా పరిష్కారమైతే, బ్యాంక్‌లకు మొండి బకాయిల భారం ఒకింత తీరుతుంది. ఈ కేసులన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం కల్లా పరిష్కారం అవుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు... గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కేంద్ర ప్రభుత్వం రూ.52,000 కోట్ల మేర నిధులందించింది. దీంతో కలుపుకొని మొత్తం రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు అందించినట్లయింది. ఈ నిధుల్లో అధిక మొత్తాలను బ్యాంక్‌లు మొండిబకాయిల ‘కేటాయింపులకే’ కేటాయించాయి. అయినప్పటికీ, గత క్యూ4లో బ్యాంక్‌ల నష్టాలు తగ్గలేదు. రుణ నాణ్యత తగ్గడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రుణ మంజూరీలు కూడా తగ్గాయి. ప్రైవేట్ బ్యాంక్‌లు జోరుగా రుణాలిస్తుండగా, ప్రభుత్వ బ్యాంక్‌లు మాత్రం రుణ నాణ్యతను మెరుగుపరచుకోవడంపైననే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు చూస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ–డిపాజిట్ నిష్పత్తి 2017లో 64 శాతం, గతేడాది 72 శాతంగా ఉంది. దీనికి భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంక్ రుణ–డిపాజిట్ నిష్పత్తి 95, 91 శాతాలుగా నమోదైంది. కంపెనీలకు తగ్గుతున్న రుణాలు.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.., ఇతర రుణాలతో పోల్చితే కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో తగ్గాయి. కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు 12 శాతం తగ్గాయి. మరోవైపు వాహన కొనుగోళ్ల రుణాలు 5 శాతం, ఇతర వ్యక్తిగత రుణాలు 21 శాతం, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల రుణాలు 1 శాతం మేర పెరిగాయి. మధ్య స్థాయి సంస్థలకు ఇచ్చిన రుణాలు 4 శాతం ఎగిశాయి. మెరుగుపడుతున్న రుణ నాణ్యత ఇక రుణ నాణ్యత మెరుగుదల అన్ని బ్యాంక్‌ల్లో ఒకేలా లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) స్థూల మొండి బకాయిలు 23 శాతం తగ్గి రూ.1.73 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. తాజా మొండి బకాయిలపై నియంత్రణ సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార వ్యాఖ్యానించారు. రుణ నాణ్యత మరింతగా మెరుగుపడిందని, ఒత్తిడి ఖాతాలకు తగిన కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. దాదాపు ఏడు క్వార్టర్ల పాటు నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత క్యూ4లో లాభాల బాట పట్టింది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 27 శాతం తగ్గి రూ.12,053 కోట్లకు తగ్గాయి. రుణ నాణ్యత మెరుగుదల పరంగా చూస్తే, ప్రభుత్వ బ్యాంక్‌ల కంటే ప్రైవేట్ బ్యాంక్‌లదే పై చేయిగా ఉంది. ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ ముందు వరుసలో ఉంది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 14 శాతం తగ్గి రూ.46,292 కోట్లకు చేరాయి. ప్రైవేట్ బ్యాంక్‌లకూ పాకుతున్న సమస్య... మొండి బకాయిల విషయంలో కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోటీ పడుతున్నాయి. స్థూల మొండి బకాయిల పెరుగుదల విషయంలో యస్‌బ్యాంక్‌ను చెప్పుకోవాలి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 200 శాతం ఎగసి రూ.7,883 కోట్లకు పెరిగాయి. ఒక విమానయాన సంస్థ(జెట్ ఎయిర్వేస్ కావచ్చు), మౌలిక రంగ దిగ్గజం(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించామని, అందుకే గత క్యూ4లో మొండి బకాయిలు భారీగా పెరిగాయని యస్ బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 131 శాతం పెరిగి రూ.3,947 కోట్లకు చేరాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీల బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించడం వల్ల ఈ బ్యాంక్ మొండిబకాయిలు ఇంతగా పెరిగాయి. ఈ బ్యాంక్‌కు మొండి భారం మరింతగా ఉండనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బ్యాంక్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు, ఎస్సెల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఇతర కొన్ని కంపెనీలకు బాగానే రుణాలిచ్చిందని, ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో వీటి కేటాయింపులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లను మొండి బకాయిల సమస్య ఇప్పట్లో వదిలేలా లేదు. -
దివాలా అస్త్రంతో రూ. 83,000 కోట్లు వసూలు
సాక్షి, న్యూఢిల్లీ : మొండిబకాయిలకు చెక్ పెట్టేలా కొత్తగా తీసుకువచ్చిన దివాలా చట్టం (ఐబీసీ) ప్రయోగిస్తే తమ కంపెనీలపై నియంత్రణ కోల్పోవలసి వస్తుందనే భయంతో పెద్దసంఖ్యలో కంపెనీలు బకాయిలు చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2100 కంపెనీలు తమ బకాయిలను చెల్లించాయి. ఇప్పటివరకూ రూ 83,000 కోట్ల బకాయిలు పరిష్కారమయ్యాయి. 90 రోజుల్లోగా రుణాలు చెల్లించకపోతే ఆయా రుణాలను ఎన్పీఏలుగా ప్రకటిస్తూ వాటిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించేలా దివాలా చట్టానికి మార్పులు చేపట్టిన అనంతరం రుణ బకాయిలు పెద్ద ఎత్తున వసూలవుతున్నాయని ఈ గణాంకాలు వెల్లడించాయి. బకాయిలను చెల్లిస్తేనే ప్రమోటర్లను వారి సంస్థల బిడ్డింగ్‌లో పాల్గొనేలా చట్ట సవరణ చేయడంతో బడా కంపెనీలు సైతం బకాయిల చెల్లింపునకు ముందుకొస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. బకాయిలు చెల్లించకుండా వేలంలో పాల్గొంటే తిరిగి ప్రమోటర్లే వారి సంస్థలను భారీ డిస్కౌంట్‌తో దక్కించుకుంటారని ప్రభుత్వం వాదిస్తోంది. రుణ ఎగవేతదారులపై ఒత్తిడి పెంచడంతో బకాయిలు వసూలవుతున్నాయని, రుణాల జారీ..రుణ వితరణలో నూతన దివాలా చట్టం మెరుగైన మార్పులను తీసుకువచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
దివాలా చట్టానికి సవరణ; లోక్‌సభలో బిల్లు
న్యూఢిల్లీ: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (సవరణ) బిల్లు 2017ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దివాలా ప్రొసీడింగ్స్ ద్వారా మొండిబకాయిల (ఎన్పీఏ) రికవరీకి సంబంధించిన వేలంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, ఎన్పీఏ అకౌంట్ హోల్డర్లు బిడ్డింగ్ వేయకుండా నిరోధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. అయితే ఆయా వ్యక్తులు తమ బకాయిలన్నింటినీ వడ్డీలు, చార్జీలతో సహా చెల్లించేసినట్లయితే, వారు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులవుతారు. నవంబర్‌లో ఈ అంశంపై ఒక ఆర్డినెన్స్ జారీ అయింది. ఇందుకు సంబంధించే తాజా సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
రుణ ఎగవేతదారులకు చెక్
న్యూఢిల్లీ: రుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడడమే తరువాయి. దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఐబీసీని గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఐబీసీలో పలు సవరణలు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అయితే, ఇందులో మార్పులు ఏంటన్నది ఆయన వెల్లడించలేదు. రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉన్నందున అప్పటి వరకు వివరాలు వెల్లడించడానికి లేదన్నారు. అయితే, ప్రభుత్వంలోని ఉన్నత వర్గాల సమాచారం మేరకు... రుణ ఎగవేతదారుల ఆస్తులను (స్ట్రెస్డ్ అసెట్స్/ఎన్పీఏ) వేలం వేసినప్పుడు... వాటిని రుణ ఎగవేత చరిత్ర ఉన్న ప్రమోటర్లు, మోసపూరిత చరిత్ర కలిగిన ప్రమోటర్లు సొంతం చేసుకోకుండా నిరోధించడమే ఆర్డినెన్స్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అలాగని, బ్యాంకులకు రుణ బకాయి పడిన కంపెనీల ప్రమోటర్లను వేలంలో పాల్గొనకుండా పూర్తి నిషేధం విధించడంగా దీన్ని చూడరాదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ‘‘కార్పొరేట్ పరిష్కార ప్రక్రియను అనుసరించేవారు, తమ బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకునే ప్రమోటర్లు కూడా ఉన్నారు. వీరిని ఐబీసీ కింద వేలం వేసే ఆస్తుల కొనుగోలుకు దూరంగా ఉంచడం లేదు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఆర్డినెన్స్ స్థానంలో సవరణలతో కూడిన చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వారి ఆస్తులు వారికే దక్కుకుండా..! ఐబీసీ కింద ఇప్పటికే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో 300 కేసులు పరిష్కారం కోసం దాఖలయ్యాయి. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకు ఈ ఏడాది జూన్‌లో 12 భారీ ఎన్పీఏ ఖాతాలను ఐబీసీ కింద పరిష్కారం కోసం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఈ 12 ఖాతాలకు సంబంధించిన రుణ ఎగవేతల మొత్తం రూ.1.75 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఖాతాల్లో ఆమ్టెక్ ఆటో, భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, భూషన్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, మోనెత్ ఇస్పాత్, ల్యాంకో ఇన్ఫ్రాటెక్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, ఎరా ఇన్ఫ్రా, జైపీ ఇన్ఫ్రాటెక్, ఏబీజీ షిప్‌యార్డ్, జ్యోతి స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటిలో 11 కేసులు ఎన్సీఎల్టీలో దాఖలు కాగా, దివాళా ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్బీఐ 30 నుంచి 40 ఎన్పీఏ ఖాతాలతో ఐబీసీ కింద చర్యలు చేపట్టాలంటూ బ్యాంకులకు మరో జాబితా కూడా పంపించింది. అయితే, ఐబీసీ కింద కంపెనీల ఆస్తులను వేలానికి ఉంచినప్పుడు బిడ్ వేసే వారి అర్హతలు ఏంటన్నది చట్టంలో నిర్దేశించలేదు. దీంతో రుణాలు ఏగవేసిన ప్రమోటర్లే తిరిగి ఆస్తులను తక్కువ ధరలకు సొంతం చేసుకునే అవకాశం ఉందంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఇందుకు ఎస్సార్ స్టీల్ కేసే ఉదాహరణ. ఎస్సార్ స్టీల్ రూ.37,284 కోట్ల బకాయిలు బ్యాంకులకు చెల్లించకుండా చేతులు ఎత్తేసింది. ఐబీసీ పరిష్కార ప్రక్రియ కింద ఎస్సార్ స్టీల్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎస్సార్ గ్రూపు ఆసక్తి వ్యక్తీకరించడం గమనార్హం. ‘‘ఈ విధమైన ఆందోళనల నేపథ్యంలో దివాళా చట్టం కింద ఆస్తులకు అర్హత కలిగిన వారే బిడ్ వేసే విధంగా చూసేందుకు చట్టంలో సవరణలు ప్రతిపాదించాల్సి వచ్చింది’’ అని అధికార వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఇతర నిర్ణయాలు... 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ సంఘం పన్నుల ఆదాయ వనరులను మదింపు వేసి వాటిని కేంద్రం, రాష్ట్రాల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలన్న విధానాన్ని రూపొందిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆర్థిక సంఘం తన సిఫార్సులను సమర్పించేందుకు రెండేళ్ల సమయం తీసుకోవడం సాధారణం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు కాలానికి అమల్లో ఉంటాయి. ఈబీఆర్డీలో సభ్యత్వం యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఈబీఆర్డీ)లో భారత సభ్యత్వం తీసుకునేందుకు కేబినెట్ ఇచ్చింది. దీంతో తయారీ, సేవలు సహా వివిధ రంగాలకు కావాల్సిన నిధుల సమీకరణ సులభం కానుంది. ఈబీఆర్డీలో సభ్యత్వం తీసుకునేందుకు అవసరమైన చర్యల్ని ఆర్థిక వ్యవహారాల విభాగం చేపడుతుందని జైట్లీ తెలిపారు. ఐఐసీఏకు రూ.18 కోట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ)కు రూ.18 కోట్ల సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకానికీ కేబినెట్ ఆమోదముద్ర పడింది. ఇక ఐటీ చట్టాల్లో భారీ మార్పులు! సమీక్ష కోసం అత్యున్నత స్థాయి కమిటీ న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్ లిఖించడం, ముసాయిదా రూపకల్పన ఈ కమిటీ కర్తవ్యం. ఆరు నెలల్లో కమిటీ ఈ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంది. ఆరుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీ సభ్యులు (లెజిస్లేషన్) అరవింద్‌మోదీ కన్వీనర్‌గా ఉంటారు. గిరీష్ అహూజా (చార్డెడ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ పార్ట్నర్) మాన్సీ కేడియా (కన్సల్టెంట్, ఐసీఆర్ఐఈఆర్) కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కమిటీకి శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం పన్ను వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలు ఏమిటి? దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉండాలి? వంటి అంశాలను తన కర్తవ్య నిర్వహణలో కమిటీ పరిశీలిస్తుంది. -
కొత్త దివాలా చట్టంతో అపరిమిత లాభాలు!
అసోచామ్, క్రిసిల్ అధ్యయనం న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం- 2016ను చిత్తశుద్ధితో అమలు చేస్తే అపరిమితమైన లాభాలున్నట్లు అసోచామ్, క్రిసిల్ అధ్యయనం ఒకటి తెలిపింది. దీనివల్ల ఎన్పీఏల రూపంలో ఉండిపోరుున మొత్తంలో రూ.25,000 కోట్లు బయటకు వస్తాయని సర్వే తెలిపింది. ఇలా ఒనగూరిన మొత్తాన్ని ఇతర ఉత్పాదక రంగాలకు రుణాలుగా ఇవ్వడం వల్ల మరింత ఆర్థిక పురోగతి చోటుచేసుకుంటుందని వివరించింది. బ్యాంకుకు రుణ చెల్లింపు వైఫల్యం వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉద్యోగులు, రుణ దాతలు, షేర్హోల్డర్లు ఎవ్వరైనా కంపెనీ ‘మూసివేత’ ప్రక్రియను ప్రారంభించడానికి తాజా చట్టం వీలు కల్పించనుంది.