నిషేధించినా ఎర్రబుగ్గతో మంత్రి హల్‌చల్!
సిలిగురి: వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడేందుకు ప్రముఖులు సహా, కేంద్ర, రాష్ట్ర మంత్రుల వాహనాలకు ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. అయినా పశ్చిమ బెంగాల్ మంత్రులు మాత్రం ఈ ఆదేశాలను అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా సోమవారం బెంగాల్ పీడబ్ల్యూడీ మంత్రి అరూప్ బిశ్వాస్ తన వాహనానికి ఎర్రబుగ్గతో మీడియా కంటపడ్డారు.
దీని గురించి మీడియా ప్రశ్నించగా.. ‘ఎర్రబుగ్గలను మా ప్రభుత్వం ఇంకా రద్దు చేయలేదు. ఇతర ఆదేశాలను కట్టుబడాల్సిన అవసరం మాకు లేదు’ అని ఆయన పేర్కొన్నారు. అత్యవసర వాహనాలైన అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బంది వాహనాలకు మినహాయించి ఇతర ఏ వాహనాలు కూడా ఎర్రబుగ్గలు, ఇతర రంగు బుగ్గలను వాడవద్దంటూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలోనూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కానీ బెంగాల్ నేతలు మాత్రం తమకు కేంద్రం ఆదేశాలతో లెక్కలేదంటున్నారు. బెంగాల్‌లోని సిలిగురి జల్‌పైగురి అభివృద్ధి సంస్థ చైర్మన్ సైతం తన వాహనానికి ఎర్రబుగ్గతో సోమవారం కనిపించడం గమనార్హం.