ఎర్రబుగ్గను ఆర్పేయాల్సిందే!
ఇటీవల కాలంలో నగరాల్లో ఎమ్మెల్యే, ఎంపీల స్టిక్కర్లు, ఎర్రబుగ్గ ఉన్న కార్లను వినియోగించడం సర్వసాదారణమైంది. ఎంపీ, ఎమ్మెల్యేల స్టిక్కర్ల పక్కన పడితే..చివరికి జీహెచ్ఎంసీ, ఆర్మీ, ప్రెస్ స్టిక్కర్లే కాకుండా ఏది పడితే ఆ స్టిక్కర్తతో వాహనాలను రోడ్లపై పరిగెత్తిస్తున్నారు. అనధికారికంగా స్టిక్కర్ల వాడకంతో ట్రాఫిక్ నిబంధనల్ని కూడా ఉల్లంఘించడం మనం చూస్తూనే ఉంటాం.
అధికారికంగా హోదాను మించి.. స్టిక్కర్ల దుర్వినియోగం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓ సందర్భంలో ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్టిక్కర్ల దుర్వినియోగానికి చెక్ పెట్టేలా ప్రత్యేకమైన హోలోగ్రామ్ తో స్టిక్కర్లను తయారు చేయించారు.
ఇక స్టికర్ల గొడవ కాస్త పక్కన పడితే.. మంత్రి పదవి హోదాను అనుభవిస్తూ దర్జాగా ఎర్రబుగ్గ కారులో తిరుగాలనే కోరిక ప్రతి రాజకీయ నాయకుడిలో ఉండటం సహజం. ఎర్రబుగ్గ కారులో తిరగడం ప్రస్తుత రాజకీయాల్లో నాయకులకు ఫ్యాషన్ గా మారింది. అధికారికంగా ఎర్రబుగ్గ కారులో ఒక్కసారైన హోదాను అనుభవించాల్సిందేనని వెంపర్లాడే నాయకులు ఎంతమందో కనిపిస్తారు.
అయితే వీటన్నింటికి భిన్నంగా గ్యాలియర్ యువరాజు జ్యోతిరాధిత్య సింధియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు, నాయకులకు మధ్య ఎర్రబుగ్గ కారు దూరాన్ని పెంచుతుందని సింధియా అన్నారు. దేశ రాజధానిలో కాని, మరే ఇతర ప్రాంతాల్లో ఎర్రబుగ్గ ఉన్న వాహనాన్ని ఉపయోగించనని మీడియాతో అన్నారు. ఎర్రబుగ్గ కారు తన దృష్టిలో చిన్నది..కాని ముఖ్యమైందేనని ఆయన అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పడితే..వాహనాలపై ఎర్రబుగ్గ వాడకుండా పార్టీ చర్యలు తీసుకుంటుందని జ్యోతిరాధిత్య సింధియా అన్నారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జ్యోతిరాధిత్య సింధియా ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ లో ముఖ్యమంత్రి అవుతారో లేదో కాని.. ఎర్రబుగ్గ వాహనంతో రోడ్లపై జనాల్ని ఇబ్బంది కలిగించే రాజకీయ నాయకులను ప్రజల వద్దకు తీసుకు రావడానికి సింధియా చేసిన సూచనలపై హర్షం ప్రకటిస్తున్నారు.