కేసీఆర్.. ఏమిటీ దుబారా? | AICC leader Digvijay singh slams KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. ఏమిటీ దుబారా?

Published Sat, Jul 9 2016 2:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

కేసీఆర్.. ఏమిటీ దుబారా? - Sakshi

కేసీఆర్.. ఏమిటీ దుబారా?

- ఇదేమీ మీ తాతల సొమ్ముకాదు.. ప్రజాధనం

- రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు: దిగ్విజయ్‌సింగ్

- ప్రాజెక్టుల అంచనాలను అడ్డగోలుగా పెంచుతున్నారు

- అవినీతి సొమ్ముతో విపక్ష నేతలను కొనుగోలు చేస్తున్నారు

- గట్టిగా నిలదీయకుంటే ఈ అవినీతికి అడ్డుకట్ట వేయలేం

- గ్రామాలు వేదికగా క్షేత్రస్థాయి పోరాటాలు

- 2019లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని వ్యాఖ్య

 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విచ్చల విడిగా అవినీతి, దుబారాకు పాల్పడుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించా రు. దుర్వినియోగం చేస్తున్నదంతా సీఎం కేసీఆర్ తాతల సొమ్ము కాదని, అదంతా ప్రజలదని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సెలర్లకు గాంధీభవన్‌లో నిర్వహించిన శిక్షణా శిబిరాల ముగింపు కార్యక్రమంలో దిగ్విజయ్‌సింగ్ మాట్లాడారు.

 

అవినీతితో సంపాదించిన సొమ్ముతో టీఆర్‌ఎస్ ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచుతూ, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు అప్పగిస్తూ వేలకోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తీసుకుని, నిర్దిష్టంగా ప్రశ్నించకుంటే కేసీఆర్ అవినీతికి అడ్డుకట్ట వేయలేమని వ్యాఖ్యానించారు.

 

చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం..

రాష్ట్రంలో అన్ని చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వమే హరిస్తోందని దిగ్విజయ్ పేర్కొన్నారు. నిర్వాసితులకు పునరావాసం అనేది భూమికి సంబంధించిన అంశం మాత్రమే కాదని... భూములు కోల్పోయే వ్యక్తి, కుటుం బానిదే కాకుండా పూర్తి సమాజానికి సంబంధించినదని చెప్పారు. నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే అందుకు సమానమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలని భూసేకరణ చట్టం-2013లో ఉందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను ఉల్లంఘిస్తోందని.. దీనిని అడ్డుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం చేయడం కోసం భూసేకరణపై హైకోర్టులో పిటిషన్లు వేయాలని నేతలకు సూచించారు. కాంగ్రెస్ ద్వారా పదవులు పొందిన కొందరు నేతలు పార్టీ మారడం వెనుక వ్యక్తిగత దందాలు, స్వార్థం మాత్రమే ఉన్నాయని ఆరోపించారు. అలాంటి ఫిరాయింపుదారుల వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు.

 

క్షేత్రస్థాయి నుంచి పోరాడుదాం

కాంగ్రెస్ కార్యకర్తలు వేధింపులకు భయపడరని, పోరాటాలకు వెనుకడుగేయరని దిగ్విజయ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో కాకుండా గ్రామాలను క్షేత్రస్థాయి పోరాటాలకు వేదికలుగా చేసుకోవాలని సూచించారు. టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశాలు, ముఖ్యమైన రాష్ట్ర పార్టీ సమావేశాలను కూడా జిల్లాల్లో పెట్టుకోవాలన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచవచ్చని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజల్లో ఉంటూనే పార్టీ నేతలు పనిచేయాల న్నారు. 2019లో టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నా రు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వాటి జేబు సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తూ, అబద్ధాలతో న మ్మిస్తూ మోదీని ప్రధానిని చేశాయని వ్యాఖ్యానించారు. వీటిపై ప్రజల్లో సరైన ప్రచారం చేయడానికి అవసరమైన అధ్యయనం, పోరా డాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరానికి సమన్వయకర్తగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యవహరించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీని యర్ నేతలు ఎస్.జైపాల్ రెడ్డి, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

 

 కాంగ్రెస్‌ది క్షేత్రస్థాయిలో వైఫల్యమే: శిక్షణ శిబిరంలో నిపుణుల అభిప్రాయం

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ  క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ వైఫల్యాలపై అవగాహన తేవడంలో విఫలమైందని శిక్షణా శిబిరాల్లో మాట్లాడిన నిపుణులు అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందనే చర్చ ఉందని... దీనికి కారణాలేమిటో విశ్లేషించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌కు ఉన్నాయని సూచించారు. పార్టీ ఫిరాయింపులపై కాం గ్రెస్ తీవ్రంగా స్పందించాల్సిన తరుణం ఇదేనన్నారు. ఈ శిక్షణ శిబిరాల్లో ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఏఐసీసీ ప్రతినిధులు కె.శ్రీనివాసన్, సునిల్‌శర్మతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల, బలరాం నాయక్, మర్రి శశిధర్‌రెడ్డి, దీపక్ జాన్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ శిక్షణా శిబిరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని, వీటిని రెండేళ్ల కిందే ఏర్పాటు చేస్తే బాగుండేదని పలువురు మున్సిపల్ చైర్‌పర్సన్లు పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement