సుందరంగా మారిన కోట పరిసర ప్రాంతం
అదేమీ రహదారి కాదు.... మున్సిపల్ అధికారులు చేపడుతున్న రహదారుల విస్తరణ కూడా కానే కాదు.... ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపాలిటీకి ఆ స్థలాలతో సంబంధం లేదు... ఎవరు చెప్పారో... ? ఎవరి మెప్పుకోరారో...? తెలియదు కానీ.... ట్రస్ట్ సభ్యులు రోడ్డెక్కే పని లేకుండా ... వారి చేతులకు మట్టి అంటకుండా పని కానిచ్చేశారు. వందలాది మంది పేదల జీవితాలను రోడ్డు పాల్జేశారు. ఏళ్ల తరబడి ఆ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి పొట్టలు కొట్టారు.
ఇదంతా జరిగింది ఎక్కడో కాదు... విజయగనరం జిల్లా కేంద్రం నడిబొడ్డున గల విజయనగరం మహా రాజుల కోట పరిసరాల్లోనే.... ఆ భూములు ఎవరివో కాదు... స్వయానా మాజీ కేంద్రమంత్రి, ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజు ట్రస్టీగా వ్యవహరిస్తున్న మాన్సాస్‌కు చెందిన భూములే. ఈ విషయంలో మున్సిపల్ యంత్రాంగం పెత్తనం చేలాయించిన తీరు రెండేళ్లయిౖనా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది.
విజయనగరం మున్సిపాలిటీ: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మక నేపథ్యం కలిగిన విజయనగరం మహారాజా కోట పరిసరాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా కోటకు పడమర దిక్కులో పార్కు తరహాలో 2016 నుంచి పనులు ప్రారంభించారు. అదే తరహాలో కోట చుట్టూ అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా దశాబ్దాల కిందటి నుంచి కోట పరిసరాల్లో చిన్నపాటి వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిని ఒక్కసారిగా ఖాళీ చేయించడంపై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.
2017 ఫిబ్రవరిలో మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న వందలాది దుకాణాలను ఖాళీ చేయించేశారు. వాస్తవానికైతే ఇలా ఖాళీ చేయించే బాధ్యతను రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలి. ఇందుకోసం ముందస్తుగా ట్రస్ట్ నుంచి నోటీసులు జారీ చేయాలి. అయితే ఇదంతా అన్యాయమని ప్రశ్నించే వారి గొంతులను పోలీసు బలగాలను ప్రదర్శించి నొక్కేశారు. తాము మాన్సాస్ ట్రస్టుకు పన్నులు చెల్లిస్తే మున్సిపల్ యంత్రాంగం ఆ స్థలాల నుంచి ఖాళీ చేయించడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే మున్సిపల్ యంత్రాంగానికి ఆ అధికారం ఎవరిచ్చారన్న ప్రశ్న తలెత్తినప్పటికీ అప్పటికే మాన్సాస్ ట్రస్ట్ డైరెక్టర్‌గా ఉన్న అదితి గజపతిరాజు తన తండ్రి అశోక్ గజపతిరాజు అధికారంతో ప్రశ్నించే వారిని అధికారులతో బెదిరించారు. దీంతో ఏళ్ల తరబడి ఉపాధి పొందిన వారంతా సామాన్య కుటుంబాలకు చెందిన వారే కావడంతో మిన్నకుండిపోయారు. ఈ ప్రక్రియపై ఒకానొక దశంలో రాజవంశానికి చెందిన పలువురు పెద్దలు అదితి గజపతిరాజు స్వలాభం కోసం వెంపర్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడే ఎందుకు..?
విజయనగరం మున్సిపాలిటీలో ఎక్కడా లేని అభివృద్ధి కోట చుట్టూ మాత్రమే జరిగింది. కోట పరిసరాల్లో రెండు కిలోమీటర్ల మేర మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. వాస్తవానికి విజయనగరం పట్టణంలో సుమారు 15 మార్గాల్లో గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపాలిటీ శ్రీకారం చుట్టగా... అందులో కోట పరిసరాల్లో పనులు మాత్రమే నెలల వ్యవధిలో పనులు పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలిస్తే ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో రహదారి విస్తరణ పనులతో పాటు అభివృద్ధి పనులు పూర్తికాలేదు.
కానరాని ప్రత్యామ్నాయం
కోట పరిసరాల్లో ఆక్రమణల పేరిట తొలగించిన వారికి ప్రత్యామ్నాయం చూపించడంలో ఏ ఒక్కరికీ సంబంధం లేకుండా పోయింది. స్థలం మాన్సాస్ ట్రస్ట్‌కు చెందగా.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించింది మున్సిపల్ అధికారులు. ఆక్రమణలు తొలగించాలంటూ ఉపాధి పొందుతున్న వారిని హెచ్చరించిన సమయంలోనే వారంతా ఎదురు ప్రశ్నించినా ఉన్నతాధికారులు ఆదేశాలంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. బలవతంగా పోలీసుల సమక్షంలో భారీ యంత్రాలతో వారి దుకాణాలను నేలమట్టం చేశారు. ప్రస్తుతం తమకు ప్రత్యామ్నాయం చూపించాలని ఎవరిని అడగాలో తెలియని అయోమయ పరిస్థితిలో బాధితులున్నారు.
అదితి పోటీతో హడల్..
విజయనగరం నియోజకవర్గంలో వంశపారంపర్య రాచరిక పాలనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా మాన్సాస్ ట్రస్ట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే పూసపాటి అదితి గజపతిరాజు తన తండ్రి అశోక్ గజపతిరాజు అధికారాన్ని ఉపయోగించుకుని వారి సొంత ఆస్తుల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను పట్టణ ప్రజలు కళ్లారా చూశారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే బరిలో ఉండడంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా బతుకులు కూల్చేశారు
కోటను అందంగా మారుస్తామంటూ మా బతుకులు కూల్చేశారు. మాన్సాస్‌కు చెందిన స్థలంలో ఏళ్ల తరబడి టీ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాను. స్థలంలో ఉంటున్నందుకు పన్ను కూడా చెల్లిస్తున్నాం. అయితే ట్రస్ట్ నుంచి ఎటువంటి నోటీసులు, సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు వచ్చి ఆక్రమణలంటూ దుకాణాన్ని పడగొట్టారు. కనీసం ప్రత్యామ్నాయం కూడా చూపించలేదు. – అప్పలరాజు, బాధితుడు, విజయనగరం.
Comments
Please login to add a commentAdd a comment