సాక్షి, అమరావతి: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (మాన్సాస్) ట్రస్ట్ వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించడంలో ఏమాత్రం తప్పులేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజలతో ముడిపడి ఉన్న ఇలాంటి ట్రస్ట్‌ల వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించడం వల్ల మరింత బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని, మాన్సాస్‌లో ఆడిట్ జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆడిట్ నిర్వహిస్తే అభ్యంతరం ఏమిటని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజును న్యాయస్థానం ప్రశ్నించింది. పారదర్శకత కోసం ఆడిట్ మంచిదేనని, విజయనగరం జిల్లా ఆడిట్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆడిట్‌ను కొనసాగనివ్వాలని ఆదేశించింది. మాన్సాస్ ట్రస్ట్‌కు పాలక మండలిని ఏర్పాటు చేస్తూ గత ఏడాది మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 75 అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. జీవో 75ని రద్దు చేయాలంటూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ మంగళవారం విచారణ జరిపారు.
కమిటీల పని కమిటీలదే...
ప్రభుత్వ కౌంటర్ లేకుండా జీవో 75 విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవోపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రస్ట్ కార్యకలాపాల విషయాల్లో ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీలను వాటి పని వాటిని చేసుకోనివ్వాలని స్పష్టం చేసింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోరాదని ట్రస్ట్ ఈవోను హైకోర్టు ఆదేశించింది. విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపు విషయంలో జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. ఆయా బ్యాంకుల్లో ట్రస్ట్ ఖాతాలను స్తంభింపచేస్తూ బ్యాంకులకు ఈవో పంపిన ఆదేశాల అమలును నిలుపుదల చేసింది. రోజువారీ నిర్వహణ నిమిత్తం ట్రస్ట్ విద్యా సంస్థల తరఫున వచ్చే చెక్కులను ఆమోదించాలని బ్యాంకులను హైకోర్టు ఆదేశించింది. పాలక మండలి సమావేశం నిర్వహించాల్సిందిగా చైర్మన్‌ను కోరుతూ ఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును కూడా హైకోర్టు నిలిపివేసింది. ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ట్రస్ట్ ఈవో, ఈవో డి.వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 23కి వాయిదా వేసింది.
2004లో చివరిసారిగా ఆడిట్..
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా సంచయిత నియామకాన్ని, ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యుల నియామక జీవోలను హైకోర్టు రద్దు చేసినందున పాలక మండలి మనుగడలో లేనట్లేనని అశోక్ గజపతిరాజు తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపించారు. చట్ట నిబంధనల మేరకే ఈవో నడుచుకుంటున్నారని, ట్రస్ట్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ పాలక మండలి ఆధ్వర్యంలోనే తీసుకోవాల్సి ఉంటుందని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు చట్టం అనుమతించదన్నారు. 2004లో చివరిసారిగా ఆడిట్ నిర్వహించారని, అప్పటి నుంచి మళ్లీ ఆడిట్ చేయలేదని అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి, ఈవో తరఫు న్యాయవాది ఎ.మాధవరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment