సాక్షి, ముంబై: ప్రజాస్వామ్య కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య... మహాకూటమిలోని శివసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న అభ్యర్థులకు వరుసగా వస్తున్న సెలవులు అగ్నిపరీక్షగా మారాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ శనివారం ఆఖరు రోజు కావడంతో అభ్యర్థుల్లో మరింత గుబులు మొదలైంది. ఆ తరువాత ఉపసంహరణ, ఎన్నికల గుర్తులు జారీ చేయడం లాంటివి ఉంటాయి.
అప్పటికే ఒకటో తేదీ వస్తుంది. ఎన్నిలకు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. అంటే ప్రచారానికి కేవలం 13 రోజులు మాత్రమే మిగులుతుంది. మరోవైపు సీట్ల సర్దుబాటు విషయం త్వరగా తేలితే ప్రచారం చేద్దామనుకుంటున్న ఆశావహులకు వరుసగా వస్తున్న సెలవులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రేపో, ఎల్లుండో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్న నేపథ్యంలో వచ్చేవారం నుంచి ప్రచార జోరు పెంచాలని పార్టీలు భావించాయి. అయితే వచ్చేవారంలో గాంధీ జయంతి(గురువారం), దసరా (శుక్రవారం), శని, ఆదివారాలు సెలవులతో వరుసగా నాలుగు రోజులు జనం అందుబాటులో లేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ నాలుగు రోజులపాటు జనమేకాదు పార్టీ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని చెబుతున్నారు.
సాధారణంగానే వారాంతాల్లో విహార యాత్రలకు వెళ్తుంటారు. పైగా ఇప్పుడు వరుసగా నాలుగురోజులు కలిసి వస్తుండడంతో పిల్లలకు తీరిక సమయం దొరకడంతో పిక్నిక్‌ల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఓటర్లు అందుబాటులో ఉండకపోవడం ఒకవైపు, కార్యకర్తలు అందుబాటులో ఉండకపోవడం మరోవైపు బరిలో నిలిచే అభ్యర్థులను కంగారు పడేలా చేస్తున్నాయి.
ఎన్నికలు దగ్గరపడుతుండగా ఉన్న సమయం ప్రచారానికి సరిపోదని భావిస్తున్న పరిస్థితిలో ఇలా వరుస సెలవులు రావడం అభ్యర్థులకు అగ్నిపరీక్షగా చెబుతున్నారు. దీనికి తోడు ఇరు కూటముల్లోని పార్టీలు ఒంటరిగా పోటీచేస్తాయా...? లేక ఉమ్మడిడి పోటీచేస్తాయా..? అనేది తేలడం లేదు. ఏ నియోజకవర్గం ఏ పార్టీ అభ్యర్థికి దక్కుతుందో తెలియడంలేదు. ఎవరిని? ఎక్కడ బరిలోకి దింపుతారనే విషయమై కూడా స్పష్టత రావడం లేదు.
దీంతో కొత్తగా బరిలో దిగే అభ్యర్థులు ఆయోమయంలో పడిపోయారు. ఇంత తక్కువ సమయంలో సాధ్యమైనంత వేగంగా ప్రచారం చేయాలి. ఒక్కో అభ్యర్థి సుమారు రెండున్న లక్షల నుంచి మూడు లక్షల ఓటర్ల చెంతకు వెళ్లాలి. దీంతో ప్రచారం, సభలు ఎలా నిర్వహించాలో తెలియక ఆందోళనలో పడిపోయారు. దీనికి తోడు వచ్చే వారంలో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అత్యధిక శాతం కార్యకర్తలు ఇతర ప్రాంతాలకు తరలిపోతారు. దీంతో అభ్యర్థుల వెంట తగినంత మందిమార్బలం ఉండరు.
ఓటర్లను ఆకర్శించేందుకు వెంట భారీ జనం ఉండాలి. ఎంత జోరు ప్రచారం, నినాదాలు చేస్తే విజయానికి అంత దగ్గరవుతారు. కాని అభ్యర్థులకు అందుకు తగినంత సమయం లేదు. మరోపక్క సెలవుల కారణంగా ప్రచారానికి తగినంత జనం దొరకరు. దీంతో అభ్యర్థుల వెంట తిరిగే జనం ఎక్కువ కూలీ డిమాండ్ చేసే అవకాశం ఉందంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్యకర్తల కొరత లేకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే ముందుగానే బుకింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు.
అభ్యర్థులకు అగ్నిపరీక్ష!
Published Wed, Sep 24 2014 10:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement