
తుందుర్రు ఆక్వా పార్క్‌ను తరలించేదాకా పోరాటం ఆగదు
పర్యావరణాన్ని బాబు ఖూనీ చేస్తున్నారు: మేధా పాట్కర్
భీమవరం/తణుకు: ‘‘తుందుర్రు నుంచి గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను తరలించే వరకూ పోరాటం ఆగదు. 25 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. ప్రజల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యావరణాన్ని ఖూనీ చేస్తున్నారు’’ అని ప్రముఖ పర్యా వరణవేత్త, ప్రజా ఉద్యమాల జాతీయ సంఘటన(ఎన్‌ఏపీఎం) వ్యవస్థాపకురాలు మేధా పాట్కర్ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మాణంలో ఉన్న ఆక్వా ఫుడ్‌పార్క్ వ్యతిరేక ఆందోళనకారులతో ఆమె శనివారం రాత్రి సమావేశమయ్యారు.
కంసాలి బేతపూడి, తుందుర్రు ప్రజలతో మాట్లాడారు. ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు సాగిస్తున్న పోరా టం న్యాయపరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లేలా జాతీయ స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. ఇక్కడి ఆక్వా కాలుష్యంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, కనీసం కేంద్రమైనా సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ కంపెనీలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో పర్యావర ణంపై లేదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు సంయు క్తంగా కలుగజేసుకుని ఇక్కడి మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు ఎలా బతికినా నాకెందుకులే అన్న రీతిలో బాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో ఐదుగురి మృతికి కారణమైన యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.