
విధ్వంసాన్ని ఆహ్వానించడమే : మేథా పాట్కర్
శ్రీకాకుళం: అణువిద్యుత్ కేంద్రం నిర్మించడమంటే విధ్వంసాన్ని ఆహ్వానించడమేనని ప్రముఖ సామాజిక పర్యావరణవేత్త మేథా పాట్కర్ హెచ్చరించారు. రణస్థలం మండలంలోని మత్స్యకార గ్రామమైన కొవ్వాడలో కేంద్ర ప్రభుత్వం అణువిద్యుత్ కేంద్రం నిర్మించ తలపెట్టిన విషయం తెసిందే. ఈరోజు కొవ్వాడలో మేథా పాట్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాఉద్యమం ద్వారా అణు విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు.
ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాఅణువిద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కోటపాలెం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన భూము లను స్వాధీనం చేసుకోవడానికి మొదటి విడతగా 481 ఎకరాలకు సంబంధించి 4(1) నోటీసులను ప్రభుత్వం జారీ చేసింది. అయితే, ఆ భూములపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయూలని రైతులను ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా ఈ నెల 27న రామచంద్రాపురం, 29న కోటపాలెం గ్రామాల్లో అభ్యంతరాలపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయూ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రభుత్వ అధికారులు నోటీసులను అతికించారు. దీంతో కొవ్వాడ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఏళ్ల తరబడి అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. గ్రామసభలకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ సభలు ఏర్పాటు చేయూలని కోరుతున్నారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా నేరుగా అభ్యంతరాలపై గ్రామ సభలు పెట్టడం సరికాదని ఈ ప్రాంత మత్స్యకారులు, రైతులు, ప్రజలు, పలు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షుణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనలు, పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, మేథా పాట్కర్ వంటివారు రావడంతో అణువిద్యుత్ కేంద్రంకై భూసేకరణ గ్రామసభలను అధికారులు వాయిదా వేశారు.