
విధ్వంసకర అభివృద్ధి వద్దు: మేధా పాట్కర్
సాక్షి, విశాఖపట్నం: ‘విధ్వంసకర అభివృద్ధి వద్దు. ప్రజలే కేంద్రంగా జరిగే అభివృద్ధి కావాలి. కార్పొరేట్ సంస్థల కోసం ప్రజల్ని బలిపెట్టొద్దు. ప్రభుత్వ భూములంటే.. అవి ప్రజలవే. అలాంటి ప్రజల్నే నిర్వాసితుల్ని చేసి సాధించే అభివృద్ధి ఎవరి కోసమో అందరికీ తెలిసిందే’నంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్‌ఏపీఎం) జాతీయ కన్వీనర్ మేధా పాట్కర్ అన్నారు. ‘మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం-ప్రజల కేంద్రంగా అభివృద్ధి సాధనా ఉద్యమం’ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రధాన వక్తగా మాట్లాడారు. ‘నగరం/పట్టణం అభివృద్ధిలో స్థానికుల పాత్ర మరువలేనిది. ఎవరి కారణంగా ప్రస్తుతం నగరాలు ఇంతలా అభివృద్ధి చెందాయో అలాంటి వారినే నగరానికి దూరంగా తరలిస్తున్నారు.
పేదరికాన్ని దూరం చేయాలన్న ఆలోచన చేయకపోగా.. పేదల్ని దూరం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1956 చట్టం, మహారాష్ట్రంలో 1971 చట్టం మురికివాడల్ని స్థానికంగానే అభివృద్ధి పరిచి, వారికి ఆ స్థలంపై హక్కు కల్పించాలని చెప్తోంది. ఈ చట్టలను ప్రభుత్వమే నీరుగారుస్తోంది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ పేరిట పథకాల్ని ప్రవేశపెట్టి, పేదల్ని ఇబ్బందులపాల్జేస్తున్నారు. ఉన్నతాధికారులు, బడా నేతలు, షాపింగ్ మాల్స్ ఊరుకు దూరంగా ఉన్నా.. ఫర్వాలేదు. పేదలు మాత్రం స్థానికంగానే ఉండాలి. లేకుంటే ఉపాధి, మౌలిక వసతులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. పేదలకు వారున్న చోట, వారే ఇళ్లుకట్టుకునే అవకాశాలు కల్పించాలి’ అని మేధాపాట్కర్ అన్నారు.