సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగం మొత్తాన్ని మోదీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని జాతీయ ప్రజా ఉద్యమ ప్రతినిధి మేధా పాట్కర్ నిప్పులు చెరిగారు. అందులో భాగంగానే ప్రజల సంపద అయిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం జాతి సంపదను అత్యంత చౌకగా కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని దుయ్యబట్టారు.
రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్య ఉద్యమాలే దేశ పాలకులు తమ నిరంకుశ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా చేస్తాయన్నారు. ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయడం ప్రజలందరి కర్తవ్యమని తెలిపారు. విశాఖపట్నం కూర్మన్నపాలెంలో స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరాహార దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి మద్దతు తెలిపిన మేధా పాట్కర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
సాక్షి: ప్రైవేటీకరణపై విశాఖ ఉక్కు కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని మీరెలా చూస్తున్నారు?
మేధా పాట్కర్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఐక్య ఉద్యమం అద్భుతం. స్టీల్‌ప్లాంట్ కార్మికులు 261 రోజులుగా పోరాడుతున్నారు. ఇది అనేక ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తోంది.
సాక్షి: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉండవచ్చు?
మేధా పాట్కర్: మొత్తం దేశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్ సహా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు. ఈ విధానం వల్ల దేశానికి చాలా నష్టం జరుగుతుంది. జాతి సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం కూడా.
సాక్షి: ప్రైవేటీకరణ వల్ల ఎలాంటి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది?
మేధా పాట్కర్: ప్రైవేటీకరణతో అన్నీ నష్టాలే. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్), తప్పనిసరి పదవీ విరమణ (సీఆర్‌ఎస్), గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో కార్మికులను తొలగిస్తారు. ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులను కాంట్రాక్టు లేబర్‌గా మార్చుకుంటారు. రిజర్వేషన్లు అమలు కావు.
ఇది ఊహాజనితం కాదు.. అనేక చోట్ల రుజువైంది కూడా. ఇప్పుడు రైల్వే రంగాన్ని చూస్తే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైల్వేలో అన్ని విభాగాలను ఒక్కొక్కటిగా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు. రేపు ఇక్కడా (విశాఖ స్టీల్ ప్లాంట్‌లోనూ) అదే జరుగుతుంది. దీనివల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతారు. ఇప్పటికే 29 కార్మిక చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా నాలుగు కోడ్‌లుగా మార్చి హక్కులను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
సాక్షి: మీరు కొంతమంది నిర్వాసితులను కలిశారు కదా. వారు ఏమంటున్నారు?
మేధా పాట్కర్: వారి సమస్యలను తెలుసుకొన్నాను. నిర్వాసితులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమందికి ఇంకా పునరావాసం కూడా కల్పించలేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నెరవేరలేదు. స్టీల్‌ప్లాంట్ కోసం తమ వ్యవసాయాన్ని వదులుకొని భూములిచ్చారు. పబ్లిక్ అవసరాల కోసం భూములను ఇస్తే ప్రభుత్వం మాత్రం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది.
సాక్షి: ప్లాంట్ విలువను చాలా తక్కువకే అంచనా వేశారన్న ఆరోపణలున్నాయి. నిజమేనంటారా?
మేధా పాట్కర్: అవును. రెండున్నర లక్షల కోట్ల విలువైన ప్రజా సంపదను కేవలం రెండు, మూడు వేల కోట్లుగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తులకు కారుచౌకగా దీన్ని ఇచ్చేయాలన్నది మోదీ ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టేశారు. స్టీల్‌ప్లాంట్‌ను కూడా ఆయనకే అప్పగిస్తారు. ఆ రెండింటినీ అనుసంధానం చేసి రూ.వేల కోట్ల లాభాలను సంపాదిస్తారు. వారి ఆకలి అక్కడితో ఆగదు.
సాక్షి: స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటం మరింత బలోపేతం కావాలంటే ఏం చేయాలి?
మేధా పాట్కర్: ప్రస్తుతం కార్మికులు, నిర్వాసితులు వేర్వేరుగా ఆందోళన శిబిరాలను నిర్వహిస్తున్నారు. వారిద్దరూ కలిసి పోరాడాలి. రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగాలి. దీనికి మేము కూడా కృషి చేస్తాం. పార్లమెంట్‌లో పోరాడటానికి అవకాశం లేదు. అందువల్ల పార్లమెంట్ బయట ఉధృతంగా ఉద్యమాలను నడపాలి. కార్మిక సంఘాల నాయకులు, నిర్వాసితులు, రైతులు, ప్రజలు, ఐక్యంగా పోరాడాలి.
సాక్షి: పోరాడటం వల్ల ప్రైవేటీకరణను అడ్డుకొనే అవకాశం ఉందా?
మేధా పాట్కర్: ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. అలాంటి విజయాలు చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్‌రాన్ ప్రాజెక్టు ఆగింది.. నర్మదా ప్రాజెక్టుపై పోరాటం జయప్రదంగా సాగింది. పోరాడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment