
రాజధాని ప్రాంతంలో మేధా పాట్కర్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నిర్మించ తలపెట్టిన రాజధాని ప్రాంతాన్ని ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ గురువారం ఉదయం సందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి మనోభావాలు తెలుసుకున్నారు. ప్రజాభిప్రాయన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములను లాక్కోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ల్యాండ్ పూలింగ్ కాదన్నారు. దళితులకు తమ భూములను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని మేధా పాట్కర్ తెలిపారు.తుళ్లూరు మండలంలోని మూడు పంటలు పండే భూములను సీఆర్‌డీఏ చట్టం కింద తీసుకోవడం ఏమిటని ఆమె ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతులు ఇష్టానుసారంగా కాకుండా వారి మీద ఒత్తిడి తె చ్చి భూమిని లాక్కోవడం సరైన పద్ధతి కాదని మేధా పాట్కర్ అన్నారు. ఇప్పటివరకు భూములు ఇచ్చిన వారు కూడా తమకు ఇష్టం లేకపోతే అభ్యంతర పత్రం దాఖలు చేసుకునే అవకాశం ఉందని ఆమె స్థానికులతో అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డె శోభనాధ్రి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.