
‘మెట్రో’ కారిడార్-2ను ఆపాలి
హైదరాబాద్: మెట్రోరైలు ప్రాజెక్టు కారిడార్-2ను ఆపాలని సామాజికవేత్త, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మేథాపాట్కర్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు. ఆప్ ఆధ్వర్యంలో ఆదివారం మెట్రోరైలు ప్రాజెక్టు కారిడార్-2ను ఆపాలని కోరుతూ కాచిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి బడీచౌడి, కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుల్తాన్‌బజార్‌లో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల చారిత్రాత్మక కట్టడాలైన ఆర్యసమాజ్, జైన్‌మందిర్, హనుమాన్ దేవాలయాలను కూల్చివేయాల్సి వస్తుందని తెలిపారు. దీంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువన్నారు. మెట్రోరైలు నిర్మాణం పేరిట ఎల్‌అండ్‌టీ కంపెనీ అవసరం లేకున్నా.. వేలకోట్ల రూపాయల విలువగల భూములను స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. చారిత్రాత్మకమైన కట్టడాలను ఉన్న చోట అండర్‌గ్రౌండ్ ద్వారా మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
గుజరాత్‌లో ప్రతి మూడు నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మొత్తం దేశంలో ఎలా కాపాడుగలుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయొద్దని ఆమె ప్రజలను కోరారు. కార్యక్రమంలో సామాజిక వేత్త సి.రామచంద్రయ్య, ఆప్ నేతలు సుమన్‌గుప్తా, సురేష్‌గోయల్, శశిభూషన్, రాజన్‌శర్మ, నీరజ్‌కుమార్, అలోఖ్, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.