
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లు ప్రవేశపెడతారని వార్తలు రాగా.. చివరినిమిషంలో కిషన్ రెడ్డి బిల్లును సభ ముందుకు తెచ్చారు. జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దుకు 10కిలోమీటర్లు, కశ్మీర్‌లో నియంత్రణరేఖకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే యువతకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు 10శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించే బిల్లును ఫిబ్రవరి 18న కేంద్ర కేబినెట్ ఆమోదించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి కూడా ఆమోదముద్ర లభించింది. జమ్మూకశ్మీర్‌లో ఈబీసీ రిజర్వేషన్ల అమలుకోసం రాష్ట్ర రిజర్వేషన్ల చట్టం 2004కు కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. ఈ బిల్లునే కిషన్‌రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టారు.