
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రస్తుతం లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటన చేశారు. అదేవిధంగా జమ్మూకశ్మీర్ విభజన బిల్లుపై ఆయన చర్చను ప్రారంభించారు. అమిత్ షా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో జమ్మూకశ్మీర్‌కు ప్రయోజనం చేకూరుతుందని, ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్ విభజన బిల్లుల ఆమోదానికి సభలో సహకరించాలని కోరారు. ఇప్పటికే రాజ్యసభలో ఇవి ఆమోదం పొందిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌లో విషయంలో కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పేర్కొనడంతో.. బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. అప్‌డేట్స్ ఇవి..
చరిత్ర సృష్టించిన లోక్‌సభ
జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. 17వ లోక్‌సభ మొదటి సెషన్‌లోనే 36 బిల్లులను ఆమోదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. 280 గంటలపాటు సభా కార్యక్రమాలు సాగాయి. 183 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు.
లోక్‌సభలో నెగ్గిన బిల్లు
జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఈ బిల్లుకు అనుకూలంగా 367 మంది, వ్యతిరేకంగా 67 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు గైర్హాజరయ్యారు.
కశ్మీర్ పూర్తిగా మనదే
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇస్తున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశామని, భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్ శాశ్వతంగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండదని, శాంతి నెలకొనగానే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పూర్తిగా భారత్‌కు చెందుతుందని స్పష్టం చేశారు. 70 ఏళ్లుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపించామన్నారు.
మీడియా ముందుకు ఫరూక్..
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్పరెన్స్ సీనియర్ మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. రాష్ట్రం తగులబడుతుంటే.. తాను ఇంట్లో ఎలా కూర్చుంటానని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతుండగా ఫరూక్ సభలో లేకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా అబద్ధాలు చెప్తున్నారు. నేను కావాలనే ఇంట్లో కూర్చున్నట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నన్ను గృహ నిర్భందం చేశారు. నా కొడుకు ఒమర్‌ను కూడా అరెస్ట్ చేశారు. నన్నూ, నా రాష్ట్ర ప్రజల్ని కాపాడండి’ అంటూ మీడియా ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు.
‘కేంద్ర నాయకులు ప్రాంతాలను విభజించారు. కానీ, హృదయాలను కూడా విభజిస్తారా. జనాలను కూడా హిందూ, ముస్లింలుగా విభజిస్తారా.ఈ దేశం లౌకికతను, ఐక్యతను విశ్వసిస్తుందని భావించాను. కానీ నేడు బీజేపీ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించింది’అని ఫరూక్ వాపోయారు.
ఆయన్ను అరెస్టు చేయలేదు..
ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సభకు హాజరు కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన్ను కేంద్రం అరెస్టు చేయించి అప్రజాస్వామికంగా వ్యహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, ఫరూక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయలేదని, గృహ నిర్భందంలోకి కూడా తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులను ఆదివారం నుంచే కేంద్రం అదుపులోకి తీసుకోవడం గమనార్హం. తక్షణమే కశ్మీర్ నాయకులను విడుదల చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
గవర్నర్ వ్యవహారంపై అఖిలేష్ మండిపాటు..
గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామలతో జమ్మూకశ్మీర్ ప్రజలు ఆందోళనలో ఉన్నారని సమాజ్‌వాది ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. కశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలియదని గవర్నర్ చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. విచక్షణతో కాకుండా కేంద్రం చెప్పుమన్న విషయాలే గవర్నర్ చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
- 70 ఏళ్లపాటు కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి పీవీ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసిందని అన్నారు. పటేల్ సైనిక చర్య ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో అంతర్భాగమైందని గుర్తు చేశారు.
జేడీయూ వాకౌట్..
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎన్డీయే మిత్రపక్షం జేడీయూ వాకౌట్ చేసింది. ఇక రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై హోంమంత్రి అమిత్‌షా బిల్లు ప్రవేశపెట్టగా జేడీయూ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆరు కోట్ల కశ్మీరీల కల సాకారం
ఆర్టికల్ 370 రద్దుతో ఆరు కోట్ల కశ్మీరీల కల సాకారం అవుతోందని జమ్మూ బీజేపీ ఎంపీ కిషోర్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ బేషరతుగా భారత్‌లో విలీనమైందని, విలీనం సమయంలో ఆర్టికల్ 370 లేదని, ఆ తర్వాత ఇది ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలకుల పాపాల వల్లే ఆర్టికల్ 370 వచ్చిందని ఆయన మండిపడ్డారు. లంకను జయించినప్పటికీ శ్రీరాముడు అయోధ్యను విడిచిపెట్టలేదని, అదేవిధంగా జమ్మూకశ్మీర్‌ను భారత్ వదలుకోలేదని, అది మన మాతృభూమిలో భాగమని ఆయన పేర్కొన్నారు.
ఫరుఖ్ అబ్దుల్లా ఎక్కడ? అరెస్టు చేశారా?
ఫరుఖ్ అబ్దుల్లాను అరెస్టు చేశారా? లేదా? ఆ సమాచారం స్పీకర్ వద్ద ఉందా? అని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగారు. లోక్‌సభ ఎంపీ అయిన ఫరుఖ్ అబ్దుల్లా సభలో కనిపించడం లేదని ఆయన ప్రస్తావించారు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌దేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సువర్ణాక్షరాలతో లిఖించాలి
జమ్మూకశ్మీర్ బిల్లు విషయమై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. జమ్మూకశ్మీర్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్‌లోని అంతర్భాగమని ఆయన తేల్చిచెప్పారు. దీనిపై ఎలాంటి వివాదం లేదని తెలిపారు. 1948లో కశ్మీర్ అంశం ఐక్యరాజ్యసమితి ముందుకు వచ్చిందని తెలిపారు. అయితే, ఇది ఇతర దేశాలతో ఏమాత్రం సబంధం లేని అంశమని, జమ్మూకశ్మీర్‌పై ఎలాంటి నిర్ణయమైనా తీసుకొనే హక్కు, చట్టాలు చేసే హక్కు భారత పార్లమెంటుకు ఉందని ఆయన స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ విభజన బిల్లును దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలని అమిత్ షా కొనియాడారు. ఆర్టికల్ 370 డీ ప్రకారం దేశంలోని అన్ని సంస్థానాలు విలీనం అయ్యాయని, అదేవిధంగా కశ్మీర్ సంస్థానం దేశంలో విలీనం అయిందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటు ఆమోదం అవసరం లేదని, దీనిని రద్దు చేయడానికి రాష్ట్రపతి గెజిట్ సరిపోతుందని తెలిపారు.
అప్రకటిత ఎమర్జెన్సీ!
జమ్మూకశ్మీర్ బిల్లు విషయంలో కేంద్రం తీరును డీఎంకే తప్పుబట్టింది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, కశ్మీర్‌కు సంబంధించి కీలక అంశాలు చర్చిస్తున్న సమయంలో మెహబుబా ముఫ్తీ, ఫరుఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌ను ఒక జైలులా మార్చేశారని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు తాత్కాలిక ప్రొవిజన్ సరిపోతుందని ఎలా చెబుతారని, ఎంతో చరిత్ర ఉన్న కశ్మీర్‌ను ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. అంత హడావిడిగా రాష్ట్రపతి గెజిట్‌ను ఎలా జారీ చేస్తారని అన్నారు. కశ్మీర్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆ రాష్ట్రాన్ని విభజించారని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తప్పుబట్టారు.
కశ్మీర్ అంతర్గత వ్యవహారామా? కాదా?
జమ్మూకశ్మీర్ విషయంలో బీజేపీ సర్కారు తీరుపై కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్ మొదటినుంచీ దేశ అంతర్గత వ్యవహారమని, కానీ, ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారని కాంగ్రెస్ సభలో పేర్కొంది. కశ్మీర్ అంతర్గత వ్యవహారమా? లేక ద్వైపాక్షిక వ్యవహారమా? అన్నది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసింది. జమ్మూకశ్మీర్‌లో మాజీ ముఖ్యమంత్రులను గృహనిర్బంధంలో ఉంచి.. బలగాలను మోహరించి ఏకపక్షంగా కశ్మీర్ అధికారాలను తొలగిస్తున్నారని, ఏకపక్షంగా జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోక్‌సభ ఆమోదం లాంఛనప్రాయమే
జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35-ఏ అధికరణాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన తీర్మానం, బిల్లులను కేంద్రం సోమవారమే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది. లోక్‌సభలోనూ ఈ బిల్లు ఆమోదం లాంఛనప్రాయం కానుంది. లోక్‌సభలో అధికార ఎన్డీయే కూటమికి 353 మంది సభ్యుల మద్దతు ఉండటంతో భారీ మెజారిటీతో ఈ బిల్లు సభ ఆమోదం పొందనుంది.
Comments
Please login to add a commentAdd a comment