
బుధవారం రాత్రి పార్లమెంటు వెలుపల విజయ సంకేతం చూపుతున్న కేంద్ర మంత్రులు విజయ్ గోయల్, థావర్‌చంద్ గహ్లోత్ తదితరులు
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిం చే బిల్లు చట్టరూపం దాల్చేందుకు మరింత చేరువైంది. 124వ రాజ్యంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 165 మంది సభ్యులు అనుకూలంగా, ఏడుగురు వ్యతిరేకంగా ఓటేశారు. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లు 323–3 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో రెండు సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు తదుపరి దశలో రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ, సున్నితమైన రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షాలు సహకరించడంతో ఈ బిల్లు పార్లమెంట్ అడ్డంకిని అధిగమించింది. లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలోనూ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విపక్షాలు అంతిమంగా అనుకూలంగానే ఓటేశాయి. ప్రతిపక్షాలు సూచించిన పలు సవరణలు వీగిపోయాయి. బిల్లు రాజ్యాంగబద్ధతపై సందేహాలు వ్యక్తం చేసిన విపక్షాలు..ఈ చట్టం అమలులో సంక్లిష్టతలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. జనసంఖ్యకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించకుండానే కేంద్రం హడావుడిగా ఈ తతంగాన్ని ముగించిందని ఎండగట్టాయి. బిల్లుపై ఓటింగ్ మొదలయ్యాక సభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీపీఐలు వాకౌట్ చేశాయి.
సెలక్ట్ కమిటీ పంపాలని విపక్షం డిమాండ్
సామాజిక న్యాయ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా,రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘ చర్చ జరిగింది. అంతకుముందు, ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు పట్టుపట్టడంతో కొంతసేపు రభస చోటుచేసుకుంది. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లారు. బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ ఆరోపించారు.
బిల్లుకు కాంగ్రెస్ అనుకూలంగానే ఉందని, కానీ దాన్ని ప్రవేశపెట్టిన విధానంలోనే అభ్యంతరాలున్నాయని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. బిల్లును హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ మరో సభ్యుడు ముధుసూదన్ మిస్త్రీ ప్రశ్నించారు. బిల్లు ఉద్దేశాల్ని అందులో పేర్కొనలేదని, నిబంధన ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పం పాలని, తాను ప్రతిపాదించిన సవరణల్ని పరిశీలించాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ను కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు సీపీఐ సభ్యుడు రాజా ఆమెకు మద్దతుగా నిలిచారు.
‘నోట్లరద్దు’ మాదిరే అవుతుంది: సిబల్
సభ తిరిగి ప్రారంభమయ్యాక మొదలైన చర్చలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల కోటా బిల్లును కేంద్రం శ్రద్ధ పెట్టకుండా తీసుకొచ్చిందని, న్యాయపర అడ్డంకులు తప్పవని అన్నారు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తరువాత కూడా నోట్లరద్దు మాదిరిగా అమలులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అగ్రవర్ణ పేదలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. ‘బిల్లును ఉన్న పళంగా హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అన్ని ఒక్కరోజులోనే చేయాలనుకోవడం సబబేనా? ఎలాంటి సమాచారం లేకుండానే బిల్లును తీసుకొచ్చారు.
కోటా పారామితుల్ని నిర్ధారించే ముందు ఏదైనా నివేదిక రూపొందించారో? లేదో? చెప్పండి. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేముందు సెలక్ట్ కమిటీకి పంపి సభ్యుల సూచనలు, అభిప్రాయాలు తీసుకోవాల్సింది’ అని సిబల్ అన్నారు. బిల్లును రూపొందించే ముందు వేర్వేరు కులాలు, వర్గాలకు చెందిన జనసంఖ్య సమాచారాన్ని కేంద్రం సేకరించిందా? అని ప్రశ్నించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సును సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని ప్రస్తావించారు. తాజా బిల్లులో రాజ్యాంగ సంబంధ సంక్లిష్ట విషయాలున్నాయని, శ్రద్ధపెట్టకుండా రూపొందించి, సెలక్ట్ కమిటీకి పంపకుండా నేరుగా పార్లమెంట్ ముందుకు తెచ్చారని ఆరోపించారు.
చిరస్మరణీయ రోజు: గహ్లోత్
జనరల్ కేటగిరిలో పేదలందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా తాజా బిల్లు గొప్ప ముందడుగు అని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ అన్నారు. హడావుడిగా ఈ బిల్లును తీసుకురాలేదని, కోటా ప్రయోజనాలు అందకుండా దూరంగా ఉన్న పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము రూపొందించామని చెప్పారు. కోట్లాది మంది పేదలకు లబ్ధి చేకూర్చే ఈ బిల్లు ఆమోదం పొందిన రోజు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.
ఇది సామాజిక న్యాయ విజయం: మోదీ
కోటా బిల్లును పార్లమెంటు ఆమోదించడం సామాజిక న్యాయ విజయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అభివర్ణించారు. దేశం మార్పువైపు పయనిస్తున్న తరుణంలో ఈ బిల్లు వల్ల యువత ఆ మార్పులో భాగమై అభివృద్ధికి దోహదపడగలరని అన్నారు. ఈ బిల్లుకు ఇంతటి మద్దతు లభించడం తనకు ఆనందం కలిగించిందని ట్విట్టర్‌లో చెప్పారు. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా రాజ్యాంగ నిర్మాతలకు, స్వాతంత్య్ర సమరయోధులకు పార్లమెంటు నివాళి అర్పించిందన్నారు.
దేశం మార్పువైపు పయనిస్తున్న తరుణంలో ఈ బిల్లు వల్ల యువత అందులో భాగమై అభివృద్ధికి దోహదపడగలదు. ఈ బిల్లుకు ఇంతటి మద్దతు లభించడం నాకు ఆనందం కలిగించింది. బిల్లును ఆమోదించడం ద్వారా రాజ్యాంగ నిర్మాతలకు, స్వాతంత్య్ర సమరయోధులకు పార్లమెంటు నివాళి అర్పించింది
– ట్విట్టర్‌లో ప్రధాని మోదీ
అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం శ్రద్ధ పెట్టకుండా తీసుకొచ్చింది. బిల్లుకు న్యాయపరమైన అడ్డంకులు తప్పవు. ఇది పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తరువాత కూడా నోట్ల రద్దు మాదిరిగా అమల్లో ఇబ్బందులు తప్పవు. అగ్రవర్ణ పేదలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడమే ఇందుకు కారణం
– కపిల్ సిబల్
ఈ కోటా ముందున్న సవాళ్లు ఏంటి?
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టమయ్యాక న్యాయ సమీక్షకు నిలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోటా అమలును అడ్డుకునేందుకు ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై గతంలో విధించిన 50% పరిమితిని తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరిస్తే అన్ని రాష్ట్రాలూ తమ పరిధిలోని రిజర్వేషన్లను, తమ రాజకీయ ప్రయోజనాల కోసం భారీగా పెంచుకోవడానికి సిద్ధమవుతాయి. ఒకవేళ కోటాల గరిష్ట పరిమితి 50 శాతం మించడాన్ని సుప్రీం తిరస్కరిస్తే అగ్రవర్ణ పేదల కోటాను అమలు చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటాను తగ్గించాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఈ 10% ఈబీసీ కోటాను ప్రస్తుతమున్న 50 శాతంలోనే చేర్చాల్సి ఉంటుంది. దాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తాయి.
అగ్రకులాలన్నింటికీ మేలు జరిగేనా?
పది శాతం కోటాను అగ్రవర్ణాలకు చెందిన వారు సమర్థిస్తారు. ఈ కొత్త కోటా అగ్ర కులాల ప్రజలను కాషాయ పక్షం వైపు మళ్లేలా చేయవచ్చు. అయితే, దీని వల్ల బీజేపీకి ఏ స్థాయిలో రాజకీయ ప్రయోజనం చేకూరుతుందో చెప్పలేం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతమున్న 50 శాతానికి అదనంగానే ఈబీసీ పది శాతం కోటా ఉంటుందని కేంద్రం చెబుతున్నా.. కోటా గరిష్ట పరిమితిని పెంచడానికి సుప్రీం నిరాకరిస్తే తమ కోటా వాటా తగ్గిపోతుందని వారు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది.
ఆర్థిక ప్రాతిపదికను రాజ్యాంగం ఆమోదిస్తుందా?
ఎంతో కాలంగా సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా (ఈ మూడు విధాలా) అన్యాయానికి గురైన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం, న్యాయస్థానాలు చెబుతున్నాయి. పేదరికం అనేది సామాజిక, వ్యవస్థాపరమైన అణచివేత కిందకు రాదని కూడా రాజ్యాంగం ప్రకటిస్తోంది. కొన్ని వర్గాల ప్రజలకు కోటా అమలుకు రాజ్యాంగంలో మార్పులు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. కాని చట్ట సవరణ ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడానికి అధికారం లేదు.
రాజ్యాంగంలో సమానత్వ సూత్రం అమలుకు రిజర్వ్‌డ్ సీట్లు, ఓపెన్ కేటగిరీ సీట్లు చెరి సగం ఉండేలా కోటా పరిమితిని 50 శాతంగా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ సమానత్వం కాపాడే ఏర్పాటును రాజ్యాంగంలోని మౌలిక సూత్రంగా పరిగణిస్తున్నారు. 50 శాతానికి పైన అదనంగా పది శాతం కోటా ఇవ్వడం అంటే సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘించడంగా పలువురు భావిస్తున్నారు. ఈ కారణంగా ఈబీసీ కోటా చట్ట రూపంలోకి వచ్చి అమలు జరిగితే దానిపై కోర్టుల్లో వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈబీసీ కోటా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ కేటగిరీలోని పేద వర్గాలను ఎంత వరకు ప్రభావితం చేస్తుందో వేచిచూడాలి.
50 శాతం దాటకూడదని రాజ్యాంగంలో లేదు: ప్రసాద్
వెనుకపడిన వర్గాల(బీసీ) రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాజాగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 124వ రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకొస్తున్న ఈ చట్టం కేంద్రం, రాష్ట్రాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ..‘రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దీన్ని సుప్రీంకోర్టు మాత్రమే చెప్పింది. తాజాగా ఈబీసీ బిల్లులో భాగంగా మేం ప్రాథమిక హక్కుల్లోని రెండు ఆర్టికల్స్‌ను సవరిస్తున్నాం.
రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్‌కు ఆర్థికంగా వెనుకపడిన వర్గాలను నిర్వచించేలా ఓ క్లాజ్‌ను జతచేస్తున్నాం. అలాగే ఆర్టికల్ 16లో ఎస్సీ,ఎస్టీలతో పాటు వీరికి రిజర్వేషన్ కల్పించేలా ఆరో క్లాజును చేరుస్తున్నాం. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఈబీసీలకు అవకాశం లభిస్తుంది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకత ఏంటంటే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్‌పై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు’ అని ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రాలకు ముందుగా తెలియజేయకుండా ఈ బిల్లును లోక్‌సభలో ఎందుకు ప్రవేశపెట్టారన్న డీఎంకే ఎంపీ కనిమొళి ప్రశ్నకు స్పందిస్తూ.. ఆర్టికల్ 368 కింద రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు బిల్లు రాష్ట్ర విధానసభకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
బుధవారం రాజ్యసభలో ఆందోళన చేస్తున్న విపక్ష పార్టీల సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment