కర్నూలు ప్రాంతాన్ని పరిపాలించని ఉత్తర, దక్షిణ భారత ప్రసిద్ధ రాజవంశాలు లేవంటే అతిశయోక్తి కాదు. క్రీస్తుపూర్వం ఈ ప్రాంతాన్ని మౌర్యులు పాలించారు. తర్వాతి కాలంలో చాళుక్యులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పాలించారు. విజయనగర రాజుల పాలన ఈ ప్రాంతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓటమి తరువాత ముస్లిం పాలకులు: బీజాపుర్ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, గోల్కొండ నవాబులు, కర్నూలు నవాబులు దాదాపు 275 ఏళ్లు పాలించారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనపై మొదట 1801లో ముత్తుకూరు గౌడప్ప నాయకత్వంలో తెర్నేకల్ గ్రామం పన్నులు కట్టడానికి నిరాకరించింది. బ్రిటీష్ సైనికుల ముట్టడిలో అనేకమంది గ్రామస్థులు మరణించారు. బ్రిటిష్ వారిని ఎదిరించి తిరుగుబాటు చేసిన మొదటి గ్రామంగా తెర్నేకల్‌ను చెప్పవచ్చు.
ప్రసిద్ధి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిన్నవయసులోనే బ్రిటిష్ ప్రభుత్వ కఠినమైన పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు అతి త్వరగా 66 గ్రామాలకు వ్యాపించింది. 1846–1847 మధ్య కాలంలో ఈయన సాహసోపేతమైన ప్రతిఘటన జనరల్ ఆండర్సన్ ఆధ్వర్యంలోని ఆంగ్లేయ దళాలను గడగడ లాడించింది. అయితే అపారమైన బ్రిటిష్ సైన్యం ముందు ఓటమి తప్పలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించి ఉరితీసింది కంపెనీ ప్రభుత్వం.
1800వ సంవత్సరంలో నిజాం నవాబు ఈస్టిండియా కంపెనీ వారికి సైనిక ఖర్చుల కోసం ఇవ్వవలసిన సొమ్ముకు బదులుగా బళ్ళారి, కడప జిల్లాలను పూర్తిగానూ; కర్నూలు జిల్లాలోని కంభం, మార్కాపురం, కోయిలకుంట్ల, పత్తికొండ తాలూకాలను ఇచ్చాడు. ఇలా వారికి ధారాదత్తం చేయడంతో ఈ ప్రాంతాలకు ‘దత్త మండలాలు’ అనే పేరు వచ్చింది. ఈస్టిండియా కంపెనీ పాలనలో కర్నూలు ప్రాంతం 1800వ సంవత్సరం నుంచి 1857వ సంవత్సరం వరకు కొనసాగింది.
దత్తమండలాలకు ప్రధాన కలెక్టరుగా థామస్ మన్రో 1800–1807 వరకు సేవలను అందిచాడు. కర్నూలు ప్రాంతాన్ని పాలించిన మొదటి కలెక్టరు ఆయనే. రైత్వారీ భూవిధానం వంటి వ్యవస్థాగతమైన మార్పులతో ఉత్తమ పాలన సాగింది. మన్రో నివేదికను అమలుచేస్తూ రెవిన్యూ పరిపాలన సౌలభ్యం కోసం 1808వ సంవత్సరంలో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. అవి కడప, బళ్ళారి జిల్లాలు. అనంతపురం ప్రాంతం బళ్ళారి జిల్లాలో, కర్నూలు ప్రాంతం కడప జిల్లాలో భాగంగా ఉండేవి.
కర్నూలు పరిధిలోని రామళ్లకోట, నంద్యాల, సిరివెల్, నందికొట్కూరు తాలూకాలతో పాటు కడప జిల్లా నుంచి దూపాడు (మార్కాపురం), కంభం, కోయిలకుంట్ల; బళ్లారి జిల్లా నుంచి పత్తికొండ తాలూకాను కలిపి మొత్తం 8 తాలూకాలతో 1858 జూలై 1న కర్నూలు జిల్లా అవతరించినది. స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఈ జిల్లాలో ఎలాంటి మార్పులూ సంభవించలేదు. అయితే 2022 ఏప్రిల్ 4న జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కర్నూలు జిల్లా రెండుగా... అంటే కర్నూలు, నంద్యాల జిల్లాలుగా విభజితమయ్యింది.
ప్రస్తుతం జనాభా విషయంలో నంద్యాల జిల్లా కంటే ఎక్కువగా, వైశాల్యం, రెవిన్యూ విషయంలో నంద్యాల జిల్లా కంటే తక్కువ స్థాయితో కర్నూలు మారిన పరిస్థితిని గమనించగలం.
– ఆచార్య మన్సూర్ రహ్మాన్
సామాజిక – ఆర్థిక విశ్లేషకులు ‘ 9441067984
(కర్నూలు జిల్లా 166వ అవతరణ దినోత్సవం నేడు)
రాచరికం నుంచి ప్రజాస్వామ్యం దాకా...
Published Mon, Jul 1 2024 4:36 AM | Last Updated on Mon, Jul 1 2024 4:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment