జ్ఞానపీఠం ఎక్కిన జానపదుడు: కన్నడ రచయిత డాక్టర్ చంద్రశేఖర కంబార
రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ వచ్చినప్పుడు మొదటిసారి చంద్రశేఖర కంబారను కలిసాను. అప్పుడాయన– ‘మీ ప్రాంతంలో ఆసాదులనేవాళ్ళుంటారు. వాళ్ళు జాతర సమయంలో అగ్రవర్ణాలవాళ్ళను బండబూతులు తిడతారు. అయినా వాళ్ళని ఎవరూ ఏమీ అనరు. మీకు వాళ్ళ గురించి తెలుసా? ‘అనడం’ వాళ్ళ కుసంస్కారంగానీ ‘పడటం’ వీళ్ళ సహనశీలత్వంగానీ కాదని తెలుసా?’ అని అడిగారు. ముష్టూరు గంగ జాతర గురించి అడిగిన మొట్టమొదటి సాహితీవేత్త కంబార. ఆయనకి జనపదాలంటే ప్రాణం. లేకపోతే ఎక్కడో మహారాష్ట్ర సరిహద్దులనించీ బెంగుళూరు వచ్చిన ఆయనకి, చిత్తూరు మారుమూల గ్రామాల్లో జరిగే గంగజాతర గురించి తెలిసే అవకాశం లేదు.
కథ, కవనం, కావ్యం, కథనం, నవల, నాటకం ఏదైనా సరే, మౌఖిక సంప్రదాయంలో సాగుతోందీ అంటే అది చంద్రశేఖర కంబార రాసిందని ఇట్టే గుర్తు పట్టేయచ్చు. ఆయన వాక్యం ఆయన చింతన, భావనల అభివ్యక్తి మాత్రమే కాదు. అది ఆయన మనతో ప్రత్యక్షంగా జరిపే సంభాషణ. ఆయన వ్యక్తీకరణలు గతంతో, పెద్దరికంతో, మార్మికతతో, మానవాతీత నిగూఢత్వంతో, వ్యవస్థ కట్టుకున్న మడి పంచెలను పదే పదే చీల్చుకువచ్చే ఆది లైంగికతతోబాటు, జాగృదావస్థను దాటి మనోలోకాల పొడుపులు–విడుపులతోబాటు జాతీయాలు, సామెతల ఆమెతలతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. వారిదో విస్మయలోకం. అందులోకి ప్రవేశమేగానీ నిర్గమనం ఉండదు. అందుకే భారతీయ సాహిత్యం వారిని జ్ఞానపీఠంతో పురస్కరించుకుంది. ఇటీవల డాక్టర్ సి.నారాయణరెడ్డి స్మారక పురస్కారాన్ని అందుకునేందుకు హైదరాబాద్ వచ్చిన కంబారతో చిత్తూరు మాండలికంలో రాసే పశ్చిమ గోదావరి జానపదుడు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి జరిపిన సంభాషణ.
జానపదులకీ నాగరీకులకీ తేడా ఏమిటి?
ఏ దేశంవారైనా, ఏ మతంవారైనా నాగరీకులంతా పాప ప్రక్షాళన కోసమే దైవాన్ని రూపించుకుంటారు. జానపదులు అలా కాదు. ఎన్నో జన్మల పుణ్య ఫలంగా మానవ జన్మ లభించిందని భావిస్తారు. వారికి పాపం గురించి మాత్రమే తెలుసు–వీరికి పుణ్యం గురించి మాత్రమే తెలుసు. వారిలో అతిశయం ఉంటుంది – వీరిలో కృతజ్ఞత ఉంటుంది. అది లొంగదీయడంలో స్వాతంత్య్రం కోరుతుంది– ఇది వినయంతోనే స్వతంత్రంగా ఉంటుంది. వారు మేధావుల్లా వర్తించే అమాయకులు– వీరు అమాయకుల్లా కనపడే సర్వజ్ఞులు.
ప్లేటో ‘రిపబ్లిక్’లాగా, సర్ థామస్ మోర్ ‘యుటోపియా’లాగా మీ ‘శివాపురం’ కూడా ఒక కాల్పనిక ఆదర్శ జనపదం. దీని ప్రత్యేకతలేమిటి?
శివాపురానికి కాలిబాట తప్ప మరో దారిలేదు. ఊళ్ళోని వీధులేవీ ఊరు దాటి వెళ్ళవు. శివాపురం పక్కనే ప్రవహించే వాగులో కవిసమయపు కమలాలు వికసించవు. ఆ నీళ్ళలో ఈదడానికి హంసలు రావు. ఊరినిండా మనుషులుంటారు. బింబాలే కాదు, ప్రతిబింబాలూ ఉంటాయి. అవికూడా తమవంతు పాత్రని ఏమారకుండా నిర్వహిస్తూంటాయి. మనం పొగొట్టుకున్నవీ, పోగొట్టుకుంటున్నవీ, పోగొట్టుకోకూడనివీ అన్నీ ఉంటాయి. ఆ కథలు వింటూ రాసిందే నా సాహిత్యం.
కథలంటే గుర్తొచ్చింది, ఈ ఆధునిక కాలంలో నగరీకరణం పెరిగిపోతోంది. కథలు చెప్పడం– వినడం తగ్గిపోతోంది.
ఎవరెంత నగరీకృతులైనా పుట్టుకతో వచ్చిన వారి భాష (చంపితే తప్ప) చచ్చిపోదు. జానపదులు కొత్తవారితో కలిసినప్పుడు కొత్త పదాల్ని చేర్చుకుంటూ కొత్త భాషని సృష్టించుకుంటారు. కానీ నాగరీకులు పలురకాల ఆకర్షణలతో జానపదుల్ని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ ఆకర్షణలకి లొంగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమెరికా వెళ్ళడానికే పుట్టామన్న భ్రమల్లో పడకుండా చూసుకోవాలి. ఎంతమందొచ్చినా ఇంకొంతమందికి చోటివ్వడానికి అదేమీ పుష్పక విమానం కాదు. అది కూడా మనూరిలాంటిదే.
భారతీయ గ్రామాలన్నీ వాటి స్వభావాల్ని కోల్పోతున్నాయి. ముందుముందు మీవంటి జానపద సాహిత్యకారులు పుట్టే అవకాశాలు ఉండవేమో అనిపిస్తోంది.
ఈనాటి గ్రామాలు అప్పట్లా లేవు. పిల్లలకి కథలు చెప్పడాన్ని పనికిమాలిన పనిగా భావిస్తున్నాం. కానీ తను విన్న కథని వేరొకరికి చెప్పేటప్పుడు పిల్లవాడు తనకి తెలియకుండా తన తెలివితేటల్ని ఉపయోగించి మనం చెప్పని విషయాల్ని కూడా జోడిస్తాడు. అదే సృజన. లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకోలేనివాడు కొత్త పరికల్పనలు చెయ్యలేడు. అవి చెయ్యలేనివాడు కొత్త విషయాల్ని కనిపెట్టలేడు. అందుకే పిల్లలకు కథలు చెప్పాలి, వాళ్ళని కథలు చెప్పనివ్వాలి.
తెలుగులో బాలసాహిత్యం రానురానూ తగ్గిపోతోంది. కన్నడంలో ఎలా ఉంది?
ఎక్కడి పిల్లలు అక్కడి మట్టిలో ఆడాలి, పాడాలి, అల్లరి చెయ్యాలి. ఆ మట్టి విలువ తెలిస్తే అమ్మ విలువా అమ్మ చెప్పే కథల విలువా తెలుస్తుంది. కానీ మనం వాళ్ళని పుస్తకాలు, కంప్యూటర్, టీవీలకి కట్టేస్తున్నాం. మూడూ నిర్జీవమైనవే. ఇవి పిల్లలు కోరుకున్నవి కాదు. మనం వారికి బలవంతంగా అంటగడుతున్నవి. కృత్రిమ మేధస్సు సమీకరించుకుంటున్న వాళ్ళకి మన జానపద కథలు చెబితే ‘చిలక మాట్లాడిందంటే నమ్మచ్చుగానీ కాకి మాట్లాడ్డమేంటి? కాకమ్మ కథలు చెప్పకు’ అంటూ కథలు వినే ఆసక్తిని పోగొట్టుకుంటాడు. అమ్మ కథలు విననిచోట రాసేవాళ్ళు మాత్రం ఎందుకుంటారు? అందుకే మా కన్నడ బాలసాహిత్యం పరిస్థితి మీ కంటే భిన్నంగా ఏమీ లేదు.
జానపదం మీలోని సృజనశీల సాహిత్య రచనకి ఏ విధంగా దోహద పడింది?
జానపదం లేకుండా నేను లేను. అది నాకు పరాయిదని అనుకోలేను. నన్ను సమష్టిగా రూపొందించి, సమష్టిలో భాగంగా చూసే కళ్ళిచ్చిందే జానపదం. ఒక బయలాట (వీధి నాటకం లాంటిది) ఉండేది. పేరు ‘అరణ్యకుమారుడి కథ’. అందులో ఒక రాక్షసుడుంటాడు. అతను రాకుమారి దగ్గరకి రాజు వేషంలో వెళ్తూంటాడు. ఆమెతో స్వర్గ సుఖాలనుభవిస్తూంటాడు. ఒకరు మరొకరి వేషంలో స్వేచ్ఛగా తిరుగుతూ యథేచ్ఛగా ప్రవర్తించే ఈ కల్పన నన్ను వెంటాడుతూ ఉండేది. ఒక విధంగా ఇది నా రచనా వ్యాసంగంలో ప్రతిఫలించి రచనల్ని రూపించిన కథ. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం క్రూరంగా ఉండేది. వాళ్ళంటే మాకు భయభక్తులు మాత్రమే ఉండేవి. కానీ, వారి జాత్యహంకారం పట్ల లోపల్లోపల ఒకవిధమైన ఆకర్షణ ఉండేది. వాళ్ళు మాత్రమే స్నానానికి సబ్బులు వాడేవాళ్ళు. వాళ్లు చూడకుండా ఆ సబ్బుల్ని స్పర్శించి ఆనందించేవాళ్ళం. అదే సమయంలో ఎక్కడో బెళగాంలో మార్చ్ ఫాస్ట్ జరుగుతుంటే ఆ బ్యాండు మోతకి ఇక్కడ మా కాళ్ళు వణికేవి. ఆ అమాయకత్వం, ఆ స్వచ్ఛత, అక్కడి భాషలోని మాధుర్యం, భావ ప్రకటనలోని సౌందర్యం, అన్నీ కలిసి నన్నూ నా రచనల్నీ రూపొందించాయి.
మీరు మాట్లాడే భాషలాగే మీ సాహిత్య భాషకూడా మాండలికమే. మీరా జానపదుల భాషనే ఎందుకు ఉపయోగిస్తారు?
జానపదుల భాషలో అభివ్యక్తి సామర్థ్యం ఎక్కువ. వారి మాటల్లో ధ్వని తరంగాలు నాదమయమై వెలువడతాయి. నాగరికుల భాషలో సంస్కారం ఎక్కువ. వారి మాటలు కూడా వారి ప్రవర్తనలాగే హెచ్చుతగ్గులు లేకుండా ఎలాంటి స్వారస్యం లేకుండా పత్రికా భాషలాగా ఉంటాయి. జానపదుల భాషలోనూ జీవనంలోనూ దాపరికం ఉండదు.
మావైపు జానపద కళలు క్రమంగా తమ వైభవాన్ని కోల్పోయి అవసానదశకు చేరుకున్నాయి. మీవైపు పరిస్థితి?
విజయనగర సామ్రాజ్య కాలంలో విజయ దశమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు మైసూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాలానికి అనుగుణమైన మార్పుల్ని తమలో ఇముడ్చుకుంటున్నాయి. కేవలం మైసూరు సంస్థానానికే పరిమితమైన ఈ ఉత్సవాలని నాడ హబ్బ(రాష్ట్రీయ పర్వదినం)గా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ఫలితంగా ఈ ఉత్సవం అన్ని ప్రాంతాలకూ విస్తరించడం, స్థానిక కళలకు ప్రోత్సాహం లభించేలా చెయ్యడం ప్రజాస్వామిక ప్రభుత్వం సాధించిన క్రియాశీల ప్రగతిగా పేర్కొనవచ్చు.
జనపదాల్ని కలుషితం చేయడంలో ప్రధానపాత్ర వహిస్తున్నది ఏమిటి?
జనపదాల్ని మాత్రమే కాదు, అన్నిరకాల మౌలిక విలువల్నీ కలుషితం చేస్తున్నది మన విద్యావిధానంలోని తారతమ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవాళ్ళకి ఆత్మన్యూనతాభావం, లక్షలు పోసి ప్రభుత్వేతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకి అహంకారం వద్దన్నా పెరుగుతాయి. అందుకే ఒకటి నుండి పదవ తరగతి వరకూ శిక్షణా బాధ్యతని పూర్తిగా ప్రభుత్వమే వహించాలి. బడిలో కాలు పెట్టకముందే తారతమ్యం చూపించే చదువు ఏ సమాజానికైనా ఆరోగ్యకరమైన భవిష్యత్తునెలా ఇవ్వగలదు?
కన్నడంలో జాతీయ బహుమతి పొందిన మొదటి చలనచిత్రగీతం మీ ‘కాడుకుదురె ఓడి బందిత్తా’ కూడా జానపదమే. కన్నడ చలన చిత్ర రచయితగా, సంగీతజ్ఞుడిగా, దర్శకుడిగా చిత్రసీమ సిగలో మీరు అలంకరించిన నెమలీకలు ఎన్నో ఉన్నాయి. నేటి చలన చిత్ర పరిశ్రమ గురించి మీ అభిప్రాయం?
నమ్మకం విషయంలో విన్నది లేదా చదివినదానికంటే చూసిందానికే ప్రాధాన్యత–ప్రభావం ఎక్కువ. ఈ నమ్మకాన్ని దృశ్య మాధ్యమాలకు చెందిన ఇరవై నాలుగు కళాసాంకేతిక వర్గాలూ కలిసి శక్తివంచన లేకుండా వమ్ము చేస్తున్నాయి. వెండితెర, బుల్లితెర జీవితానికి అద్దం పట్టాలి. వాటిలో జనం తమని తాము చూసుకోవాలి. అద్దంలో అందం, వికారం రెండూ కనిపిస్తాయి. కానీ భ్రమలు కనిపించవు. దురదృష్టవశాత్తూ దృశ్యమాధ్యమాలన్నీ భ్రమల్ని మాత్రమే చూపిస్తూండటం వల్ల ప్రస్తుత పరిస్థితి ఎదురైంది.
మిమ్మల్ని వెంటాడిన రచయితలెవరు?
కన్నడంలో అల్లమ ప్రభు. ఇంగ్లీష్‌లో డబ్ల్యూ.బి.ఈట్స్.
మీరు రాసినవాటిలో మీకు బాగా నచ్చిన రచన ఏది?
రచయితకి తను రాసినవాటిల్లో ఏదైనా ఒక రచన అన్ని విధాలా నచ్చిందీ అంటే తనింక రాయడు. ఏ రచనైనా పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇచ్చిందీ అంటే అతని దగ్గర రాయడానికి ఏమీ మిగలదు. నా రచనల్లో ఏదీ నన్ను సంతుష్టుడిని చెయ్యలేదు. అందుకే నేను రాస్తూనే ఉన్నాను. రాయకపోతే నేనుండను.
Comments
Please login to add a commentAdd a comment