Janapadas
-
Singer Parvathy: నా అదృష్టం.. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి: పార్వతి
వసంతకాలం అనగానే విరబూసిన పూలు, లేలేత మావి చిగుళ్లు కోయిలమ్మల రాగాలు మదిలో మెదులుతాయి. అలాగే, ఈ సీజన్లో తమ గానామృతంతో మనల్ని అలరిస్తూ సందడి చేస్తున్నారు దాసరి పార్వతి, దివ్యజ్యోతి, దుర్గవ్వలు. టాలెంట్ ఉంటే ఏ మూలన ఉన్నా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. పని కష్టం మర్చిపోవడానికి నోటినుండి వెలువడే పదాలే పాటలుగా ఆకట్టుకుంటాయి. అవే జానపదాలై గ్రామీణుల గొంతుల్లో విరాజిల్లుతాయి. అలా మట్టిపరిమళం నుంచి వచ్చిన గొంతుక దుర్గవ్వది. తను పాట పాడితే వెన్నెల చల్లదనమంతా కురుస్తుందా అనిపించే గొంతుక పార్వతిది. అలసిన వేళ పాటే తోడు అంటూ విరిసిన గొంతుక జ్యోతి ది. తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈ కోయిలమ్మలు తమ కమ్మటి రాగాల వెనక దాగి ఉన్న కష్టాన్ని, తమ పాట తమను నిలబెట్టిన తీరును సాక్షితో పంచుకున్నారు. ఊరంతా వెన్నెల... పార్వతి ఓ టీవీ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి...’ పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగునాట నెట్టింట పార్వతి పాడిన పాటను సెర్చ్ చేయని వాళ్లు లేరు అనేంతగా గుర్తింపు పొందింది. పార్వతి స్వస్థలం కర్నూల్ జిల్లా, లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. ‘చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేదాన్ని. ఊళ్లో అందరూ గొంతు కోయిలలా ఉందని మెచ్చుకుంటుండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్లేదాన్ని. పొలం పనులకు వచ్చేవాళ్లు కూడా నా చేత పాటలు పాడించుకునేవారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా అన్నయ్యల స్నేహితులు మ్యూజిక్ కాలేజీలో చేరమన్నారు. అలా ఇప్పుడు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో ఎం.ఎ చేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్ వాళ్లు పెట్టిన ఆడిషన్స్‌లో సెలక్ట్ అయ్యాను. ఆ సందర్భంగా పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి. ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకుంది పార్వతి. మట్టిగొంతుక... దుర్గవ్వ పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ. కూలిపనులు చేసుకుని, జీవనం సాగించే దుర్గవ్వకు ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆమె పాడిన ‘అడవి తల్లి..’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన ఈ సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొడుకు, కూతురు ఉన్న దుర్గవ్వ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కాయకష్టంలో వచ్చే పల్లె పదాలు ఎన్నో. ‘‘చిన్నతనం నుంచి పాటెన్నడూ నన్ను వీడలేదు. ఓ రోజు నా బిడ్డ నా చేత నాలుగు పాటలు పాడించి చానళ్లలో పెట్టింది. ముందు వద్దన్న. కానీ, పిల్లలు వినలేదు. ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మా దగ్గర కొంతమంది జానపద కళాకారులు నా చేత ఇంకొన్ని పాటలు పాడించారు. అక్కడి నుంచి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎక్కడో కూలి చేసుకుని బతికే నేను ఇలా అందరి ముందు పాటలు పాడటం, పేరు రావడం ఆనందంగా ఉంది’ అని వివరిస్తుంది దుర్గవ్వ. ప్రైవేట్ ఆల్బమ్‌లలో దుర్గవ్వ పాడిన పాటల్లో ‘సిరిసిల్ల చిన్నది..’, ‘నాయితల్లే.., ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఊరటనిచ్చిన పాట.. అనుకోకుండా ఎగిసిన గొంతుకలా నెట్టింట వైరల్ అయ్యింది దివ్యజ్యోతి. కరీంనగర్ జిల్లా నర్సింగపురం నుంచి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ చేరిన కుటుంబం జ్యోతిది. భర్త కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. జ్యోతి ప్రైవేట్ కంపెనీలలో హౌస్ కీపర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి భర్త కాలు తీసేయడంతో కుటుబానికి జ్యోతి సంపాదనే ఆదరవు అవుతోంది. ‘‘కష్టంలో నాతో పాటు ఎప్పుడూ తోడుండేది పాటనే. ఆనందమేసినా నోటికొచ్చిన పాటలు పాడుకునేదాన్ని. చాలాసార్లు మాటలే పాటలవుతుంటాయి. నేను పనిచేసే చోట నాగవల్లి మేడం నాచేత పాట పాడించింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టడంతో నా గొంతుకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లలో పాటలు పాడుతున్నాను. ఉదయం పూట డ్యూటీ చేస్తున్నాను. రాత్రిపూట పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నీ గొంతు చాలా బాగుంది. సినిమాల్లోనూ నీ చేత పాటలు పాడిస్తామని పెద్దోళ్లు చెబుతున్నరు’’ అని ఆనందంగా వివరిస్తుంది జ్యోతి. మనసు పెట్టి వినాలే కానీ, మన ఇరుగు పొరుగు, మనతోపాటు పని చేసేవారి గొంతుకలలో గమకాలు పలుకుతుంటాయి. గుర్తించి ఆస్వాదించాలి. పదిమందికీ వినిపించాలి. అప్పుడే పాటకు పట్టాభిషేకం జరుగుతుంది. – నిర్మలారెడ్డి -
జానపదులు అమాయకుల్లా కనబడే సర్వజ్ఞులు
రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ వచ్చినప్పుడు మొదటిసారి చంద్రశేఖర కంబారను కలిసాను. అప్పుడాయన– ‘మీ ప్రాంతంలో ఆసాదులనేవాళ్ళుంటారు. వాళ్ళు జాతర సమయంలో అగ్రవర్ణాలవాళ్ళను బండబూతులు తిడతారు. అయినా వాళ్ళని ఎవరూ ఏమీ అనరు. మీకు వాళ్ళ గురించి తెలుసా? ‘అనడం’ వాళ్ళ కుసంస్కారంగానీ ‘పడటం’ వీళ్ళ సహనశీలత్వంగానీ కాదని తెలుసా?’ అని అడిగారు. ముష్టూరు గంగ జాతర గురించి అడిగిన మొట్టమొదటి సాహితీవేత్త కంబార. ఆయనకి జనపదాలంటే ప్రాణం. లేకపోతే ఎక్కడో మహారాష్ట్ర సరిహద్దులనించీ బెంగుళూరు వచ్చిన ఆయనకి, చిత్తూరు మారుమూల గ్రామాల్లో జరిగే గంగజాతర గురించి తెలిసే అవకాశం లేదు. కథ, కవనం, కావ్యం, కథనం, నవల, నాటకం ఏదైనా సరే, మౌఖిక సంప్రదాయంలో సాగుతోందీ అంటే అది చంద్రశేఖర కంబార రాసిందని ఇట్టే గుర్తు పట్టేయచ్చు. ఆయన వాక్యం ఆయన చింతన, భావనల అభివ్యక్తి మాత్రమే కాదు. అది ఆయన మనతో ప్రత్యక్షంగా జరిపే సంభాషణ. ఆయన వ్యక్తీకరణలు గతంతో, పెద్దరికంతో, మార్మికతతో, మానవాతీత నిగూఢత్వంతో, వ్యవస్థ కట్టుకున్న మడి పంచెలను పదే పదే చీల్చుకువచ్చే ఆది లైంగికతతోబాటు, జాగృదావస్థను దాటి మనోలోకాల పొడుపులు–విడుపులతోబాటు జాతీయాలు, సామెతల ఆమెతలతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. వారిదో విస్మయలోకం. అందులోకి ప్రవేశమేగానీ నిర్గమనం ఉండదు. అందుకే భారతీయ సాహిత్యం వారిని జ్ఞానపీఠంతో పురస్కరించుకుంది. ఇటీవల డాక్టర్ సి.నారాయణరెడ్డి స్మారక పురస్కారాన్ని అందుకునేందుకు హైదరాబాద్ వచ్చిన కంబారతో చిత్తూరు మాండలికంలో రాసే పశ్చిమ గోదావరి జానపదుడు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి జరిపిన సంభాషణ. జానపదులకీ నాగరీకులకీ తేడా ఏమిటి? ఏ దేశంవారైనా, ఏ మతంవారైనా నాగరీకులంతా పాప ప్రక్షాళన కోసమే దైవాన్ని రూపించుకుంటారు. జానపదులు అలా కాదు. ఎన్నో జన్మల పుణ్య ఫలంగా మానవ జన్మ లభించిందని భావిస్తారు. వారికి పాపం గురించి మాత్రమే తెలుసు–వీరికి పుణ్యం గురించి మాత్రమే తెలుసు. వారిలో అతిశయం ఉంటుంది – వీరిలో కృతజ్ఞత ఉంటుంది. అది లొంగదీయడంలో స్వాతంత్య్రం కోరుతుంది– ఇది వినయంతోనే స్వతంత్రంగా ఉంటుంది. వారు మేధావుల్లా వర్తించే అమాయకులు– వీరు అమాయకుల్లా కనపడే సర్వజ్ఞులు. ప్లేటో ‘రిపబ్లిక్’లాగా, సర్ థామస్ మోర్ ‘యుటోపియా’లాగా మీ ‘శివాపురం’ కూడా ఒక కాల్పనిక ఆదర్శ జనపదం. దీని ప్రత్యేకతలేమిటి? శివాపురానికి కాలిబాట తప్ప మరో దారిలేదు. ఊళ్ళోని వీధులేవీ ఊరు దాటి వెళ్ళవు. శివాపురం పక్కనే ప్రవహించే వాగులో కవిసమయపు కమలాలు వికసించవు. ఆ నీళ్ళలో ఈదడానికి హంసలు రావు. ఊరినిండా మనుషులుంటారు. బింబాలే కాదు, ప్రతిబింబాలూ ఉంటాయి. అవికూడా తమవంతు పాత్రని ఏమారకుండా నిర్వహిస్తూంటాయి. మనం పొగొట్టుకున్నవీ, పోగొట్టుకుంటున్నవీ, పోగొట్టుకోకూడనివీ అన్నీ ఉంటాయి. ఆ కథలు వింటూ రాసిందే నా సాహిత్యం. కథలంటే గుర్తొచ్చింది, ఈ ఆధునిక కాలంలో నగరీకరణం పెరిగిపోతోంది. కథలు చెప్పడం– వినడం తగ్గిపోతోంది. ఎవరెంత నగరీకృతులైనా పుట్టుకతో వచ్చిన వారి భాష (చంపితే తప్ప) చచ్చిపోదు. జానపదులు కొత్తవారితో కలిసినప్పుడు కొత్త పదాల్ని చేర్చుకుంటూ కొత్త భాషని సృష్టించుకుంటారు. కానీ నాగరీకులు పలురకాల ఆకర్షణలతో జానపదుల్ని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ ఆకర్షణలకి లొంగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమెరికా వెళ్ళడానికే పుట్టామన్న భ్రమల్లో పడకుండా చూసుకోవాలి. ఎంతమందొచ్చినా ఇంకొంతమందికి చోటివ్వడానికి అదేమీ పుష్పక విమానం కాదు. అది కూడా మనూరిలాంటిదే. భారతీయ గ్రామాలన్నీ వాటి స్వభావాల్ని కోల్పోతున్నాయి. ముందుముందు మీవంటి జానపద సాహిత్యకారులు పుట్టే అవకాశాలు ఉండవేమో అనిపిస్తోంది. ఈనాటి గ్రామాలు అప్పట్లా లేవు. పిల్లలకి కథలు చెప్పడాన్ని పనికిమాలిన పనిగా భావిస్తున్నాం. కానీ తను విన్న కథని వేరొకరికి చెప్పేటప్పుడు పిల్లవాడు తనకి తెలియకుండా తన తెలివితేటల్ని ఉపయోగించి మనం చెప్పని విషయాల్ని కూడా జోడిస్తాడు. అదే సృజన. లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకోలేనివాడు కొత్త పరికల్పనలు చెయ్యలేడు. అవి చెయ్యలేనివాడు కొత్త విషయాల్ని కనిపెట్టలేడు. అందుకే పిల్లలకు కథలు చెప్పాలి, వాళ్ళని కథలు చెప్పనివ్వాలి. తెలుగులో బాలసాహిత్యం రానురానూ తగ్గిపోతోంది. కన్నడంలో ఎలా ఉంది? ఎక్కడి పిల్లలు అక్కడి మట్టిలో ఆడాలి, పాడాలి, అల్లరి చెయ్యాలి. ఆ మట్టి విలువ తెలిస్తే అమ్మ విలువా అమ్మ చెప్పే కథల విలువా తెలుస్తుంది. కానీ మనం వాళ్ళని పుస్తకాలు, కంప్యూటర్, టీవీలకి కట్టేస్తున్నాం. మూడూ నిర్జీవమైనవే. ఇవి పిల్లలు కోరుకున్నవి కాదు. మనం వారికి బలవంతంగా అంటగడుతున్నవి. కృత్రిమ మేధస్సు సమీకరించుకుంటున్న వాళ్ళకి మన జానపద కథలు చెబితే ‘చిలక మాట్లాడిందంటే నమ్మచ్చుగానీ కాకి మాట్లాడ్డమేంటి? కాకమ్మ కథలు చెప్పకు’ అంటూ కథలు వినే ఆసక్తిని పోగొట్టుకుంటాడు. అమ్మ కథలు విననిచోట రాసేవాళ్ళు మాత్రం ఎందుకుంటారు? అందుకే మా కన్నడ బాలసాహిత్యం పరిస్థితి మీ కంటే భిన్నంగా ఏమీ లేదు. జానపదం మీలోని సృజనశీల సాహిత్య రచనకి ఏ విధంగా దోహద పడింది? జానపదం లేకుండా నేను లేను. అది నాకు పరాయిదని అనుకోలేను. నన్ను సమష్టిగా రూపొందించి, సమష్టిలో భాగంగా చూసే కళ్ళిచ్చిందే జానపదం. ఒక బయలాట (వీధి నాటకం లాంటిది) ఉండేది. పేరు ‘అరణ్యకుమారుడి కథ’. అందులో ఒక రాక్షసుడుంటాడు. అతను రాకుమారి దగ్గరకి రాజు వేషంలో వెళ్తూంటాడు. ఆమెతో స్వర్గ సుఖాలనుభవిస్తూంటాడు. ఒకరు మరొకరి వేషంలో స్వేచ్ఛగా తిరుగుతూ యథేచ్ఛగా ప్రవర్తించే ఈ కల్పన నన్ను వెంటాడుతూ ఉండేది. ఒక విధంగా ఇది నా రచనా వ్యాసంగంలో ప్రతిఫలించి రచనల్ని రూపించిన కథ. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం క్రూరంగా ఉండేది. వాళ్ళంటే మాకు భయభక్తులు మాత్రమే ఉండేవి. కానీ, వారి జాత్యహంకారం పట్ల లోపల్లోపల ఒకవిధమైన ఆకర్షణ ఉండేది. వాళ్ళు మాత్రమే స్నానానికి సబ్బులు వాడేవాళ్ళు. వాళ్లు చూడకుండా ఆ సబ్బుల్ని స్పర్శించి ఆనందించేవాళ్ళం. అదే సమయంలో ఎక్కడో బెళగాంలో మార్చ్ ఫాస్ట్ జరుగుతుంటే ఆ బ్యాండు మోతకి ఇక్కడ మా కాళ్ళు వణికేవి. ఆ అమాయకత్వం, ఆ స్వచ్ఛత, అక్కడి భాషలోని మాధుర్యం, భావ ప్రకటనలోని సౌందర్యం, అన్నీ కలిసి నన్నూ నా రచనల్నీ రూపొందించాయి. మీరు మాట్లాడే భాషలాగే మీ సాహిత్య భాషకూడా మాండలికమే. మీరా జానపదుల భాషనే ఎందుకు ఉపయోగిస్తారు? జానపదుల భాషలో అభివ్యక్తి సామర్థ్యం ఎక్కువ. వారి మాటల్లో ధ్వని తరంగాలు నాదమయమై వెలువడతాయి. నాగరికుల భాషలో సంస్కారం ఎక్కువ. వారి మాటలు కూడా వారి ప్రవర్తనలాగే హెచ్చుతగ్గులు లేకుండా ఎలాంటి స్వారస్యం లేకుండా పత్రికా భాషలాగా ఉంటాయి. జానపదుల భాషలోనూ జీవనంలోనూ దాపరికం ఉండదు. మావైపు జానపద కళలు క్రమంగా తమ వైభవాన్ని కోల్పోయి అవసానదశకు చేరుకున్నాయి. మీవైపు పరిస్థితి? విజయనగర సామ్రాజ్య కాలంలో విజయ దశమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు మైసూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాలానికి అనుగుణమైన మార్పుల్ని తమలో ఇముడ్చుకుంటున్నాయి. కేవలం మైసూరు సంస్థానానికే పరిమితమైన ఈ ఉత్సవాలని నాడ హబ్బ(రాష్ట్రీయ పర్వదినం)గా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ఫలితంగా ఈ ఉత్సవం అన్ని ప్రాంతాలకూ విస్తరించడం, స్థానిక కళలకు ప్రోత్సాహం లభించేలా చెయ్యడం ప్రజాస్వామిక ప్రభుత్వం సాధించిన క్రియాశీల ప్రగతిగా పేర్కొనవచ్చు. జనపదాల్ని కలుషితం చేయడంలో ప్రధానపాత్ర వహిస్తున్నది ఏమిటి? జనపదాల్ని మాత్రమే కాదు, అన్నిరకాల మౌలిక విలువల్నీ కలుషితం చేస్తున్నది మన విద్యావిధానంలోని తారతమ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవాళ్ళకి ఆత్మన్యూనతాభావం, లక్షలు పోసి ప్రభుత్వేతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకి అహంకారం వద్దన్నా పెరుగుతాయి. అందుకే ఒకటి నుండి పదవ తరగతి వరకూ శిక్షణా బాధ్యతని పూర్తిగా ప్రభుత్వమే వహించాలి. బడిలో కాలు పెట్టకముందే తారతమ్యం చూపించే చదువు ఏ సమాజానికైనా ఆరోగ్యకరమైన భవిష్యత్తునెలా ఇవ్వగలదు? కన్నడంలో జాతీయ బహుమతి పొందిన మొదటి చలనచిత్రగీతం మీ ‘కాడుకుదురె ఓడి బందిత్తా’ కూడా జానపదమే. కన్నడ చలన చిత్ర రచయితగా, సంగీతజ్ఞుడిగా, దర్శకుడిగా చిత్రసీమ సిగలో మీరు అలంకరించిన నెమలీకలు ఎన్నో ఉన్నాయి. నేటి చలన చిత్ర పరిశ్రమ గురించి మీ అభిప్రాయం? నమ్మకం విషయంలో విన్నది లేదా చదివినదానికంటే చూసిందానికే ప్రాధాన్యత–ప్రభావం ఎక్కువ. ఈ నమ్మకాన్ని దృశ్య మాధ్యమాలకు చెందిన ఇరవై నాలుగు కళాసాంకేతిక వర్గాలూ కలిసి శక్తివంచన లేకుండా వమ్ము చేస్తున్నాయి. వెండితెర, బుల్లితెర జీవితానికి అద్దం పట్టాలి. వాటిలో జనం తమని తాము చూసుకోవాలి. అద్దంలో అందం, వికారం రెండూ కనిపిస్తాయి. కానీ భ్రమలు కనిపించవు. దురదృష్టవశాత్తూ దృశ్యమాధ్యమాలన్నీ భ్రమల్ని మాత్రమే చూపిస్తూండటం వల్ల ప్రస్తుత పరిస్థితి ఎదురైంది. మిమ్మల్ని వెంటాడిన రచయితలెవరు? కన్నడంలో అల్లమ ప్రభు. ఇంగ్లీష్‌లో డబ్ల్యూ.బి.ఈట్స్. మీరు రాసినవాటిలో మీకు బాగా నచ్చిన రచన ఏది? రచయితకి తను రాసినవాటిల్లో ఏదైనా ఒక రచన అన్ని విధాలా నచ్చిందీ అంటే తనింక రాయడు. ఏ రచనైనా పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇచ్చిందీ అంటే అతని దగ్గర రాయడానికి ఏమీ మిగలదు. నా రచనల్లో ఏదీ నన్ను సంతుష్టుడిని చెయ్యలేదు. అందుకే నేను రాస్తూనే ఉన్నాను. రాయకపోతే నేనుండను. -
మహా జన సంరంభం
ప్రవహించినంతమేరా పచ్చటి ప్రకృతిని మాత్రమే కాదు... జనపదాలనూ, సంస్కృతీ సంప్రదాయాలనూ పెంపొందింపజేసే నదులకు మనిషి జీవితంలో విశిష్ట స్థానం ఉంది. అవి మనిషి దాహార్తినీ, క్షుదార్తినీ తీర్చడంతోనే ఆగిపోలేదు. సంస్కారాన్నిచ్చాయి. సహజీవనాన్ని నేర్పాయి. విజ్ఞానతృష్ణను రగిల్చి ఉన్నత స్థానానికి చేర్చాయి. నదులను అమ్మలా సంభావించుకుని ప్రణమిల్లడం, పూజాదికాల్లో నదులరీత్యా ఉనికిని చెప్పుకోవడం అందుకే. ప్రాణికోటి మనుగడకు ఆధారమైన పంచభూతాల్లో నీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ‘పరోపకారాయ ఫలంతి వృక్షాః/ పరోపకారాయ వహంతి నద్యాః’ అనే సూక్తి నదులకుండే ప్రవాహ గుణంలోని పరోపకారత ను పట్టిచూపుతుంది. మనిషికీ, నదీమతల్లికీ గల అనుబంధాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక సందర్భమయ్యే గోదావరి పుష్కరాలు మంగళవారం ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మొదలవుతున్నాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే క్షణాలను గణనలోకి తీసుకుని తెలంగాణలో ఉదయం 6.21 గంటలకూ...ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6.26కూ ఈ పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. పన్నెండేళ్లకొకసారి వచ్చే ఈ పుష్కరాలు జన, జల రాశుల మహా సంగమం. మహా సంరంభం. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్లమంది, తెలంగాణలో 3 కోట్లమంది పుష్కరాల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి జరిగేవి 144 ఏళ్లకొకసారి వచ్చే మహా పుష్కరాలని కొందరు పండితులు చెబుతున్నారు. అందుకే వీటి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ పుష్కర సమయంలో గోదావరీ తీరాన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలూ, సప్త రుషులూ, పితృ దేవతలూ నడయాడతారని ప్రతీతి. అందుకే ఈ పన్నెండు రోజులూ గోదావరి నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. పితృకర్మలు సాగుతాయి. దక్షిణాన అతి పెద్ద నదిగా...దేశంలో గంగానది తర్వాత రెండో పెద్ద నదిగా ప్రఖ్యాతి చెందిన గోదావరి... మహారాష్ట్రలోని నాసిక్ సమీపాన సహ్యాద్రి కొండల్లో పుట్టి మొత్తంగా 1,465 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంతకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 927 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఒకచోట పర్వత శిఖరాలనుంచి దుమికినా, మరోచోట కొండల్ని ఒరుసుకుంటూ, సుడులు తిరుగుతూ అన్నిటినీ చుట్టబెడుతూ, మహావృక్షాలను సైతం కూకటివేళ్లతో పెకిలిస్తూ ప్రళయ భీకర రూపం చూపినా...వేరొకచోట ప్రశాంత గంభీర వదనంతో ప్రవహించినా, చివరిగా సముద్రంలో సంగమించేందుకు ఉత్తుంగ తరంగాలతో ఉరకలెత్తుతూ వెళ్లినా గోదావరి తీరే వేరు. అది మానవ జీవితంలోని సకల పార్శ్వాలనూ గుర్తుకు తెస్తుంది. ఈ పుష్కరాల పనుల కోసం రెండు రాష్ట్రాలూ భారీగానే ఖర్చు చేశాయి. పుష్కరాలకొచ్చే భక్తులకు స్నాన ఘట్టాలు మొదలుకొని వసతి సౌకర్యాలవరకూ వివిధ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రోజుకు దాదాపు 25 లక్షలమంది పుష్కర స్నానం చేస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 264 స్నానఘట్టాలను ఏర్పాటుచేశారు. ఇంత భారీయెత్తున ఏర్పాట్లు చేసి కోట్లాది రూపాయలు వ్యయం చేసిన రెండు ప్రభుత్వాలూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికొచ్చేసరికి ముఖం చాటేశాయి. మరికొన్ని గంటల్లో పుష్కరాలు ప్రారంభం కాబోతున్నా పట్టనట్టు కూర్చున్నాయి. ఫలితంగా పారిశుద్ధ్యం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అన్నిచోట్లా చెత్తాచెదారం పేరుకుపోయి, డ్రైనేజిలన్నీ పొంగిపొర్లి దుర్గంధం నిండింది. చినుకు పడిందే తడవుగా భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలే స్థితి నెలకొంది. తెలంగాణలో సమ్మె మొదలై 8 రోజులు గడుస్తుంటే...ఏపీలో మూడు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికులు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. చాలీచాలని వేతనాలను సరిదిద్దాలంటున్నారు. తమ బతుకుల్ని కాస్తయినా బాగుచేయమంటున్నారు. మిగిలినవారంతా సమీపానికి రావడానికి కూడా హడలెత్తే చెత్తలో నిత్యం మునిగితేలుతూ వీధులను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో కార్మికులు చేస్తున్న కృషి నిజానికి వెలకట్టలేనిది. అలాంటివారి జీవితాలను కాంట్రాక్టు ఉద్యోగాల్లో పాతేసి, అభద్రతలోకి నెట్టడం అన్యాయమని, అమానుషమని పాలకులు ఎందుకు అనిపించడంలేదో ఆశ్చర్యం కలుగుతుంది. ఈఎస్ఐ సొమ్మును కాంట్రాక్టర్లు, అధికారుల పాలై వైద్య సేవలు లభించని స్థితి ఏర్పడినా కార్మికుల గోడు పట్టించుకునే నాథుడు లేడు. చట్టసభలకు ఒకసారి ఎన్నికైతేనే పెన్షన్తోసహా అనేక సౌకర్యాలు పొందేవారు... పౌరులందరికీ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంలో రాత్రింబగళ్లు శ్రమించేవారిని చిన్నచూపు చూడటం వింతగొలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికే పొరుగునున్న తమిళనాడునుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించింది. తెలంగాణ సర్కారు సైతం ఆ తోవనే పోదల్చుకున్నట్టు కనబడుతోంది. అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పగించి వారికి చేతినిండా పని కల్పించవచ్చు గనుక... కోట్లాది రూపాయలు వెనకేసుకోవచ్చు గనుక పుష్కర పనులంటూ హడావుడి చేస్తారు. వాస్తవానికి స్నాన ఘట్టాలవంటివి శాశ్వత ప్రాతిపదికన ఉండాల్సినవి. అందుకోసం పటిష్టంగా నిర్మాణం చేయాల్సినవి. కానీ పనులు నాసిరకంగా ఉండటంవల్ల వచ్చే పుష్కరాల వరకూ ఉండటం మాట అటుంచి కొన్ని నెలలకే నామరూపాల్లేకుండా పోతున్నాయి. కనుకనే ప్రతిసారీ వాటి కోసం కోట్లు ఖర్చుచేయాల్సివస్తున్నది. రోడ్ల సంగతి చెప్పనవసరమే లేదు. ఖర్చుచేశామన్న సొమ్ముతో పోల్చిచూస్తే జరిగిన పనులు సరిగా లేవన్నది అర్థమవుతుంది. భక్తినీ, చిత్తశుద్ధినీ, సత్సంకల్పాన్నీ పెంపొందింపజేసే ఈ పుష్కరాలు పాలకులకు సద్బుద్ధిని కలిగిస్తే మున్సిపల్ కార్మికులకూ, పౌరులకూ మేలు కలుగుతుంది.