క్యాన్సర్‌పై పోరు ఓ యుద్ధతంత్రం | Awareness About Cancer On World Cancer Day In Sakshi | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌పై పోరు ఓ యుద్ధతంత్రం

Published Tue, Feb 4 2020 12:12 AM | Last Updated on Wed, Feb 5 2020 11:25 PM

Awareness About Cancer On World Cancer Day In Sakshi

యుద్ధాన్ని గెలవాలంటే యుద్ధతంత్రాన్ని అనుసరించాలి. క్యాన్సర్‌పై పోరాటం కూడా  యుద్ధమే. దానికీ ఓ తంత్రం కావాలి. స్టెమ్‌సెల్‌ థెరపీ, లైట్‌తో ఇచ్చే ఫోటో డైనమిక్‌ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలతో చేసే చికిత్సలు, మెట్రానమిక్స్‌ లాంటి కొత్త కొత్త ప్రక్రియలెన్నో ఉన్నా... మనందరికీ తెలిసినవి కీమో, రేడియేషన్, శస్త్రచికిత్స, టార్గెట్‌ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటివి. ఈ ఐదింటిలోనూ దీన్నెప్పుడు, ఎలా, ఏ మోతాదులో వాడాలన్నదే ‘చికిత్సాయుద్ధ(పంచ)తంత్ర’మనుకోవచ్చు. ఇక చిన్నప్పుడు పంచతంత్ర కథలను మనందరం చదివాం కదా. రాజుగారి కొడుకులకు తేలిగ్గా లోకరీతులపై అవగాహన కలిగించడం కోసం విష్ణుశర్మ రాసిందే పంచతంత్రం. క్యాన్సర్‌పై యుద్ధతంత్రాలను మనం కూడా అంతే తేలిగ్గా అచ్చం పంచతంత్ర కథల్లాగే  సులువుగా, తేలిగ్గా తెలుసుకుందాం. అవే క్యాన్సర్‌–మిత్రలాభం, క్యాన్సర్‌–మిత్రభేదం, క్యాన్సర్‌– సంధి, విగ్రహానికి బదులుగా నిగ్రహం కథలు. ఇక చదవండి. అవగాహన పెంచుకోండి.

క్యాన్సర్‌ – మిత్రలాభం 
లేడిని తినే ఉద్దేశంతో ఓ నక్క దాంతో స్నేహం చేసింది. ఓనాడు లేడి దగ్గరికి వెళ్లి ‘‘దగ్గర్లోని ఓ రైతు పొలంలో రుచికరమైన పచ్చగడ్డి ఉంది. తిందువుగానీ రా’’ అంది. ముందుగా లేడి కాస్త సందేహించినా పచ్చగడ్డి మీద ఆశతో వెళ్లి, అక్కడ రైతు పన్నిన వలలో చిక్కుకుంది. రైతు వచ్చి లేడిని చంపి పారేస్తాడనీ... అప్పుడు దాని మాంసం తాను తినొచ్చని నక్క వేచిచూస్తోంది. తన మిత్రుడైన లేడి కనిపించడం లేదని వెతుకుతూ దాని స్నేహితుడైన కాకి అక్కడికి వచ్చి, పరిస్థితి గ్రహించింది. ‘నువ్వు చచ్చిపడినట్టు నటించు. రైతును నమ్మించడానికి నేను నా ముక్కుతో నిన్ను పొడుస్తున్నట్టు నటిస్తాను. రైతు వల తొలగించగానే పారిపో’ అని ఉపాయం చెప్పింది. ఆ ప్రకారం... లేడి తప్పించుకుంది.

ఇప్పుడు మనం ఓ క్యాన్సర్‌ కథ చెప్పుకుందాం. అది కూడా అచ్చం పై కథలాగే ఉంటుంది. ఓ చిన్నారికి బ్లడ్‌క్యాన్సర్‌ సోకింది. అంటే... పాత తెల్లరక్తకణాలు పూర్తిగా చనిపోకముందే కొత్తవి పుట్టుకొస్తూ... రక్తం తన పని తాను చేయకుండా అడ్డుపడటమే ఈ బ్లడ్‌ క్యాన్సర్‌. ఇలా క్రమపద్ధతిలో కాకుండా తెల్లరక్తకణాలు అదేపనిగా పుట్టడానికి కారణం టైరోసిన్‌ కైనేజ్‌ అనే ఓ రసాయనం. అదిలా అడ్డదిడ్డంగా, అదేపనిగా రక్తంలోని తెల్లరక్తకణాలు పుట్టడానికి దోహదపడుతుంది. ఏదైనా ఉపాయంతో ఆ టైరోసిస్‌ కైనేజ్‌ను ఆపేస్తే? అప్పుడు తెల్లరక్తకణాలు పుట్టడమూ ఆగిపోతుంది. దాంతో రోగి ఎప్పటిలాగే ఆరోగ్యంగా, మామూలుగా ఉంటాడు.

మన ఈ కథలో రోగి ... ఓ లేడిలాంటి చిన్నారి. టైరోసిస్‌ కైనేజ్‌ నక్క. తెల్లరక్తకణాలు పుట్టేలా చేసే అంశం రైతు. టార్గెట్‌ థెరపీలో ఇచ్చే ‘ఇమాటనిబ్‌’ లాంటి కొన్ని మందులు కాకిలాంటివి. ఇప్పుడు ఇమాటనిబ్‌ లాంటి ఆ మందులు లేడిలాంటి చిన్నారిలోకి ప్రవేశించి, టైరోసిస్‌ కైనేజ్‌ నక్కను, ఆ మాటకొస్తే రైతునూ కన్‌ఫ్యూజ్‌ చేస్తాయి. దాంతో ఇష్టమొచ్చిన రీతిలో, ఓ క్రమపద్ధతి లేకుండా తెల్లరక్తకణాలను పుట్టించే ప్రక్రియ ఆగుతుంది. దాంతో చిన్నారి లేడికి లేచిందే పరుగులా పరుగెడుతూ మునపటిలాగే ఆరోగ్యంగా ఉంటుంది.

మరో కథ చూద్దామా!

ఒక చోట ధాన్యపు గింజలు చెల్లాచెదురుగా ఉండటం కొన్ని పావురాలు చూశాయి. అక్కడ పరచి ఉన్న వలను చూడకుండా చిక్కుకుపోయాయి. అవన్నీ ఓ ఉపాయం ఆలోచించాయి. సమష్టిగా ఎగిరిపోయి... ఓ ఎలుక సహాయంతో తమ వలను ఛేదించుకున్నాయి. అంటే... ఇక్కడ పనికి వచ్చింది పావురాలూ–ఎలుకల మిత్రత్వం. అలాగే క్యాన్సర్‌ను ఎదుర్కోవాలంటే కొన్నింటితో స్నేహం చేయాలి. ముందుగా మనం స్నేహం చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి అలవాట్లతో. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే కూరగాయలూ, తాజాపండ్ల వంటివి తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేస్తే... అవి రోగమనే వలను ఎలకల్లా కొరికేస్తాయి. అటు తర్వాత ముందుగానే క్యాన్సర్‌ను తెలుసుకునే కొన్ని వైద్యపరీక్షలతోనూ మిత్రత్వం వహించాలి. మరో ముఖ్యమైన అంశమైన కుటుంబసభ్యుల తోడ్పాటూ, ఇంకో అంశమైన డాక్టర్‌ సహాయంతో క్రమం తప్పకుండా తీసుకునే చికిత్స ప్రక్రియలూ... వీటన్నింటి సహాయంతో రోగి ధైర్యం చిక్కబట్టుకుని పావురాల్లా ఎగిరితే... మందులూ, రేడియేషన్, సర్జరీ వంటి ప్రక్రియలు మూషిక మిత్రుల్లా జబ్బును కొరికి పేషెంట్‌ను రోగవిముక్తం చేస్తాయి.

అలాగే రోగి మరికొన్ని చికిత్స ప్రక్రియలతోనూ క్రమం తప్పకుండా స్నేహం చేయాలి. అవే...  ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్, బయాప్సీ వంటి పరీక్షలు. కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు ఈ పరీక్షలతో వ్యాధిని అనుమానించాక... మరికొన్ని నిర్ధారణ పరీక్షలనూ చేయించాలి. అవే... నిర్దిష్టమైన కొన్ని రక్తపరీక్షలు, మల, మూత్రపరీక్షలు, సీటీ స్కాన్, పెట్‌ స్కాన్, ఎమ్మారై వంటివి చేస్తారు. సీటీస్కాన్, ఎమ్మారై పరీక్షలు కణితి ఉన్న ప్రదేశాన్ని, దాని పరిమాణాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగపడే పరీక్షలు. ఇలాంటి పరీక్షలతో క్యాన్సర్‌ రోగి ఎప్పుడూ స్నేహం వహించి ఉండి, క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉంటే... వ్యాధి తగ్గాక కూడా తిరగబెట్టకుండా చూసుకుంటూ జీవితాంతం హాయిగా, అసలు ఒకప్పుడు వ్యాధి వచ్చిన దాఖలా కూడా లేకుండా పూర్తిగా నార్మల్‌ వ్యక్తిలాగే ఉండవచ్చు.

క్యాన్సర్‌ – మిత్రభేదం 
ఓ దేశంలో శ్వేతకాష్టుడూ... మద్యముడూ అనే ఇద్దరు ఫ్రెండ్స్‌ ఉంటారు. శ్వేతకాష్టుడు పైకి తెల్లగా, అందంగా ఉంటాడు. నెత్తిచివర కాష్టంలా మండుతూ ఉంటాడు. ఇలా తెల్లగానూ, మండుతూనే ఉండటం వల్ల వాడికి శ్వేతకాష్టుడు అలియాస్‌ సిగరెట్టుడు అనే పేరూ ఉంది. వీడికీ ఫ్రెండ్స్‌  చాలామందే ఉంటారు. చుట్టా, బీడీ, జర్దా, ఖైనీ, గుట్కా, ముక్కుపొడి వీళ్లంతా శ్వేతకాష్టుడి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఇక మద్యముడు కూడా బంగారు రంగున్న పానీయరూపంలోనే గాక రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాడు.

ఈ ఇద్దరు మిత్రులంతా దేశంలోని ప్రజల దగ్గరికిపోయి... ‘మిత్రులారా... మీరు స్ట్రెస్సాసురుడూ, టెన్షనుడు అనే రాక్షసుల బారిన పడి నలిగిపోతున్నారు. మమ్మల్ని ఆశ్రయించి... మీరు వారి నుంచి దూరం కావచ్చ’ని చెబుతుంటారు. అలా సదరు స్ట్రెస్సాసురుడూ, టెన్షనుల పీడవిరగడ చేస్తామంటూ...వీళ్లంతా ఆ దేశ అమాయక ప్రజల్ని క్యాన్సరాసురుడికి ఆహారంగా పంపుతుంటారు. అందుకే స్ట్రెస్సాసుర, టెన్షనులను వదిలించుకోవడం కోసం ఈ శ్వేతకాష్టుడు, మద్యములనే ఈ చెడుమిత్రుల స్నేహం నుంచి రక్షించుకోవాలి. ఇందుకోసం మనం రిలాక్సేషన్‌ ప్రక్రియలూ, యోగా వంటి మంచి మిత్రుల సహాయంతో మిత్రుల రూపంలోని ఆ శత్రువులకు దూరంగా ఉండాలని చెప్పే కథే... క్యాన్సర్‌–మిత్రభేదం చెప్పే మాట.

విగ్రహానికి బదులు నిగ్రహం... 
పంచతంత్రంలోని విగ్రహానికి బదులు మనం ‘నిగ్రహం’ అనే మరో అంశాన్ని తెలుసుకుందాం. మనం కొన్ని అంశాల పట్ల నిగ్రహం పాటించాలి. ఉదాహరణకు పిజ్జాలు, బర్గర్‌లలాంటి బేకరీ ఐటమ్స్‌. ఇవన్నీ చాలా త్వరత్వరగా, రుచిగా తమను  తినేయవచ్చంటూ మనల్ని ఊరిస్తుంటాయి. మరికొన్ని ఆహారాల్లోని కలరేటివ్స్‌ అనే ఆకర్షణీయమైన, అందమైన రంగులు మన కంటిని కట్టిపడేస్తుంటాయి. అప్పటికప్పుడు టెంప్ట్‌ అయి తినేసేలా మనల్ని ఆకర్షిస్తుంటాయి. ఇంకొన్ని ఆహారాలైతే రుచికరంగా ఉండేందుకూ, చాలాకాలం పాటు నిల్వ ఉండేందుకు కృత్రిమ నెయ్యి, ప్రిజర్వేటివ్స్‌ రూపంలో రారమ్మని పిలుస్తుంటాయి. అందుకే వాటి నుంచి నిగ్రహం పాటించాలి. మన ఈ  పంచతంత్రలోని ‘నిగ్రహం’ శీర్షికలో మనం తెలుసుకోవాల్సిన అంశాలివి.

ఇలా ఈ తంత్రాలన్నింటి మనల్ని క్యాన్సర్‌ను దూరంగా ఉంచుతాయి. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలూ పాటించినా, క్రమం తప్పకుండా క్యాన్సర్‌ను నివారించే మిత్రులకు దగ్గరగా ఉండి, క్యాన్సర్‌ కలిగించే వాటిని దూరంగా ఉండి, క్యాన్సర్‌ వ్యాక్సిన్ల సహాయంతో సంధి చేసుకుని, నిగ్రహం గా క్యాన్సర్‌ను కలగజేసే ఎన్నింటినుంచో దూరంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి క్యాన్సర్‌ రావచ్చు. దురదృష్టవశాత్తూ అలా ఎవరికైనా వ్యాధి వచ్చినా... ఆందోళన పడకుండా మానసిక సై్థర్యం, ధైర్యం కలిగి, చికిత్స చేయించుకుని నిండునూరేళ్లూ జీవించడానికి తోడ్పడే తారకమంత్రాలే పైన చెప్పిన పంచతంత్రాల్లాంటి క్యాన్సర్‌ యుద్ధతంత్రాలు.

క్యాన్సర్‌ – సంధి

ఇక్కడ మన ‘క్యాన్సర్‌ సంధి’ గురించి కాస్త నేరుగానే తెలుసుకుందాం. కొన్ని క్యాన్సర్లలో అవి  వచ్చాక పోరాటం చేయడం కంటే... అవి రాకముందే మనలోని కణాలను కొన్ని రకాల వ్యాక్సిన్లతో సంధి చేసుకునేలా చూడాలి. ఉదాహరణకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌)కు కారణం మనకు కచ్చితంగా తెలుసు. అది హెచ్‌పీవీ అనే వైరస్‌తో వస్తుంది. అది రాకుండా అమ్మాయిలకు ఓ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. అమ్మాయిలందరూ ఆ వ్యాక్సిన్‌తో సంధి చేసుకోవాలి.

అదెలాగంటే... తొమ్మిదేళ్ల వయసు నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందు) ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే ఈ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సిన్‌ అండాశయం, గొంతుక్యాన్సర్లు రాకుండా కూడా చేసే అవకాశముందనీ, 40 ఏళ్లు వచ్చే వరకు మహిళలు ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని డాక్టర్స్‌ సలహా ఇస్తుంటారు. అలాగే హెపటైటిస్‌–బి వస్తే... అది భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

హెపటైటిస్‌–బి వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వేయించుకోవడం ద్వారా కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. ఇలా మనం సర్విక్స్, కాలేయ క్యాన్సర్‌లను నివారించడానికి హెచ్‌పీవీ వ్యాక్సిన్, హెపటైటిస్‌ వ్యాక్సిన్‌లతో సంధి చేసుకోవడం ద్వారా... ఆ క్యాన్సర్లను నివారించుకోవచ్చు. ఇలాగే మనం సంధి చేసుకోవడం కోసం మరిన్ని వ్యాక్సిన్లను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా మన విజ్ఞానవేత్తలూ, వైద్యశాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement