‘‘సంపద సృష్టి జాతీయసేవ. కనుక సంపద సృష్టికర్తలను అనుమానంతో చూడకూడదు. సంపద సృష్టి అయితేనే కదా దాన్ని పంపిణీ చేయగలం. దేశంలో సంపద సృష్టికర్తలు సంపన్నులే, కాబట్టి వారిని మనం గౌరవించాలి’’.
– ప్రధాని నరేంద్రమోదీ,స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
‘‘అమెరికాలో సంపన్నులపై పన్ను రాయితీల ఫలితంగా నేను నా ప్రైవేట్ కార్యదర్శి కన్నా తక్కువ పన్ను చెల్లిస్తుంటాను’’.
– వారెన్ బఫెట్, అగ్రగామి అమెరికన్ బిలియనీర్
ఏ దేశ నాయకుడైనా, ప్రధానమంత్రి అయినా జీవితంలో ఎన్ని దేశాలు తన పదవీకాలం ముగిసేలోపు తిరిగి వచ్చాడన్నది ప్రధానం కాదు. తిరిగి తిరిగి ఏం సాధించాడన్నదే చివరికి గణనలోకి వస్తుంది. ప్రజాస్వామ్యం ముసుగులో దేశీయ వ్యవస్థల్ని ఆచరణలో ఎలా భ్రష్టుపట్టించి నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కూల్చుతూ వస్తున్నారన్నది గమనించాల్సిన అవసరం ఎప్పటికంటే నేడు ఎక్కువగా ఉంది. అమెరికాలోని ప్రవాస భారతీయులు ఎక్కువగా కేంద్రీకరించి ఉన్న టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో జరిగే మోదీ సభకు, ప్రెసిడెంట్ ట్రంప్ హాజరు కావడం వేరు. అలాంటి సభకు మోదీ మూడవసారి అమెరికా పర్యటన పేరిట హాజ రవడం వేరు. నిన్న మొన్నటిదాకా అమెరికా చదువుకోసం, ఉన్నత విద్యావకాశాల కోసం ఎగబాగుతున్న మన పిల్లల అవసరాల్ని తుంచే ప్రక్రియలో భాగంగా హెచ్– 1బి వీసాలకు మధ్యమధ్యలో ట్రంప్ బ్రేక్ వేస్తూ రావడం మనకు తెలిసిందే. అమెరికా పాలకుల ఆంక్షలపై తన తీవ్ర నిరసనను బాహాటంగా మోదీ ప్రకటించిన ఉదాహరణ లేదు. పైగా మొదటిసారిగా, అమెరికా పర్యటించినప్పుడు ఇండి యాను కొల్లగొట్టిపోయిన వాస్కోడిగామాలాగా అమెరికా గుత్త పెట్టు బడిదారులంతా వాస్కోడిగామాలై తరలిరండి అని ఆహ్వానించిన సంగతీ మరవరాదు. ఆ పెట్టుబడులతో ఇండియాలో సరుకులు ఉత్పత్తి చేసి పెట్టమని (మేక్ ఇన్ ఇండియా) మోదీ కోరినా ఆశించిన లాభాలు లేనిదీ వ్యాపారి వరదన పోడన్న సామెతను అమెరికా గుత్తే దారులు రుజువు చేశారు.
మరో వైపున అక్కడ అమెరికా యువతలో పెరిగిపోతున్న నిరుద్యోగ తీవ్రతకు పరిష్కారంగా అటు డెమోక్రాట్ నాయకుడు ఒబామా అయినా ఇటు రిపబ్లికన్ ట్రంప్ అయినా చేస్తున్న పని అమెరికన్ ఓటర్లకు బుజ్జగింపు ఎత్తుగ డగా హెచ్–1 బి వీసాలను క్రమంగా నిరోధిస్తున్నామని ఎర చూపుతున్నారు. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను గత అయిదేళ్లలో లేని తీవ్ర సంక్షోభానికి గురిచేస్తూ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం మరింతగా దిగజార్చుతూ అర్ధంతరంగా, అనాలోచితంగా, ఆకస్మికంగా చెలామ ణిలో ఉన్న పెద్దనోట్లను రద్దుచేసి, మరింత తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. దాని దుష్ఫ లితాలను చిన్న పారిశ్రామికులు, పేద, మధ్య తరగతి ప్రజలు, పేద రైతు, కార్మిక ప్రజా బాహుళ్యం కిక్కురుమన కుండా అనుభవించాల్సి వచ్చింది. దీని ఫలితంగా బ్యాంకులు, ఏటీఎంలు మూతపడితే వాటి వద్ద పడిగాపులు పడిన సందర్భంగా 125 మంది బ్యాంక్ ఖాతాదార్లు సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోతే 125 కోట్లమంది భారత ప్రజలు తనకు అండగా నిలిచారని మోదీ ప్రగ ల్భించారు. దేశ ప్రజలు తమ ప్రయోజనాల కోసం నిర్మించుకున్న అగ్ర శ్రేణి రిజర్వు బ్యాంకు నిర్వహణపై బీజేపీ–ఆరెస్సెస్ నిరంకుశ అజమాయిషీ కాస్తా బెడిసి కొట్టింది. రాజ్యాంగం నిర్దేశించిన బాధ్య తల అధ్యాయాన్ని పక్కకునెట్టి పాలకులు వ్యవహరిస్తూ వచ్చారు.
చీలుబాటల రాజకీయం ఆధారంగా పార్లమెంటరీ సంప్రదాయా లను, అందులో అంతర్భాగమైన పార్లమెంటరీ కమిటీలను నిర్వీర్య పరిచారు. కశ్మీర్‌లో ‘370’వ నిబంధన రద్దుతోపాటు, కొన్ని ఈశాన్య భారత రాష్ట్రాలలో భారతదేశ పౌరులనే నువ్వెవరో, నీ పౌరసత్వాన్ని నిరూపించుకోమని ప్రశ్నించే దశకు పాలకులు దిగజారి పోయారు. వీటన్నింటి పర్యవసానంగా–ముగ్గురు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్లు, మరి ముగ్గురు ‘నీతి ఆయోగ్’ (ప్రణాళికా సంఘాన్ని చంపి) ఉన్న తాధికారులూ గత అయిదేళ్లలోనూ తప్పుకోవలసి వచ్చింది. ఈ ‘ఈగల మోత’కు తాళ లేక మరోమారు నాయకుడు విదేశంలో ‘పల్లకీ మోత’ను ఆశ్రయించవలసి వచ్చింది. మళ్లీ అవే పెట్టుబడుల కోసం అభ్యర్థన. మన నాయకుడికి హ్యూస్టన్‌లో అభి నందన సూచకంగా ‘హలో’ (హౌడీ: ‘హలో’ అనీ, ఆహ్వానమనీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తాజా నిఘంటువు అర్థం) చెప్పడం మనం హర్షించదగినదే. కానీ ‘హలో’ చెప్పేవారికి, ఉపాధి కోసం ఉద్యోగార్థులై అక్కడే ఉండిపోయి స్వదేశం వైపు తిరిగి చూడని వారికి, స్థిరాస్తులు, చరాస్తులు రెండు చేతులా సంపాదించి స్థిరపడిన వారికి మన దేశంలో ప్రజా బాహుళ్యం, ఆర్థిక వ్యవస్థ అనుభవిస్తున్న సంక్షోభ పరిణామాలపై కన్నెత్తి చూసే తీరిక ఉండదు కాబోలు పాపం. స్వయంగా అమెరికాలోని గూగుల్, స్టార్ బక్స్ లాంటి అత్యంత గుత్తేదారుల కంపెనీలు అమెరికా విడిచి ఐర్లాండ్ దేశంలో ఎందుకు స్థిరపడా లనుకుంటున్నాయో ఆలోచించాలి. పాపం, ఈ ‘పేద’ కంపెనీలకు అమెరికాలో ఇచ్చే పన్ను రాయితీలు చాలడం లేదట. అందుకని తక్కువ పన్నురేట్లు ఉన్న ఐర్లాండ్‌కు తరలుతున్నాయట. దీన్నే అమెరికన్లు ‘లాభాల పునాదులు చెక్కు చెదరని ఏర్పాటు’ (బేస్ ఎరోషన్ ప్రాఫిట్ షిఫ్టింగ్) అంటారు. అంటే మోదీ, వారెన్ బఫెట్ సంరక్షించగోరుతున్న పెక్కుమంది ‘సంపద సృష్టిక ర్తలు’ తమ లాభాల గురించే ఎక్కువ ఆలోచిస్తారు గానీ, తమ జాతీ (దేశ) ప్రజా సంక్షేమాన్ని గురించి అంతగా ఆలోచించరని సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలయిన కేంద్రీయ సామాజిక శాస్త్రాల అధ్యయన సంస్థ, ఢిల్లీ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్స్ మాల్కోమ్ ఆదిశేషయ, ఆస్తా అహుజా తేల్చి చెప్పారు.
బహుశా అందుకనే మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ మహాసభకు హాజరైనా, దేశంలో ఇన్ని రకాలుగా ఆర్థిక రంగంలో జరుగుతున్న అవకతవకల్ని, అవినీతిని, మోసాల్ని ఇంతకు ముందెన్నడూ ఆర్థిక వ్యవస్థ చూడలేదనీ, గుణ పాఠం నేర్వలేదనీ వాపోవాల్సి వచ్చింది. అంతేగాదు, బీజేపీ పాలనలో తొలి అయి దేళ్లలో ప్రజల చేతుల్లో డబ్బు చెలామణి కాక పోవడంవల్ల ఏర్పడిన సంక్షోభాన్ని గత 70 ఏళ్లలో దేశం ఎదుర్కొని ఎరగదని మోదీ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘నీతి ఆయోగ్’ విధాన నిర్ణయ సంస్థ అధిపతి రాజీవ్ కుమార్ విమర్శించాల్సి వచ్చిందని మరవ రాదు. హిందూత్వ రాజకీయం మినహా చరిత్ర, సామాజిక శాస్త్రాల అధ్యయనం నుంచి బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు దూరమైనందుననే దేశానికి ఈ దుస్థితి దాపురించిందని భావించడం అతిశయోక్తి కాజాలదు. ఇదే నిజం కాక పోతే, దేశ ఆర్థిక సమస్యలకు పరిష్కారం బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస పాలకులతో సుదీర్ఘకాలంపాటు దేశ స్వాతంత్య్ర సాధన కోసం జరిపిన పోరాటాల ద్వారా, ప్రజల అసంఖ్యాక త్యాగాల ద్వారా గడిం చిన అనుభవం నుంచి తొలి దీపశిఖ దాదాభాయ్ నౌరోజీ ప్రబో ధించిన ‘డ్రెయిన్ థియరీ’ (పరాయి పాలకులు దేశం నుంచి ఊడ్చు కుపోయిన దేశీయ సంపద) చాలు– బుద్ధిగల పాలకులు స్వతంత్ర ఆర్థిక వ్యవస్థను నిర్మించుకునే సత్తా పొందడానికి. దేశ పౌరులు తాము ఈ దేశం వారమేనని నిరూపించు కోవాల్సిన దారుణ వ్యవ స్థను, సుప్రీంకోర్టును సహితం ధిక్కరించి పాలకులు రుద్దే స్థితికి దేశాన్ని దిగజార్చుతున్నారు.
ఎప్పుడైతే ప్రధాని మోదీ.. సంపద స్వయంకర్తలు బడా సంపన్న వర్గాలని తాజాగా ప్రకటించి, జాతీయ జీవనంలో వివిధ రంగాలలోని రెక్కాడితేగానీ డొక్కాడని శ్రమజీ వుల్ని, ఇతర ఉద్యోగ, సద్యోగ కష్ట జీవుల సమష్టి శ్రమను కించ పరచడం పాలకుల నైజంగా మారిందో– ఆనాడే సామాజిక ఆర్థిక రంగాలలో దోపిడీ వ్యవస్థలకు పునాది ఏర్పడి బలపడుతూ వచ్చింది. బహుశా అందుకనే అమెరికాలో తిరిగి సోషలిజంవైపు యువత మొగ్గుచూపే ధోరణి కనపడుతోందని ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తుకోవడానికి గల కారణాల్ని ప్రసిద్ధ సామాజిక విశ్లేషకుడు పాల్ స్ట్రీట్ (అమెరికా) ఇలా విశ్లేషించాడు: ‘‘అమెరికా, అమలులో ఉన్న ప్రజాస్వామ్యమని మీరనుకుంటారు, కానీ అది కాదు. ఆ మాటకొస్తే మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యమే కాదు. మరెందులో? ఆరోగ్య బీమాలోనా? కాదు, మానసిక ఆరోగ్య భాగ్య విధానంలోనా? కాదు, కార్మిక సంఘాల సంఘటిత హక్కులలోనా? కాదు, పోనీ క్రిమినల్ న్యాయ వ్యవస్థలోనా? కాదు, దేశ సంపద, ఆదాయ వనరుల పరి రక్షణలోనా? కాదు, నిజం చెప్పాలంటే– జన జీవితానికి చెందిన, వారి నిజమైన ప్రయోజనా లను రక్షించగలది కాదు అమెరికా ప్రజా స్వామ్యం (అమెరికన్ ఇన్‌ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్ సౌజన్యంతో). ఇదేదో ఉగ్రవాదుల మేనిఫెస్టో అనుకునే ప్రమాదం ఉంది మరి.
అమెరికాలో మెజారిటీ ప్రజలు యువతకు ఉద్యోగాల కల్పనను, వేతనాల పెంపును, నిరుద్యోగభృతిని, సార్వత్రిక వైద్యబీమాను కోరుకుంటు న్నారు. ఈ మాత్రపు ఆందోళనకారుల్నే ట్రంప్ ‘సోషలిస్టులు’గా భావించి ‘అమెరికా ఎప్పటికీ సోషలిస్టు దేశం కాబోదని అమెరికా పార్లమెంట్ శపథం చేయాల’ని కోరాడు నిజానికి, 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి తెరలేపింది అమెరికా పాలకులు, దాని ఒరలో ఇరుక్కు పోయిన ఇండియా లాంటి వర్ధమాన దేశాల పాలకులు. ఆ ఒర నుంచి బయటపడగల ప్రతివ్యూహాన్ని పన్నడంలో విఫలమై, దేశ సంపద సృష్టికి పునాది సామాన్య ప్రజల శ్రమశక్తీ, కార్మిక శక్తేనని గుర్తించక, ‘సంపన్నులే సంపద సృష్టికర్తలనీ, రెండో దఫా ప్రధాని పదవి నుంచి సిద్ధాంతీకరించి దానిపైన ఓ ‘తాతాచార్యుల ముద్ర’ గుద్దేసినంతమాత్రాన భారత ప్రజా బాహుళ్యం సమ్మతించడానికి సిద్ధపడదు– ‘తాజ్‌మహల్ నిర్మాణానికి, దేవాలయ కట్టడాలకు రాళ్లె త్తిన కూలీలెవ్వరు/ ప్రభువెక్కిన పల్లకీకాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?’ అని ప్రశ్నోపనిషత్‌ను తెరవకుండా ఉండ జాలరు. కష్టజీవి శ్రమ ఆగిపోతే కాలానికి కళ్లమే!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment