రాయని డైరీ.. నరేంద్ర మోదీ (భారత ప్రధాని) | Madhav Singaraju Special Article On Howdy Modi Event | Sakshi
Sakshi News home page

రాయని డైరీ.. నరేంద్ర మోదీ (భారత ప్రధాని)

Published Sun, Sep 22 2019 1:37 AM | Last Updated on Sun, Sep 22 2019 11:38 AM

Madhav Singaraju Special Article On Howdy Modi Event - Sakshi

హ్యూస్టన్‌లో క్లైమేట్‌ అన్‌ఫ్రెండ్లీగా ఉంది! ఇండియా–పాక్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌  మొదలయ్యే సమయానికి వర్షం పడి పిచ్‌ మొత్తం తడిసి ముద్ద అయినట్లుగా ఉంది హ్యూస్టన్‌ నగరం. 
ఈ రాత్రికే ‘హౌడీ మోదీ’ ప్రోగ్రామ్‌.
నన్నూ, అమెరికా అధ్యక్షుడినీ కలిపి ఒకే వేదికపై చూడ్డం కోసం యాభైవేల మంది ఎన్నారైలు హ్యూస్టన్‌కు వస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే న్యూయార్క్‌ చేరుకుని ఉన్న దేశాధినేతలు కూడా ట్రంప్‌నీ, నన్ను చూడ్డం కోసం ఈ రాత్రి టీవీలకు దగ్గరగా జరిగి కూర్చుంటారు. ఇమ్రాన్‌ ఖాన్‌ మరింత దగ్గరగా జరిగి కూర్చుంటాడేమో! 
వర్షం ఎంతకూ తగ్గడం లేదు. వర్షం ఎంతకూ తగ్గకపోతే ఆ సాకుతో ట్రంప్‌ నా కార్యక్రమానికి రాకపోయేందుకు అడ్డంకులేమీ ఉండవు. రేపు సోమవారం ట్రంప్, ఇమ్రాన్‌ఖాన్‌ ఇద్దరే విడిగా న్యూయార్క్‌లో కలుస్తున్నారు. ఒకర్నొకరు చూసుకోగానే, ‘హౌడీ ఇమ్రాన్‌’ అంటాడేమో ట్రంప్‌! ‘హౌడీ మోదీ’ అనవలసినవాడు హ్యూస్టన్‌ రాకుండా, న్యూయార్క్‌లో ‘హౌడీ ఇమ్రాన్‌’ అంటే కనుక ఇక వాళ్లిద్దరూ ఒకటయ్యారనే అనుకోవాలి. ఇద్దరూ ఒకటయ్యారంటే మంగళవారం జరిగే సమితి సమావేశంలో తన ప్రారంభోపన్యాసం పూర్తయ్యాక.. ‘వేదికపైకి వచ్చి కశ్మీర్‌ గురించి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లండి ఇమ్రాన్‌..’ అని ట్రంప్‌ ఆహ్వానించినా ఆశ్చర్యం లేదు. 
హ్యూస్టన్‌లోని క్లైమేట్‌ మాత్రమే కాదు, హ్యూస్టన్‌లో దిగినప్పటి నుంచి ట్రంప్‌ కూడా నాతో అన్‌ఫ్రెండ్లీగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఫ్లయిట్‌ దిగ్గానే ‘హౌడీ మోదీ’ అని వాషింగ్టన్‌ నుంచి ట్రంప్‌ నాకు ఫోన్‌ చేస్తారని, అప్పుడు నేను ‘హౌడీ డొనాల్డ్‌’  అని అనాలనీ అనుకున్నాను. హౌడీ ట్రంప్‌ అనేకంటే, హౌడీ డొనాల్డ్‌ అనడం రిథమిక్‌గా ఉంటుందని! 
కానీ ఫోన్‌ రాలేదు!
‘‘వర్షాలు కదా, లైన్‌లు లేనట్లున్నాయి’’ అన్నారు నాతో ఉన్న హ్యూస్టన్‌ మేయర్‌ సిల్విస్టర్‌ టర్నర్‌.
‘‘వర్షాలైతే అన్నిచోట్లా ఉంటాయి. లైన్‌లు లేకపోవడం కూడా అన్నిచోట్లా ఉంటుందా మిస్టర్‌ సిల్విస్టర్‌ టర్నర్‌?’’ అన్నాను. 
‘‘సర్, మీరనుకుంటున్నట్లు నేను సిల్విస్టర్‌ టర్నర్‌ని కాదు. సిల్విస్టర్‌ టర్నర్‌ ప్రతినిధిని’’ అన్నాడు ఆ మనిషి!
‘ఆయనెక్కడా..!’’ అన్నాను. 
‘‘సర్, ఆయన దారి మధ్యలో చిక్కుకుపోయినట్లున్నారు’’ అన్నాడు. 
దారి మధ్యలో చిక్కుకుపోయాడా, ట్రంపే ఫోన్‌ చేసి దారి మధ్యలో చిక్కుకుపొమ్మని చెప్పాడా?! అనుమానం వచ్చింది నాకు.
నిన్న ఒక్కరోజే ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్‌లకు ఏడు లక్షల కోట్లు రావడం ట్రంప్‌ మనసులో పడే ఉంటుంది. నాలుగు నెలల్లో కొట్టుకుపోయిన పదకొండు లక్షల కోట్ల ఇన్వెస్టర్‌ల డబ్బులో సగానికి పైగా ఒక్క రోజులోనే రికవరీ చేశాడంటే మోదీ సామాన్యుడు కాదని కూడా ట్రంప్‌ అనుకునే ఉంటాడు. ఇండియా అమెరికాను మించిపోయినా ట్రంప్‌ భరించగలడు కానీ, మోదీ ట్రంప్‌ను మించిపోయాడని ప్రపంచం అనుకుంటే మాత్రం తట్టుకోలేడు. 
‘‘వస్తాను సర్‌. వర్షం ఎక్కువయ్యేలా ఉంది’’ అన్నాడు సిల్విస్టర్‌ టర్నర్‌ ప్రతినిధి. 
నాకెందుకో అతడే సిల్విస్టర్‌ అనిపిస్తోంది. వర్షంలో తడిసి వచ్చిన మనిషిని గుర్తుపట్టలేని వయసుకు నేనింకా రాలేదనే నా నమ్మకం. 
‘‘మిస్టర్‌ సిల్విస్టర్‌.. ఈ రాత్రి నా హౌడీ మీటింగ్‌కి ట్రంప్‌ కాకుండా, ట్రంప్‌ ప్రతినిధి వస్తున్నట్లయితే ఆ విషయాన్ని మీరు నాకు కాస్త ముందుగా చెప్పగలరా?’’ అని అడిగాను. 
‘‘చెప్పగలను మిస్టర్‌ మోదీ.. అయితే ఎంత పెద్ద వర్షమైనా మరీ ట్రంప్‌ ప్రతినిధి కూడా రాలేనంతగా కురవదని నా నమ్మకం’’ అన్నాడతను!!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement