సైనిక పదఘట్టనలు, బోసిపోయిన పాఠశాలలు, కొనుగోళ్లు లేక డీలాపడిపోయిన పండ్ల షాపులు కశ్మీరులో సాధారణ స్థితి నెలకొంటోందని చెప్పే రుజువులు కానేకావు. ఆరువారాల క్రితం ప్రపంచం ఊహించని తీవ్ర చర్య తీసుకున్నాక, నేటివరకు కేంద్రప్రభుత్వం కశ్మీరులో దెబ్బతిన్న ప్రజల మనోభావాలను చల్లబర్చడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి కశ్మీరీల పరాయీకరణ మరింత పెరగనుంది. వేర్పాటువాదులనుంచి ప్రధానస్రవంతి రాజకీయ పార్టీలను వేరు చేసి వారికి సముచిత గౌరవం కల్పించనంతవరకు కశ్మీర్‌లో ప్రశాంతత ఏర్పడదు. ముస్లిం కశ్మీర్‌పై ప్రస్తుతానికి విజయం సాధించానని కేంద్రం కలలు కంటున్నప్పటికీ ప్రస్తుత ‘ప్రశాంత వాతావరణం’ కశ్మీరీల ఆమోదానికి ఉదాహరణ అనుకుంటే మాత్రం అంతకుమించిన తప్పిదం మరొకటి ఉండదు.
కశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొంటోందని భారత్ ప్రపంచానికి చూపించదల్చినట్లయితే, మూతపడిన షాపులు, బోసిపోయిన పాఠశాలలు, కొనుగోళ్లు లేక డీలాపడిపోయిన పండ్ల షాపులు.. మీకు మరొక కథను వినిపించవచ్చు. కశ్మీర్ గురించి తక్కిన భారతదేశంలో వినిపిస్తున్న ‘అంతా ప్రశాంతం’ తరహా వార్తలను దాటి చూస్తే శ్రీనగర్ నుంచి సోపియన్ వరకు దక్షిణ కశ్మీర్ మొత్తంగా ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా రోడ్లపై విసిరిన రాళ్లు.. సైనిక, పౌర వాహనాల కదలికను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా కూల్చివేసిన చెట్ల మొదళ్లు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే, కనుచూపుమేర సైని కులే కనబడుతున్నారు. షాపులు, వ్యాపార సంస్థలు మూతపడి ఉన్నాయి. శుక్రవారం పూట బాగా రద్దీతో, అశాంతితో, నిరసనలతో కనిపించే రోడ్లు ఎంత నిర్మానుష్యంగా కనబడుతున్నాయంటే కశ్మీరులో ఉద్రిక్తత ఊహిస్తున్న దానికంటే ఎక్కువగానే ఉన్నట్లు మన అనుభవంలోకి వస్తుంది.
ఏదేమైనప్పటికీ 2019 ఆగస్టు 5 నుంచి కశ్మీరు హృదయాంతరాళాల్లో వైరుధ్యానికి సంబంధించిన నూతన అధ్యాయం ప్రారంభమైంది. కశ్మీరులో వివిధ భావజాలాలు, అభిప్రాయాలతో ఘర్షణ పడుతుండే ప్రజానీకాన్ని ఇప్పుడు ఒక సాధారణ భావోద్వేగం చుట్టుముట్టింది. అదేమిటంటే తాము విద్రోహానికి గురైన భావన. భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని తోసిపారేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో ఢిల్లీ ప్రదర్శించిన దూకుడు వైఖరి కశ్మీర్ ప్రధాన స్రవంతి రాజకీయ వర్గం ఉనికిని భంగపరుస్తూ తీవ్రంగా అవమానపర్చింది. మూడు దశాబ్దాల హింసాత్మక నేపథ్యంలో వీరు న్యూఢిల్లీకి, కశ్మీర్ వేర్పాటువాదులకు మధ్య తటస్థ శక్తిగా నిలిచి ఉండేవారు. స్వయం ప్రతిపత్తి లేక స్వయం పాలన అనే హామీపై తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటూ, ఆ ప్రాతిపదికనే పాకిస్తా¯Œ ను కాస్త దూరం పెడుతూ వచ్చిన ఈ ప్రాంతీయ పాలకవర్గం ఇప్పుడు పూర్తిగా మౌనం పాటిస్తోంది.
రాజకీయ వేర్పాటువాదంతో వ్యవహరించడంలో ప్రధాన స్రవంతి వైఫల్యానికి చెందిన ఉదాహరణలు కోకొల్లలు. వాజ్‌పేయి నుంచి మన్మోహన్ సింగ్ హయాం దాకా ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కానీ మోదీ ప్రభుత్వం ప్రస్తుతం వ్యవహరించిన వైఖరి నిరంకుశ స్వభావంతోనే కాకుండా ఒక్క రాయితో రెండు పిట్టల్ని చంపిన చందాన కనిపిస్తోంది. ఒకవైపు తమను ఢిల్లీ పూర్తిగా పక్కకు తోసిపారేయడం, మరోవైపున భారత్ ఉద్దేశాలను పసిగట్టడంలో అంధులుగా ఉండిపోయారంటూ తోటి కశ్మీరీ పౌరులు నిందిస్తూ ఉండటంతో కశ్మీర్ లోని భారత అనుకూల పాలకవర్గం పూర్తిగా అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
సోపియన్ పట్టణంలో పన్నెండు మంది టాక్సీ డ్రైవర్ల ప్రతిస్పందనలు చూస్తే పెద్దగా తేడా కనిపించలేదు. వారిలో వయసు మళ్లినవారు కశ్మీర్ సెంటిమెంట్లను గౌరవించనందుకు, వేసవి సీజనులో పర్యాటక వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీసినందుకు కేంద్రప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. తన నిర్ణయంతో భారత్ తన కాలుమీద తానే కాల్చుకుంది అన్నది వీరి ఏకైక భావన. స్థానిక ఎమ్మల్యే తన అధినేత మెహబూబా ముఫ్తిలాగానే ముందస్తు నిర్బంధంలో ఉన్నారు. అలాగని తమ రాజకీయ నాయకత్వంపై ఇలాంటి సామాన్య జనానికి పెద్దగా ప్రేమ అంటూ లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీతో గతంలో అంటకాగిన దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని జనాభిప్రాయం. కశ్మీర్‌కు ప్రస్తుతం ఈ స్థితి తీసుకొచ్చినందుకు వీరే కారణమని అందరూ దూషిస్తున్నారు. అదేసమయంలో కేంద్రం తీసుకున్న దూకుడు చర్యతో కశ్మీరులో ప్రధానస్రవంతికి, వేర్పాటువాదులకు మధ్య అంతరం పూర్తిగా తొలిగిపోయింది. దీన్నే ఒక నిరసనకారుడు స్పష్టంగా చెప్పారు. ‘ఇది చివరి దెబ్బ. కశ్మీర్ కోసం పోరాటం అజాదీకోసం అంతిమ పోరాటంగా మారుతుంది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా మాకు ఇక ఇదే శరణ్యం’.
ఇక సంవత్సరాల తరబడి కశ్మీర్, దాని వెలుపలి జైళ్లలోనూ మగ్గిపోయిన వేర్పాటు వాదులు, వారి వారసులు, సోదరులు, పిల్లలు భారతీయ చట్టాలను తామెన్నటికీ అంగీకరించలేమని ప్రకటిస్తున్నారు. ‘మా మతం పాకిస్తాన్ వైపే మొగ్గు చూపుతోంది. అందుకే వారు మాకు మద్దతిస్తున్నారు’ అంటూ జమాత్ ఇ ఇస్లామి కార్యకర్త, వారణాసి జైలులో ఉంటున్న ఉమర్ బషీర్ నైకో బంధువు తేల్చి చెప్పాడు. బహుశా కశ్మీర్ ప్రజానీకంలో బలపడుతూ వస్తున్న ఇలాంటి అభిప్రాయాలే మోదీ ప్రభుత్వాన్ని ప్రస్తుత దూకుడు చర్యకు సిద్ధపడేలా చేశాయన్నది వీరు గమనించకపోవచ్చు. పైగా కశ్మీర్ పండిట్లు 1989లో తీవ్రవాదం ప్రారంభమయ్యాక లోయ విడిచి వెళ్లారన్న చరిత్ర ఆ తర్వాత పుట్టిన కశ్మీర్ వాసులకు ఎవరికీ తెలీదు.
ఇక శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో ఇదే సెంటిమెట్ రిపీట్ అయింది. ఆగ్రహోదగ్రులైన యువత భద్రతా బలగాలు ప్రవేశించకుండా కందకాలు తవ్వారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రాళ్లు, పెల్లెట్లు రువ్వుతుండటం కనిపిస్తుంది. సైనికులు పేలుస్తున్న పెల్లెట్లు తలకు తగిలి మంటపెడుతున్నా 22 ఏళ్ల యువకుడు ఆస్పత్రికి వెళ్లడానికి కూడా నిరాకరిస్తూ కనిపించాడు. తాను బయటకు వెళితే చాలు పోలీసులు లాక్కెళతారని. ప్రజా భద్రతా చట్టం కింద 2016లో తనను రెండుసార్లు అరెస్టు చేశారని తాను చెప్పాడు. అంతటా ఆవరించిన నిశ్శబ్ద వాతావరణంలో, నిర్మానుష్యమైన వీధుల్లో సౌరియా ప్రాంతంలో ప్రజాగ్రహం చిన్న తరహా సునామీని తలిపిస్తుంది. కాని అది తన హద్దులను దాటుకుని ముందుకు వెళుతుందా అన్నదే ప్రశ్న. ఇక సమీపంలోని అంకార్ మసీదు వద్ద 22 ఏళ్ల విద్యార్ది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వని పోస్టర్ కింద నిల్చుని ఉన్నాడు. ఈ విద్యార్థి అభిప్రాయంలో ఆర్టికల్ 370 రద్దు అర్థరహితమైన చర్య. మోదీ నేతృత్వంలోని భారత్ ముస్లిం లంటే లెక్కచేయడం లేదని ఢిల్లీ చర్యలు మరోసారి నిరూపించాయని, అందుకే కశ్మీర్‌కు స్వాతంత్య్రం ఇప్పుడు మరింత అవసరమని అతనంటాడు.
వేర్పాటువాదులలో లేదా భారత అనుకూల కశ్మీరీలలో ఇప్పుడు విస్తృతంగా చలామణిలో ఉన్న అనుభూతి ఇదే. ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న అనూహ్య చర్య.. కశ్మీరులో ముస్లింల పాత్రను సామాజికంగా, రాజకీయంగా తగ్గించి హిందుత్వ ప్రాజెక్టును విస్తృతస్థాయిలో అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యమని మెజారిటీ కశ్మీరీలు భావిస్తున్నారు. ఈ చర్య తమ ఆత్మగౌరవంపై పెనుదాడేనని, తమకు ఆర్థిక సాధికారత కల్పిస్తామనే సాకుతో రాజకీయంగా తమ సాధికారతను పెకిలించేస్తున్నారని వీరి ఆరోపణ. మరి దానివల్ల కలిగే ఫలితాలను అనుభవించడానికి భారత్ సిద్ధంగా ఉందా అనేది ప్రశ్న.
వాస్తవం ఏదంటే, తర్వాతేం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు. సెప్టెంబర్ 27న ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేంతవరకు కశ్మీరులో హింసాత్మక ప్రదర్సనలు జరగకుండా, పౌరులకు గాయాలు తగలకుండా జాగ్రత్తపడాలని భద్రతా దళాలకు గట్టి ఆదేశాలు ఇచ్చారు. కశ్మీరులో కమ్యూనికేషన్లను పునరుద్ధరించాలని, రాజకీయనేతలను విడుదల చేయాలని, మానవహక్కులను కాపాడాలని అంతర్జాతీయంగా భారత్‌కు వ్యతిరేకంగా గళాలు విప్పుతున్న నేపథ్యంలో తనను తాను గొప్ప ప్రజాస్వామ్యవాదిగా భావిస్తూ అందరూ తనను గౌరవించాలని కోరుకుం టున్న ప్రధాని మోదీకి కశ్మీర్‌లో నెలకొనే ప్రతి హింసాత్మక ప్రదర్శనా.. ఎంతోకొంత చెడ్డ పేరును కొనితెస్తుదని తెలుసు. అందుకే సైన్యం అతి చర్యలకు పాల్పడకుండా నియంత్రిస్తూనే భద్రతా కారణాల రీత్యా మొబైల్ కమ్యూనికేషన్ల పునరుద్ధరణను కేంద్రం తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ ఒత్తిడుల కారణంగా త్వరలోనే కమ్యూనికేషన్లను పునరుద్ధరించవచ్చు కానీ ప్రధాన స్రవంతి నేతలను విడుదల చేయడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.
ఆరువారాల క్రితం ప్రపంచం ఊహించని తీవ్ర చర్య తీసుకున్నాక, నేటివరకు కేంద్రప్రభుత్వం కశ్మీరులో దెబ్బతిన్న ప్రజల మనోభావాలను చల్లబర్చడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి కశ్మీరీల పరాయీకరణ మరింత పెరగనుంది. వేర్పాటువాదులనుంచి ప్రధానస్రవంతి రాజకీయ పార్టీలను వేరు చేసి వారికి సముచిత గౌరవం కల్పించనంతవరకు కశ్మీర్‌లో ప్రశాంతత ఏర్పడదు. ముస్లిం కశ్మీర్‌పై ప్రస్తుతానికి విజయం సాధిం చానని కేంద్రం కలలు కంటున్నప్పటికీ ప్రస్తుత ‘ప్రశాంత వాతావరణం’ కశ్మీరీల ఆమోదానికి ఉదాహరణ అనుకుంటే మాత్రం అంతకుమించిన తప్పిదం మరొకటి ఉండదు.
మాయా మీర్‌చందాని
వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, అశోకా యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment