స్వరం మారిన స్వాతంత్య్రం | K Rajashekar Raju Special Article on Independence Day | Sakshi
Sakshi News home page

స్వరం మారిన స్వాతంత్య్రం

Published Thu, Aug 15 2019 12:45 AM | Last Updated on Thu, Aug 15 2019 12:56 AM

K Rajashekar Raju Special Article on Independence Day - Sakshi

మన స్వాతంత్య్ర సమరయోధులనుంచి ఆధునిక భారత నిర్మాతల వరకు దేశభక్తికి నిర్వచనం ఒక్కటే.. అదే ప్రేమభావన. న్యాయకాంక్షను వ్యక్తీకరించే ప్రేమభావంతోటే బంకించంద్‌ చటోపాధ్యాయ సుజలాం సుఫలాం అంటూ ఈ నేల గురించి పారవశ్యంతో పాడుకున్నారు. ఠాగూర్‌ ‘జయహే జయహే’ అంటూ దేశాలాపన చేశారు. మహమ్మద్‌ ఇక్బాల్‌ ‘సారే జహాసే అచ్చా’ అంటూ దేశ ప్రేమకు విశ్వజనీన నిర్వచనం ఇచ్చారు. లక్షలాదిమంది స్వాతంత్య్ర సమరయోధులు చివరి శ్వాస వరకు దేశంపట్ల ప్రేమతత్వంతోనే జ్వలించారు. మనిషి పట్ల ప్రేమ, నేలపై ప్రేమ, దేశమాతపై ప్రేమ, తమ స్వాతంత్య్రంపై ప్రేమ.. ఇదే మన సమరయోధుల జ్ఞాపకాలకు శాశ్వతత్వం కలిగించింది. ఏడు దశాబ్దాల స్వాతంత్యం తర్వాత దేశం పట్ల ప్రేమ, దేశభక్తి తమ నిర్వచనం మార్చుకున్నాయేమో.. ప్రేమ స్థానంలో ద్వేషం, విభజనతత్వం రాజ్యమేలుతున్నాయేమో! ఇవన్నీ ఈ స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంలో అవలోకించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

నేడు భారతదేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభదినం. భారతదేశ చరిత్రలో మరచిపోలేని, మరపురాని చారిత్రక క్షణాలకు అద్దం పట్టే రోజిది. బ్రిటిష్‌ నిరంకుశ రాజరికపు పదఘట్టనలలో దాదాపు రెండు శతాబ్దాల పాటు తీవ్ర పోరాటాలు, సంఘర్షణల మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం భారతీయ ఉపఖండం స్వాతంత్య్రం పొందిన దినం ఆగస్టు 15. స్వాతంత్యం సిద్ధించిన తర్వాతే భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామికంగా అవతరించిందన్నది వాస్తవం. శ్వేత జాత్యహంకారం ఈ నేలమీద నివసించే ప్రజ లను నల్లకుక్కలుగా ముద్రించి శ్వాస పీల్చడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిటిష్‌ దుర్భర పాలననుంచి అష్టకష్టాలు పడి సిద్ధింపజేసుకున్న స్వాతంత్య్రం మనది. అహింసా పోరాటాలు, హింసాత్మక పోరాటాలు, జాతీయ విప్లవోద్యమాలు ముప్పేటగా తలపడిన అనంతరం మాత్రమే పరాయి పాలన నుంచి మనం స్వతంత్ర వాయువులను పీల్చుకోగలిగాం. ఈ దేశం కోసం నిండు మనస్సుతో తపనపడిన లక్షలాది స్వాతంత్య్ర పోరాట వీరుల, వీరనారుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం. వారి చిరకాల స్వప్నాలు సాకారమైన క్షణం నుంచే, వారి ప్రాణ త్యాగాలు ఫలించిన క్షణం నుంచే మనం స్వతంత్ర భారతీయులమయ్యాం. జాతీయవాదం, దేశభక్తి రెండు జోడెద్దుల్లా దేశ పునర్నిర్మాణానికి నాంది పలికిన రోజు 1947 ఆగస్టు 15.

ఈ ఆగస్టు 15కి ఎన్నడూ లేని ప్రత్యేకత ఉంది. భారతదేశం నుంచి తమకు స్వాతంత్య్రం కావాలని ప్రజానీకం కోరుకుంటున్న ఒక భూభాగాన్ని పూర్తి స్థాయిలో దేశంలో విలీనం చేసుకున్న ఘట్టాన్ని మనం నేడు చూస్తున్నాం. ఒక మాజీ సంస్థాన రాజ్యమైన జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి చెందిన చివరి అవశేషాలను భారత ప్రభుత్వం అత్యంత సాహసికంగా తొలగించి దాయాది దేశాన్ని సవాలు చేసిన ఉత్కంఠ భరితక్షణాల్లో మనం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గాయపడిన కశ్మీరీ ప్రజల హృదయాలకు ఎలా సాంత్వన పలకగలం అనే దానిపై ఆధారపడే ఇకపై భవిష్యత్‌ భారత ముఖచిత్రం రూపొందనుంది. అదే సమయంలో దేశ పునర్నిర్మాణానికి నాందిపలికిన జాతీయవాదం, దేశభక్తి భావనలే తీవ్ర చర్చనీయాంశాలుగా మారి దేశానికి దేశమే రెండుగా చీలిపోయిన విపరిణామాలకు కూడా ఈ 73వ స్వాతంత్య్ర దినోత్సవ ఘట్టం అద్దం పడుతోంది. గత ఏడు దశాబ్దాలుగా దేశం వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు పొందటం వాస్తవం. అదే సమయంలో దేశప్రజలకు ఓటు వేసే స్వాతంత్య్రం తప్ప నిజమైన స్వాతంత్య్రం ఇంకా సిద్ధించలేదనే వాదనలు కూడా బలం సంతరించుకోవడమన్నదీ వాస్తవమే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రానికి, నిజమైన స్వాతంత్య్రానికి మధ్యగల తేడాను కొత్తగా నిర్వచించుకోవలసిన క్షణం కూడా వచ్చేసింది. అందుకు చరిత్ర మూలాలు తడమటం తప్పనిసరి.

బ్రిటిష్‌ ఏలుబడిలోని భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా ఏర్పడిన భారత సమాఖ్యలో చేరింది మొదలుకుని భారతీయ సంస్థానాల అధికారాలు, సంస్థానాధిపతుల హక్కులు తగ్గుముఖం పట్టే ప్రక్రియ ప్రారంభమైంది. తమ సొంత ఆస్తులు, బిరుదులు, సౌకర్యాలను మాత్రమే తమ వద్ద ఉంచుకునే స్వాతంత్య్రం సంస్థానాధిపతుల అనుభవం లోకివచ్చింది. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా సంస్థానాధీశులు వీటిని పొందుతూ వచ్చారు కానీ 1970లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యాంగ సవరణ ద్వారా సంస్థానాధిపతుల ప్రత్యేక స్వాతంత్రం ఉనికిలో లేకుండా పోయింది. బ్రిటిష్‌ ప్రభుత్వ హయాం నుంచి స్వతంత్ర భారత ప్రభుత్వం వరకు సంస్థానాధీశులు పొందుతూ వచ్చిన రాజభరణాలు ఒక్క కలంపోటుతో రద్దయ్యాయి. ఈ క్రమంలో పాత భూస్వామ్య సంస్థానాధీశులు రూపం మార్చుకుని కొత్త ప్రభువులుగా అధికార పార్టీల్లో, అధికార స్థానాల్లో బలం పుంజు కున్నారు తప్పితే అప్పుడూ ఇప్పుడూ సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు. వ్యవస్థ మారకుండానే దాన్ని వారసత్వంగా పొందే అవకాశం కులీనులకు, భూస్వామ్య ప్రభువులకు అయాచితంగా వరించింది.

ఏడు దశాబ్దాల తర్వాత కూడా భారత ప్రజాస్వామ్యం  భూస్వామ్య అవశేషాల ప్రతిరూపంగానే ఉంటోంది. ప్రజలందరికీ ఓటు వేసే స్వాతంత్య్రం మాత్రమే టెక్నాలజీ ప్రభావంతో దక్కింది కానీ నిజమైన రాజకీయ స్వాతంత్రం ఇప్పటికీ విస్తృత ప్రజానీకానికి అందుబాటులో లేదు. మనకంటే చాలా ఆలస్యంగా బ్రిటిష్‌ పాలన నుంచి పూర్తి స్వాతంత్య్రం పొందగలిగిన కెనడా (1982), ఆస్ట్రేలియా (1986), న్యూజిలాండ్‌ (1986) దేశాలు ఆర్థికాభివృద్ధిలో, పౌరుల సామాజిక, వ్యక్తిగత స్వాతంత్య్రాల విషయంలో ఎంతో ముందంజ వేయగా 1947లోనే బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందిన భారత దేశంలో సమాజం కానీ, ప్రజలు కాని ఆ దేశాల కంటే ఎంతో తక్కువ స్థాయిలో స్వేచ్ఛను అనుభవిస్తూండటం గమనార్హం.

ఒక దేశ పటం కానీ, జాతీయ జెండా కానీ ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే ప్రజల నిజమైన స్వాతంత్య్రాన్ని స్ఫురింపజేయలేవు. ఇక ఓటుహక్కును కలిగి ఉండటం మాత్రమే స్వాతంత్య్రం కాదు. జాతీయ పటం, జాతీయ జెండా, సార్వత్రిక ఓటు అనేవి సుందరమైన భావనలు మాత్రమే. ఏ హక్కులూ లేనిచోట ఓటుహక్కునైనా కలిగి ఉండటం చాలా మంచిదే కావచ్చు కానీ డబ్బు, కండబలం లేకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యమైపోయిన చోట ప్రజల ఓటుహక్కు దాని నిజమైన అర్థంలో ప్రాభవాన్ని కలిగి ఉన్నట్లు కాదు. మన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చాలామంది మాజీ లేక ప్రస్తుత భూస్వామ్య దొరలే కావడం పరమవాస్తవం. ఉన్నావ్‌ బాధితురాలిపై అత్యాచారం కేసులో ఆరోపణలకు గురైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగార్‌ తన నియోజక వర్గ ప్రజలకంటే ఎక్కువ స్వాతంత్య్రాన్ని పొందుతుండడం ఈ వాస్తవానికి మరొక రూపం మాత్రమే.

ఇక భారత ప్రజల విషయానికి వస్తే కోట్లాదిమంది ఇప్పటికీ కుటుంబం, ఉద్యోగం, సమాజం అనే జైలు గోడల మధ్య ఖైదీలుగా, జైలు గార్డుల్లాగా జీవితాలు గడుపుతున్నారు. అక్షరాలా వీరు తమ తమ బోనుల్లో ఎలాంటి జీవితం గడపాలని తమకు పాలకులు నిర్దేశిస్తున్నారో సరిగ్గా అలాంటి జీవితాన్నే గడుపుతూ వస్తున్నారు. వారి పుట్టుక, వారి మరణం వరకు వారి జీవిత పర్యంతమూ ఇతరుల నిర్ణయానుసారమే నిర్ణయమవుతున్నాయి. సంవత్సరంలో ఒక్క రోజు కూడా వారు తమ ఇష్ట ప్రకారం జీవించలేకపోతున్నారు. ఏం తినాలి, ఏం తాగాలి, వేటిని ధరించాలి అన్నీ కూడా పాలకులు, నిర్దేశించిన మార్గాల్లోనే సాగుతున్నాయి. సమాజ నిబంధనలు, పాలకుల ఆదేశాలు, నిర్ణయాలకు తలొగ్గి మాత్రమే మనం జీవించాల్సి వస్తోంది. అందుకే మన స్వాతంత్య్రం ఇంకా మన ఇళ్లలోకి రాలేదు. ఇంటిబయటనే తచ్చాడుతోంది అంటూ మేధో చింతన మొత్తుకుంటోంది. ఇది నిజమైన స్వాతంత్య్రం కాదు. ఇది మారాలి. చంద్రయాన్, మంగళయాన్, సౌరయాన్‌ వరకు మన అంతరిక్ష ప్రయోగాలు విజయబాటలో నడుస్తున్నప్పటికీ, ప్రపంచంలోని చాలా దేశాలకంటే మిన్నగా మనం ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు నిండైన అర్థంలో గుబాళించే తరహా విముక్తి మన పౌరజీవితంలో సాధ్యం కాలేదు. కశ్మీర్‌ నుంచి, కన్యాకుమారి వరకు భారత సమాజంలో జరగాల్సిన నిజమైన మార్పు ఇదే. ఈ 73వ స్వాతంత్య్ర దినోత్సవం మనందరిపై విధించిన పెద్ద బాధ్యత ఇదే.

ఇవ్వాళ మన దేశభక్తి, నిజంగా ప్రేమకు సంబంధించిందేనా? అంతరాంతరాల్లో అవును అనిపిస్తున్నప్పటికీ ఎక్కడో సందేహం. కించిత్‌ అనుమానం.. మన దేశ ప్రేమ మన సోదరులపైనే ద్వేషంగా మారుతోందా? ప్రేమ, ద్వేషం ఒకే నాణేనికి రెండు వైపులుగా ఉంటున్నాయి. ఒకే హృదయంలో రెండు విరుద్ధ భావోద్వేగాలు కలిసి ఉంటున్నాయి. ఒక గణతంత్ర రాజ్యం మనగలిగేందుకు అస్కారమివ్వని అనారోగ్యపరిస్థితి ప్రస్తుతం దేశంలో అలుముకుంటోంది. జాతి మూలాలను పెకిలిస్తున్న ఉగ్రవాదంతో ఏ దేశమైనా కాంతివేగంతో తలపడాల్సిందే. కానీ ప్రతీకారం కోసం ప్రతిజ్ఞ చేయడం మన దేశ భక్తి కారాదు. మానవత్వం కోసం పరితపిస్తున్నవారిని ద్వేషించడం మన భావజాలం కారాదు. ప్రజలందరూ నా కన్నబిడ్డలే అనే అశోకుడి తత్వాన్ని జాతీయ చిహ్నంగా మార్చుకోవడం సరే. దేశం అంతరంగంలో ఆ భావన గుబాళించాలి. దీనికి భిన్నంగా కులం, మతం, రంగు, జాతి, తిండి, అలవాట్లు, సంస్కృతి భేదాల పట్ల మనం ప్రదర్శించే ద్వేషభావం మన రిపబ్లిక్‌ లేక మన స్వాతంత్య్ర మూలాలనే పెకిలించివేస్తుంది. 73 సంవత్సరాల స్వాతంత్య్రం దేశంముందు విసురుతున్న సవాలు ఇదే. – కె. రాజశేఖర రాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement