మీరు కట్టాల్సిన పన్ను ఎంత? | Special Article on Tax | Sakshi
Sakshi News home page

మీరు కట్టాల్సిన పన్ను ఎంత?

Published Fri, Feb 3 2017 2:48 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

మీరు కట్టాల్సిన పన్ను ఎంత?

మీరు కట్టాల్సిన పన్ను ఎంత?

ఈ సారి బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి  పెద్ద మార్పులేవీ చేయకపోయినా... దిగువ మధ్య తరగతి వారికి కొంత ఊరటనివ్వటం.... ఏడాదికి రూ.50 లక్షల పైబడి సంపాదించేవారిపై కొంత సర్‌చార్జీ వేయటం వంటివి జరిగాయి. ఈ మార్పుల వలన ఎవరికెంత పన్ను భారం పడుతుంది? ఎవరికి ఎంత లాభం చేకూరుతుంది? పన్నును తగ్గించుకోవటానికి ఉన్న మినహాయింపులేంటి? ఆ మినహాయింపుల కోసం ఎందులో ఇన్వెస్ట్‌ చేయాలి? ఇలాంటి వివరాలన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం...

సెక్షన్‌ 80సీ.. ఇంకా మరిన్ని
ఆదాయపు పన్ను మినహాయింపులన్నిటిలోకీ అన్నివర్గాలకూ ఎక్కువ మినహాయిం పునిస్తున్నది సెక్షన్‌ 80సీ మాత్రమేనని చెప్పాలి. ఈ సెక్షన్‌ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షలను మినహాయించుకునే అవకాశముంది. ఈ సెక్షన్‌ పరిధిలోకి వచ్చే మినహాయింపులేంటంటే...

ప్రావిడెంట్‌ ఫండ్‌కు చెల్లించిన మొత్తం ∙మీరు తీసుకున్న గృహ రుణంపై అసలు (ప్రిన్సిపల్‌) కింద చెల్లించిన మొత్తం ∙పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో (పీపీఎఫ్‌) చేసే ఇన్వెస్ట్‌మెంట్‌. ఇది ఏడాదికి రూ.500 నుంచి 1.5 లక్షల వరకూ చేయొచ్చు. ∙మీ పిల్లల స్కూలు ఫీజు. దీన్లో ట్యూషన్‌ ఫీజుగా పేర్కొనే మొత్తాన్నే మినహాయిస్తారు. అదీ ఇద్దరు పిల్లల వరకే. ∙మీ పేరిట, భార్య, పిల్లల పేరిట చెల్లించే బీమా ప్రీమియం లు. ∙మీ పేరిట, భార్య, పిల్లల పేరిట చెల్లించే యూలిప్‌ ప్రీమియంలు. ∙పోస్టాఫీసుల్లో ఎన్‌ఎస్‌సీ సర్టిఫికెట్ల కొనుగోలుకు వెచ్చించే మొత్తం. ∙బ్యాంకుల్లో గానీ, పో స్టాఫీసుల్లో గానీ ఐదేళ్ల కాలానికి చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ∙గమనించాల్సిందేంటంటే ఈ మొత్తం అంశాల్లో దేన్లో ఎంత ఇన్వెస్ట్‌ చేసినా గరిష్ఠంగా ఒక ఏడాదికి రూ.1.50 లక్షలు మాత్రమే పన్ను మినహాయింపునకు క్లెయిమ్‌ చేసుకునే అవకాశముంది.

పన్ను మినహాయింపునిచ్చే ఇతర పొదుపు పథకాలు
న్యూ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌): ఈ పథకం కింద ఇన్వెస్ట్‌ చేసే మొత్తాన్ని గతంలో సెక్షన్‌ 80సీలో భాగంగానే చూసేవారు. కానీ గడిచిన ఏడాది నుంచీ ఈ పథకం కింద ఇన్వెస్ట్‌ చేసే మొత్తంలో రూ.50,000 వరకూ సెక్షన్‌ 80సీకి అదనంగా చూపించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం చట్టంలో 80 సీసీడీ పేరిట కొత్త సబ్‌సెక్షన్‌ తెచ్చారు.

గృహ రుణంపై వడ్డీ: మీరు గృహ రుణం తీసుకుని... అదే ఇంట్లో గనుక ఉంటే, మీరు చెల్లించే వడ్డీలో గరిష్ఠంగా ఏడాదికి రూ.2 లక్షల వరకూ మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

విద్యా రుణంపై చెల్లిస్తున్న వడ్డీ: దీనికి పరిమితేమీ లేదు. ఎంత వడ్డీ చెల్లిస్తే అంతా క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

వైద్య బీమా ప్రీమియం: మీతో పాటు మీ భార్య, పిల్లల వైద్య బీమాకు చెల్లించే ప్రీమియంలో రూ.25,000 వరకూ మినహాయింపు క్లెయిమ్‌ చేయొచ్చు. మీరు గనుక 60 ఏళ్లు దాటినవారైతే ఈ మినహాయింపు 30,000 దాకా ఉంటుంది.  మీ తల్లిదండ్రులకు గనుక బీమా చేయిస్తే అదనంగా మరో రూ.25,000 క్లెయిమ్‌ చేసుకునే అవకాశముంది.

విరాళాలు: నోటిఫైడ్‌ సంస్థలు, రాజకీయ పార్టీలకిచ్చే విరాళాల్లో ఆయా సంస్థల్ని బట్టి పూర్తిగా గానీ, 50 శాతం మొత్తాన్ని గానీ మినహాయింపు కోసం క్లెయిమ్‌ చేసుకునే అవకాశముంది. తాజా బడ్జెట్‌ ప్రకారం ఇలాంటి విరాళాలు చెక్కు, లేదా డిజిటల్‌ రూపంలో చెల్లించాలి. రూ.2,000 వరకూ మాత్రమే నగదు రూపంలో చెల్లించవచ్చు.

వ్యాధుల ఖర్చు: ఎయిడ్స్, కొన్ని రకాల కేన్సర్ల వంటి వ్యాధుల చిక్సిత కోసం అసెసీ సొంతంగా కానీ, తనపై ఆధారపడ్డ వారికిగానీ పెట్టే ఖర్చులో రూ.40,000 వరకూ క్లెయిమ్‌ చేయొచ్చు. ఈ మినహాయింపు పరిమితి రోగి వయసు 60 ఏళ్లు దాటితే రూ.60,000గా, 80 ఏళ్లు దా టితే రూ.80,000గా ఉంది.

వైకల్యం ఖర్చు: అసెసీ లేదా తనపై ఆధారపడ్డవారు అంగవైకల్యం బారిన పడితే వారి వైద్య ఖర్చులు, శిక్షణ కోసం చెల్లించే మొత్తంలో రూ.75,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. తీవ్ర అంగవైకల్యమైతే ఇది రూ.1.25 లక్షల వరకూ ఉంది.
ఇవండీ మినహాయింపులు: ఇవి కాక మీకు వచ్చే హెచ్‌ఆర్‌ఏ గానీ, మీరు చెల్లించే ఇంటద్దె గానీ, ఆఫీసు మీకు చెల్లించే కొన్ని రకాల అలవెన్సులుగానీ... ఇవన్నీ మినహాయింపుల పరిధిలోవే. మీ మొత్తం జీతంలో వీటన్నిటినీ మినహాయించాక మిగిలేదే ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌. అందులో బేసిక్‌ లిమిట్‌ను తీసేసి... మిగిలిన మొత్తంపై ఆయా శ్లాబుల్ని అనుసరించి పన్ను విధిస్తారు.

ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌ అంటే ?
మీకు జీతం రూపంలో వచ్చేది మీ ఆదాయం మాత్రమే. అదంతా పన్ను చెల్లించాల్సిన ఆదాయం (ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌) మాత్రం కాదు. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టంలో వివిధ సెక్షన్ల కింద వివిధ రకాల మినహాయింపులున్నాయి. మనం చేసే పొదుపు నుంచి, మనం కట్టే ఇంటద్దె వరకూ చాలా ఖర్చుల్ని మినహాయించుకునే వీలుంది. ఇవన్నీ మినహాయించాక నికరంగా మిగిలేదే ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఇది గనక రూ.3 లక్షల లోపు ఉంటే రిబేట్‌ సాయంతో రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని ఉండదు. దాటితే రూ.5 లక్షల వరకు 5 శాతం, 5–10 లక్షల మధ్య ఉండే మొత్తానికి 20 శాతం, 10–50 లక్షల మధ్య ఉండే మొత్తానికి 30 శాతం పన్ను చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 50 లక్షలు దాటినవారికి ఈ బడ్జెట్లో కొత్తగా 10 శాతం సర్‌చార్జి విధించారు. రూ.కోటి ఆదాయం దాటినవారికి గతేడాది బడ్జెట్లోనే 15 శాతం సర్‌చార్జి వడ్డించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement