ఆయుర్వేదం ప్రపంచంలోనే అతి పురాతన వైద్య విధానం. ఇప్పటికి ప్రపంచంలో మనుగడలో ఉన్న సమస్త వైద్య విధానాల్లోనూ ఇదే అత్యంత ప్రాచీనమైనది. భారత భూభాగంలో పుట్టిన ఆయుర్వేదానికి దాదాపు ఐదువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అల్లోపతి, హోమియోపతి తదితర ఆధునిక వైద్య విధానాలు ఎన్ని వచ్చినా, ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆయుర్వేదం ప్రాక్పశ్చిమాలలోని ఇతర దేశాలకూ విస్తరించింది. తాజా అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ విలువ 517 కోట్ల డాలర్లు (రూ.36,665 కోట్లు). రానున్న ఐదేళ్లలో ఈ మార్కెట్ 921 కోట్ల డాలర్ల (రూ.65,316 కోట్లు) మేరకు విస్తరించగలదని మార్కెట్ వర్గాల అంచనా.
ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఆయుర్వేదంపై ఒక విహంగ వీక్షణం... మానవాళిలో వ్యాధుల పట్ల భయం అనాదిగా ఉన్నదే. వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి పురాతన మానవులు తమకు చేతనైన ప్రయత్నాలు చేసేవారు. అందుబాటులో ఉన్న ఆకులు, అలములతోను, మూలికలతోను వ్యాధుల నివారణ కోసం చేసే ప్రయత్నాలలో క్రమంగా కొంత పురోగతిని సాధించారు. నాగరికతలు ఏర్పడిన ప్రతి ప్రాంతంలోనూ సంప్రదాయ చికిత్సా విధానాలు అభివృద్ధి చెందాయి. అదే క్రమంలో భారత భూభాగంలో ఆయుర్వేదం అభివృద్ధి చెందింది. మనవాళ్లు ఆయుర్వేదాన్ని మొదట దేవతలకు, రుషులకు ఆపాదించారు. ధన్వంతరిని వైద్యానికి అధిదేవునిగా మన పురాణాలు వర్ణించాయి. అశ్వనీదేవతలను కూడా దేవ వైద్యులుగా ప్రస్తుతించాయి. ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులను గ్రంథస్థం చేసిన తొలినాటి వైద్యుల్లో చరకుడు, సుశ్రుతుడు ప్రముఖులు.
ఆయుర్వేద చరిత్ర
తొలి ఆయుర్వేద గ్రంథ రచించిన వాడు సుశ్రుతుడు. క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన సుశ్రుతుడు ‘సుశ్రుత సంహిత’ రాశాడు. అందులో వనమూలికల ఉపయోగాలతో పాటు పలు శస్త్రచికిత్సా పద్ధతులను కూడా వివరించాడు. సుశ్రుతుడి గ్రంథంలో శాస్త్ర విషయాలు మాత్రమే కాకుండా, కొన్ని పురాణ కల్పనలు కూడా కనిపిస్తాయి. వైద్యానికి అధిదేవత అయిన ధన్వంతరి మానవరూపంలో కాశీరాజుగా అవతరించాడని, తనతో పాటు మరికొందరు శిష్యులకు ఆయుర్వేద వైద్య మర్మాలను బోధించాడని చెప్పుకున్నాడు.
సుశ్రుతుడు తన గ్రంథంలో చెప్పిన ధన్వంతరి అవతార గాథ సంగతి ఎలా ఉన్నా, శస్త్రచికిత్సల గురించి అతడు వివరించిన పద్ధతులు నేటికీ అబ్బురపరుస్తాయి. ఒక రోగికి తెగిన ముక్కును తిరిగి బాగు చేయడానికి దాదాపు నేటి ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ తరహా శస్త్రచికిత్స చేసిన ఘనత సుశ్రుతుడి సొంతం. అందుకే ఆయుర్వేద చరిత్రకారులు సుశ్రుతుడిని ‘శస్త్రచికిత్సా పితామహుడు’గా అభివర్ణిస్తారు. ‘సుశ్రుత సంహిత’లో 1120 రకాల వ్యాధులు, 700 ఔషధ వృక్షాలు, ఖనిజ పదార్థాలతో తయారు చేసే 64 రకాల ఔషధాలు, జంతు సంబంధమైన వనరులతో తయారు చేసే 57 రకాల ఔషధాల గురించిన విపులమైన వర్ణన ఉంది.
సుశ్రుతుడి తర్వాత క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందిన చరకుడు ‘చరక సంహిత’ పేరిట మరో సమగ్ర వైద్య గ్రంథాన్ని రాశాడు. ప్రాచీన తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన చరకుడిని ఆయుర్వేద వైద్య పితామహుడిగా అభివర్ణిస్తారు. ఆధునిక జీవితంలోనూ అనుసరించదగ్గ కీలకమైన జీవన సూత్రాలను చరకుడు తన గ్రంథంలో వివరించాడు. జీవనశైలిలో ఆహార విహారాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మానవ ప్రయత్నంతో ఆయుర్దాయాన్ని పెంచుకోవడం సాధ్యమేనని చరకుడు చెప్పిన మౌలిక విధానాన్ని నేటి ఆధునిక వైద్య విధానాలూ అనుసరిస్తున్నాయి.
నిజానికి క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దికి చెందిన ఆత్రేయుని శిష్యుడైన అగ్నివేశుడు తొలిసారిగా ఆయుర్వేద చికిత్స పద్ధతులను గ్రంథస్థం చేశాడు. అగ్నివేశుడి గ్రంథాన్ని చరకుడు సమూలంగా సంస్కరించి, సమగ్రంగా తిరిగి రాశాడు. చరకుడు సమగ్రంగా సంస్కరించినందున అతడి గ్రంథం ‘చరక సంహిత’గా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ మిగిలి ఉన్న ఆయుర్వేద మూల గ్రంథాలు ‘సుశ్రుత సంహిత’, ‘చరక సంహిత’లు మాత్రమే. ఈ గ్రంథాలలో వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని చరిత్రకారులు చెబుతారు. ‘సుశ్రుత సంహిత’, ‘చరక సంహిత’ గ్రంథాలు క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికి చైనా భాషలోకి అనువదితమయ్యాయి.
మధ్యయుగాల్లో అపూర్వ ఆదరణ
మధ్యయుగాల్లో ఆయుర్వేదానికి అపూర్వ ఆదరణ ఉండేది. క్రీస్తుశకం 12–15 శతాబ్దాలకు చెందిన దల్హణుడు, సారంగ ధరుడు, భావమిశ్రుడు వంటి వారు పూర్వగ్రంథాలను మరింత మెరుగు పరచారు. స్వయంగా ప్రయోగాలను సాగించి, వాటి ఫలితాలను తమ గ్రంథాల్లో నమోదు చేశారు. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దిలోనే భారతీయ ఆయుర్వేద మూల గ్రంథాలు పర్షియన్, అరబిక్ భాషల్లోకి అనువదితమై, గల్ఫ్ దేశాలకు చేరాయి. బౌద్ధ భిక్షువుల ద్వారా ఈ గ్రంథాలు అంతకు ముందే చైనా, టిబెట్, జపాన్ తదితర తూర్పు దేశాలకు చేరాయి. అరబిక్‌లోకి అనువాదమైన ఆయుర్వేద గ్రంథాలు క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నాటికి యూరోప్ చేరుకున్నాయి.
పునరుజ్జీవన కాలానికి చెందిన ఇటాలియన్ వైద్యులు అరబిక్ గ్రంథాల ద్వారా తెలుసుకున్న సుశ్రుతుడి శస్త్రచికిత్సా పద్ధతుల ద్వారా రోగులకు చికిత్స చేసేవారు. భారత్‌లో అప్పటికే విస్తృత వ్యాప్తిలో ఉన్న తెగిన ముక్కుకు చేసే శస్త్రచికిత్స పద్ధతిని (రినోప్లాస్టీ) స్వయంగా పరిశీలించి, నేర్చుకోవడానికి బ్రిటిష్ వైద్యులు ఇక్కడకు వచ్చారు. ‘ఇండియన్ రినోప్లాస్టీ’ విధానంపై ‘జెంటిల్‌మేన్స్ మ్యాగజైన్’ 1794 సంవత్సరం సంచికలో ప్రచురించారు. సుశ్రుతుడు తన గ్రంథంలో వివరించిన శస్త్రచికిత్స పరికరాలను యూరోపియన్ వైద్యులు మరింతగా మెరుగుపరచారు. జోసెఫ్ కాన్‌స్టంటీన్ కార్పూ అనే ఇంగ్లిష్ వైద్యుడు 1815లో సుశ్రుతుడి పద్ధతిలో ‘రినోప్లాస్టీ’ శస్త్రచికిత్స చేశాడు. పాశ్చాత్య ప్రపంచంలో జరిగిన తొలి ‘రినోప్లాస్టీ’ సర్జరీ అదే. అయితే, భారత్‌లో బ్రిటిష్ పాలన మొదలయ్యాక ఆయుర్వేద వైద్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
అంతర్జాతీయ సంస్థల గుర్తింపు
అంతర్జాతీయ సంస్థలు చాలాకాలం పాటు ఆయుర్వేదాన్ని సాదాసీదా సంప్రదాయ వైద్య విధానంగానే పరిగణిస్తూ వచ్చాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సహా అంతర్జాతీయ సంస్థలు సైతం ఆయుర్వేదంపై దృష్టి సారించడం మొదలైంది. గడచిన రెండు దశాబ్దాల్లో ఆయుర్వేద ఔషధాల తయారీ పరిశ్రమ వేగం పుంజుకుంది. డబ్ల్యూహెచ్‌ఓ తొలిసారిగా 2002లో ఆయుర్వేద, మూలికా వైద్యాలకు సంబంధించి ఒక ప్రణాళికను విడుదల చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన మేధా సంపత్తి ప్రణాళికలో ఆయుర్వేదానికి చోటు కల్పించింది.
ఆధునిక భారత్‌లో ఆయుర్వేదం
స్వాతంత్య్రానికి ముందు కాలంలోనే కాదు, స్వాతంత్య్రం వచ్చిన చాలాకాలం తర్వాతి వరకు ఆయుర్వేద విద్యాబోధనకు ప్రామాణికమైన విద్యార్హతల నిబంధనలు ఉండేవి కాదు. సంప్రదాయబద్ధంగా ఈ విద్యను నేర్చుకున్న వారే రోగులకు వైద్యం చేస్తూ వచ్చేవారు. భారత ప్రభుత్వం 1970లో ప్రవేశపెట్టిన భారత వైద్య కేంద్ర మండలి చట్టం ఆయుర్వేద విద్యకు ప్రమాణాలను నిర్దేశించింది. ఆయుర్వేదాన్ని ప్రామాణిక పద్ధతుల్లో బోధించే విద్యా సంస్థలకు గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత ఏడాదిలోనే– 1971లో ‘ఆయుష్’ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర భారతీయ వైద్య మండలిని (సీసీఐఎం) ప్రారంభించింది. అదే ఏడాది తొలిసారిగా కేరళ యూనివర్సిటీ పరిధిలోని ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ (బీఏఎం) కోర్సును ప్రారంభించింది. కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా మరికొన్ని కళాశాలల్లోనూ ఈ కోర్సును ప్రారంభించారు. సిలబస్‌ను మరింత మెరుగుపరచి 1979లో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్) కోర్సును, పోస్టుగ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎండీ కోర్సును కూడా ప్రారంభించారు.
ఆయుర్వేదంతో పాటు సంప్రదాయ వైద్య విధానాలైన సిద్ధ, యునాని వంటి వైద్య విధానాలను చెందిన పురాతన గ్రంథాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవడానికి భారత ప్రభుత్వం 2001లో ‘ట్రాడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ’ని ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో ఆయుర్వేదం బోధించే కళాశాలలు 209, పీజీ స్థాయి కోర్సులను బోధించేవి 16 కళాశాలలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2,253 ఆయుర్వేద ఆస్పత్రులు, 13,925 డిస్పెన్సరీలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్య విద్యను ప్రామాణీకరించిన తర్వాత ఆయుర్వేదానికి జనాదరణ పెరగడం ప్రారంభమైంది. భారత్‌లో దాదాపు 77 శాతం జనాభా ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. మనదేశంలోని బీమా సంస్థలు కూడా ఆయుర్వేద వైద్యాన్ని గుర్తిస్తున్నాయి. ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో దాదాపు 10 శాతం వరకు ఆయుర్వేద చికిత్స పొందిన వారికి సంబంధించినవి ఉంటున్నాయి.
పొరుగు దేశమైన నేపాల్‌లో కూడా దాదాపు ఇదే స్థాయిలో 75 శాతానికి పైగా జనాభా ఆయుర్వేద ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం కూడా ఆయుర్వేదాన్ని గుర్తించింది. కొలంబో యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండిజీనియస్ మెడిసిన్ ఆయుర్వేదంతో పాటు యునానీలో కూడా డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తోంది. శ్రీలంకలో 62 ఆయుర్వేద ఆస్పత్రులు, 208 డిస్పెన్సరీలు దాదాపు 30 లక్షల మందికి పైగా రోగులకు– అంటే శ్రీలంక జనాభాలో దాదాపు 11 శాతానికి నిరంతరం సేవలందిస్తున్నాయి.
అభివృద్ధి పథంలో ఆయుర్వేద మార్కెట్
ఆయుర్వేద మార్కెట్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గడచిన దశాబ్ద కాలం లెక్కలను పరిశీలిస్తే, ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ సగటున 16 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసుకుంటోంది. ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులకు, పోషకాహార ఉత్పత్తులకు, చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ ఉత్పత్తులకు, వాజీకరణ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఆయుర్వేద ఉత్పత్తులపై మొగ్గు చూపుతున్న ప్రజల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మన దేశంలో 2015 నాటికి ఆయుర్వేద ఉత్పత్తులు వాడే వారి సంఖ్య జనాభాలో 69 శాతం ఉంటే, 2018 నాటికి ఈ సంఖ్య 77 శాతానికి చేరుకుంది. ప్రధానంగా వనమూలికలతో తయారయ్యే ఆయుర్వేద ఉత్పత్తులు ప్రకృతి సహజమైనవి, దుష్ఫలితాలు దాదాపుగా లేనివి కావడంతో చాలావరకు ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద ఉత్పత్తులను వాడటానికే ఇష్టపడుతున్నారు. రానున్న కాలంలో ఆయుర్వేద మార్కెట్ మరింతగా విస్తరించగలదని, ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పత్తులకు గిరాకీ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎగుమతుల్లో చైనా తర్వాతే మనం...
సంప్రదాయ మూలికా ఔషధాల ఎగుమతుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఎగుమతులతో చైనా ఈ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం భారత్ నుంచి ఏటా రూ.5 వేల కోట్లకు పైగా విలువ చేసే ఆయుర్వేద ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతుల్లో ఏటా సగటున 14 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది. దేశంలో ఆయుర్వేద చికిత్సలకు కేరళ ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ఆరోగ్యం కోసం భారత్ వచ్చే విదేశీ పర్యాటకులను కేరళ ఆయుర్వేద చికిత్స కేంద్రాలు ఆకట్టుకోగలుగుతున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా, యూరోప్ దేశాల్లో ఇటీవలి కాలంలో ఆయుర్వేద ఔషధాలకు ఆదరణ పెరుగుతోంది. జర్మనీలోని బ్రిస్టీన్ నగరంలో ఉన్న ‘యూరోపియన్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద’ యూరోప్‌లో ఆయుర్వేద పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో ఏటా 150 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు చేరుతున్నారు.
స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల్లో దాదాపు 80 శాతం ప్రజలు సంప్రదాయ ఆయుర్వేద వైద్యాన్ని ఆధునిక వైద్యంతో అనుసంధానం చేయాలని భావిస్తున్నట్లు ఆ దేశాలలో నిర్వహించిన రిఫరెండంలో తేలింది. ఆయుర్వేదాన్ని కొందరు పాశ్చాత్య మేధావులు కుహనా శాస్త్రంగా కొట్టిపారేస్తుండగా, ఆయుర్వేదం కేవలం నమ్మకాలపై ఆధారపడిన వైద్యవిధానం కాదని, పూర్తిగా శాస్త్రీయమైనదేనని యూరోపియన్ ఆయుర్వేద అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మిత్వెదా చెబుతుండటం విశేషం. అయితే, యూరోప్‌లో ఆయుర్వేద ఉత్పత్తులను ‘హెల్త్ సప్లిమెంట్స్’ లేబుల్‌తోనే విక్రయిస్తున్నారు. చైనా మూలికా ఔషధాలను మాత్రం ‘మెడిసిన్’ లేబుల్‌తో విక్రయిస్తున్నారు. ఆయుర్వేద ఉత్పత్తులను కూడా ఔషధాలుగా గుర్తించాలని మిత్వెదా వంటి నిపుణులు యూరోపియన్ ప్రభుత్వాలను కోరుతున్నారు. మిత్వెదా వంటి వారి విజ్ఞప్తిని యూరోపియన్ ప్రభుత్వాలు పట్టించుకుంటే, ఆయుర్వేద పరిశ్రమ భవితవ్యం మరింత ఆశాజనకంగా ఉంటుంది.
మహాభారతంలో ఆయుర్వేదం
క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన ‘మహాభారతం’లోనూ ఆయుర్వేద ప్రస్తావన కనిపిస్తుంది. ‘మహాభారతం’ నాటికే ఆయుర్వేదం ఎనిమిది విభాగాలుగా అభివృద్ధి చెందింది. నేటి ఆధునిక వైద్యంలోని వివిధ రకాల స్పెషలైజేషన్లను పోలిన విభాగాలను ‘మహాభారతం’ విపులంగా ప్రస్తావించింది.
అవి:కాయ చికిత్స (జనరల్ మెడిసిన్), కౌమార భృత్య (శిశు వైద్యం), శల్యతంత్ర (ఎముకల వైద్యం), శాలంక్య తంత్ర (చెవి, ముక్కు, గొంతు, కళ్లకు సంబంధించిన వైద్యం), భూతవైద్య (దుష్టశక్తులను వదలగొట్టడం), విషగర వైరోధ తంత్ర (టాక్సికాలజీ), రసాయన తంత్ర (శరీరానికి పునరుజ్జీవం కల్పించే యాంటీ ఏజింగ్ చికిత్స), వాజీకరణ (లైంగిక పటుత్వాన్ని పెంచే చికిత్స).
Comments
Please login to add a commentAdd a comment