
సాక్షి, గుంటూరు : ఆధునిక జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లతో నేడు పాఠశాల చదివే పిల్లవాడు మొదలుకొని యవకులు, పెద్దల వరకు అధిక బరువుతో(ఊబకాయం) బాధ పడుతున్నారు. ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ నివేదిక ప్రకారం 2030 నాటికి 250 మిలియన్ల మంది 5 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు ఊబకాయులుగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2.8 మిలియన్స్ మంది ప్రజలు ఊబకాయం వల్ల చనిపోతున్నారు. పెరిగిన శరీరం తగ్గించుకోవటం కోసం చాలా మంది ఉదయానే లేచి రోడ్ల వెంబడి పరుగులు తీయటం, జిమ్‌లలో గంటల కొద్ది వ్యాయామం చేయటం, ఆస్పత్రుల చుట్టూ తిరగటం చేస్తున్నారు. స్థూలకాయంపై ప్రజలకు అవగాహన కల్పించి, దీని బారిన పడకుండా ఉండటం కోసం ఏటా అక్టోబర్ 11న ప్రపంచ స్థూలకాయ వ్యతిరేక దినోత్సం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఊబకాయం(ఒబెసిటీ) కారణాలు...
నేడు ఊబకాయం సమస్య అధికమవుతోంది. ఈ సమస్య రోజురోజుకూ పెరగటానికి కారణం అధిక కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవటం, మితిమీరిన ఆహారం తినడం, శరీరానికి తగిన శారీరక శ్రమ లేకపోవటమే. వంశపారంపర్యంగా కొంత మందికి ఊబకాయం వస్తుంది. పిజ్జాలు, బర్గర్‌లు, ఫాస్ట్ ఫుడ్స్ కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. జీవన విధానంలో తేడాల వల్ల అధిక బరువు వస్తుంది. పాఠశాలల పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న జనాభాలో మూడో వంతు మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు.
ఊబకాయంతో రోగాలు...
ఊబకాయం వల్ల పిల్లల్లో మధుమేహం వస్తుంది. రక్తపోటు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, లివర్, కీళ్ల నొప్పులు, గురక, నిద్ర సమస్యలు, పిల్లలు పుట్టకపోవటం తదితర వ్యాధులకు గురవుతారు. సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, తగిన శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఊబకాయం బారిన పడకుండా ఉండవచ్చు.
ఆహారంలో కొవ్వును తగ్గించవచ్చు
శరీరంలోని ఎలాంటి జబ్బులనైనా 70 శాతం ఆహారంతో తగ్గించవచ్చు. తినే ఆహారం కొంచెమైనా అందులో పోషక విలువలు ఉండాలి. ఎలాంటి పరికరాలను వినియోగించకుండానే పళ్ళరసాలు, కాయగూరల రసాలు, పళ్ళు, ఉడకబెట్టిన ఆహారం, ఉడకబెట్టని(రాఫుడ్) తీసుకుంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. వ్యాయామం ద్వారా 20 శాతం జబ్బులను, యోగాతో కొవ్వును కరిగించవచ్చు.
– డాక్టర్ షేక్ హుస్సేన్, మెడికల్ ఆఫీసర్