మా కజిన్ ‘గర్భవాతం’తో చనిపోయారు. ఎప్పుడో చిన్నప్పుడు పెద్దవాళ్ల మాటల్లో ‘గర్భవాతం’ గురించి విని ఉన్నాను. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి మరణాలు పల్లెల్లోనే ఎక్కువగా జరగడానికి కారణం ఏమిటి?
– డి.శాలిని, రాజోలు
గర్భిణీ సమయంలో అనేక కారణాల వల్ల కొందరిలో బీపి పెరిగి తల్లిలో శరీరరమంతా నీరు చేరడం, ఫిట్స్ రావటం వంటి సమస్యలను గర్భవాతం లేదా గుర్రపు వాతం అంటారు. మరీ చిన్న వయసులో గర్భం వచ్చిన వారిలో, మరీ బరువు ఎక్కువగా ఉండి గర్భం దాల్చి, గర్భంలో ఎక్కువగా బరువు పెరగటం, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, రక్తంలో రక్తం గూడు కట్టే సమస్యలు ఉన్నవారిలో, తల్లిలో రక్తనాళాలు సరిగా వ్యాకోచించకుండా బీపి పెరగడం జరుగుతుంది. దీన్ని మొదట్లోనే సరిగ్గా గుర్తించలేకపోతే తల్లి మెదడుపైన, కిడ్నీలు, లివర్‌పైన దుష్ప్రభావం చూపి, ఫిట్స్ రావటం, కిడ్నీలు, లివర్ ఫెయిలవ్వటం, రక్తం గూడుకట్టడం, లేదా కాన్పు సమయంలో బ్లీడింగ్ అవ్వటం, తల్లికి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. అలాగే కడుపులో బిడ్డకు రక్తసరఫరా సరిగా అందక బిడ్డ బరువు పెరగకపోవడం, కడుపులోనే చనిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భవతులు సక్రమంగా డాక్టర్ దగ్గరికి చెకప్‌లకి వెళ్లి, ప్రతిసారి బరువు, బీపి, బిడ్డ సరిగా పెరుగుతుందా వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండడం వల్ల, బీపి కొద్దిగా పెరిగినప్పుడే, వారి సలహా మేరకు చికిత్స తీసుకుంటూ, త్వరత్వరగా చెకప్‌లకు వెళ్తూ, బీపి బాగా ముదిరి కాంప్లికేషన్స్ పెరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైతే ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వడం, డెలివరీ ముందుగానే చెయ్యడం వంటివి పాటించడం వల్ల, తల్లిని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించవచ్చు.
పల్లెల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే, వీరు డాక్టర్ దగ్గరికి సరిగా చెకప్‌లకి వెళ్లరు. బీపి పెరిగినా వీళ్లకి తెలియదు. లక్షణాలు బయటపడేసరికి బీపి బాగా పెరిగి, వ్యాధి ముదిరి అది ప్రాణాంతకంగా మారుతుంది. హాస్పిటల్‌కి వెళ్ళకుండా కాన్పులు కూడా ఇళ్ళలోనే చేయించుకోవడం, లేదా మంత్రసానుల దగ్గర చేయించుకోవడం ఈ సమయంలో బీపి ఇంకా పెరిగి ప్రాణాపాయస్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. ‘టాక్సొప్లాస్మొసిస్’ అంటే ఏమిటి? గర్భిణిగా ఉన్నప్పుడు శుభ్రత, ముఖ్యంగా స్నానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నాకు ‘ఐరన్’ తక్కువగా ఉంది. ఈ సీజన్‌లో లభించే ఏ పండ్లలో ‘ఐరన్’ ఎక్కుగా ఉంటుంది?– కె.నీరజ, సోంపేట
టాక్సోప్లాస్మా గొండై అనే ప్రొటోజోవల్ పరాన్నజీవి వల్ల టాక్సోప్లాస్మొసిస్ అనే వ్యాధి వస్తుంది. ఇది చాలా వరకు పిల్లుల దగ్గర నుంచి వ్యాప్తి చెందుతుంది. ఈ జీవి పిల్లులతో వృద్ధి చెందుతుంది. దాని సిస్ట్‌లు పిల్లి యొక్క మలం ద్వారా బయటకు వస్తాయి. ఈ మలం నుంచి ఇతర జంతువులు, మనుషులు శరీరంలోకి ఈ సిస్ట్‌లు చేరుతాయి. పిల్లి మలం ద్వారా సిస్ట్‌లు ఉన్న నీరు, మట్టి, వాటిలో పెరిగే కూరగాయలు, వాటిని సరిగా శుభ్రం చెయ్యకుండా తీసుకోవడం వల్ల టాక్సోప్లాస్మొసిస్ వస్తుంది. తలనొప్పి, నీరసం, ఒళ్ళు నొప్పులు, లింఫ్‌నోడ్స్ వాయడం, కళ్లకు, కండరాలకు, మెదడు, ఊపిరితిత్తులకు పాకకడం, మెదడువాపు, ఫిట్స్, న్యుమోనియా వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. గర్భవతులలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఈ జీవి చేరితే అది మాయ ద్వారా టాక్సోప్లాస్మా బిడ్డకి సోకి అబార్షన్లు, బిడ్డలో మెదడు లోపాలు, కళ్లు పాడవడం, వంటి అవయవలోపాలు, బిడ్డ కడుపులో చనిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
టాక్సోప్లాస్మాసిస్ రాకుండా ఉండటానికి పిల్లుల నుంచి వాటి మలం నుంచి దూరంగా ఉండాలి, తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లు, కూరగాయలు బాగా కడిగి తీసుకోవాలి, బాగా ఉడకబెట్టిన మాంసం తీసుకోవాలి. బాగా కాసిన పాలు తీసుకోవాలి. గర్భిణిగా ఉన్నప్పుడు పైన చెప్పిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. వీరిలో శారీరక, వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. గర్భిణిలలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌లు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. మల విసర్జన తరువాత ముందు నుంచి వెనకాలకు శుభ్రం చేసుకోవాలి. రోజు గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యటం మంచిది. స్నానం తరువాత మాయిశ్చరైజర్ రాసుకుంటే, చర్మం మెత్తగా ఉండి, చర్మం సాగడం వల్ల కలిగే దురద తక్కువగా ఉంటుంది. గర్భిణీలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. రక్తంలోకి హీమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ తప్పకుండా అవసరం. ఆపిల్స్, దానిమ్మ, స్ట్రాబెరీ, డ్రైఫ్రూట్స్, పల్లీలు, బాదం, వాల్‌నట్స్, గుమ్మడికాయ గింజలు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, అంజీర్ వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.ఆరంజ్‌లు, టమాటా, కివి, జామపండులో ఉండే విటమిన్‌ల వల్ల తీసుకున్న ఆహారం నుంచి ఐరన్ ఎక్కువగా రక్తంలోకి చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment