
రెండున్నర దశాబ్దాలుగా భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఒక ప్రధాన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా మారాయి. పైగా గ్రామీణ రైతు కుటుంబాలపై సామాజిక, మానసిక, ఒత్తిడితో పాటు ఆర్థిక భారం గణనీయంగా పడుతోంది. వీటి వల్ల పిల్లల చదువులు మధ్యలో ఆపివేయటం, మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, కమతాల పరిమాణం తగ్గిపోవడం, పాడి పశువులను అమ్మివేయడం, అధిక విలువ గల పంటలలో దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతులను, రైతుకూలీలకు ఆదుకోవడానికి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం కొంత ముందడుగు వేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తన తాజా బడ్జెట్‌లో 28,866 కోట్ల కేటాయింపులతో (12.66 శాతం) రైతులకు పెద్దపీట వేసింది. ఇది ఇతర రాష్ట్రాల సగటు 6.5 శాతం కేటాయింపుల కన్నా గణనీయంగా ఎక్కువ.
జాతీయ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అంచనాల ప్రకారం 1995 నుండి మన దేశంలో 2,96,438 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటిలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉండగా 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2015వ సంవత్సరంలో మహారాష్ట్రలో 3,030 మంది, తెలంగాణలో 1,358 మంది, ఏపీలో 516 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2017–18లో దేశంలో రోజూ 10 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని నమోదైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో, ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తక్కువగా ఆత్మహత్యలు నమోదయ్యాయి.
రైతుల ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఉపశమన ప్యాకేజీలు, రుణమాఫీ పథకాలు ప్రకటించాయి. రైతులను, రైతుకూలీ లను ఆదుకోవడానికి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం కొంత ముందడుగు వేశాయనే చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తన తాజా బడ్జెట్‌లో 28,866 కోట్ల కేటాయింపులతో (12.66 శాతం) రైతులకు పెద్దపీట వేసింది. కౌలు రైతులతో సహా రైతులందరికి రూ. 12,500 వ్యవసాయ పెట్టుబడి సాయం, పంటల బీమా, 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా, రైతులకు వడ్డీ లేని రుణాలు, ఉచితంగా వ్యవసాయ బోర్లు, ఆక్వా రైతులకు విద్యుత్తు సబ్సిడీ, గోదాములు నిర్మిం చడం, విషాదకర పరిస్థితులలో రైతులు మరణించినపుడు తగిన పరిహారం వంటివి చెప్పుకోదగ్గ చర్యలు. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పంట సాగుదారు హక్కుల బిల్లు 2019, ముఖ్యంగా రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 2 వేలకోట్లతో, ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధులు వంటి పథకాలు.. రైతులు, కౌలుదారుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలుగా చెప్పవచ్చు.
పత్తి, వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, మినుము, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు పువ్వు మొదలైన పంటల సాగుకు అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఖర్చు ఎక్కువని ‘వ్యవసాయ ధరల నిర్ణాయక సంఘం’ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి రుణసదుపాయం కల్పించేందుకు బ్యాంకులు తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణ, ఒక పంటపోయినపుడు మరో పంట చేతికి వచ్చేంతవరకు రుణదాతలు ఎటువంటి ఒత్తిడి చేయకుండా చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలి. రైతులలో ఆర్థిక స్వావలంబనకై చేపట్టవలసిన కార్యక్రమాలు, చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడు మాత్రమే ఆత్మహత్యలు తగ్గి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామాభ్యుదయాన్ని సాధించి భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల ప్రమాదాల అంచనాకు శాన్త్రవేత్తలు కొలబద్దలను తయారు చేశారు. వీటిని ఉపయోగించి ఏఏ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉందో ముందే గుర్తించి తగు నివారణ చర్యలు తీసుకొని వారిని రక్షించవచ్చు.
ప్రొ‘‘ మల్లంపాటి శ్రీనివాసరెడ్డి
వ్యాసకర్త మాజీ పాలక మండలి సభ్యులు
పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్
మొబైల్ : 94913 24455