పార్శిల్‌ | Special Article Written By Manu In Funday 03/11/2019 | Sakshi
Sakshi News home page

పార్శిల్‌

Published Sun, Nov 3 2019 3:58 AM | Last Updated on Sun, Nov 3 2019 7:52 AM

Special Article Written By Manu In Funday 03/11/2019 - Sakshi

ఎవరూ? అమెజాన్‌ నుంచి పార్శిల్‌ మేమ్‌... ఓహ్‌....... ఉండు.... తను బిల్‌ తీసుకుంటూ....‘అసలు శనివారం డెలివరీ మేమ్‌. టూ డేస్‌ ముందే ఇచ్చేశాం చూశారా!’ చిన్న గర్వపు నవ్వుతో చెప్పి వెనుదిరిగాడు. నాకపుడు తెలిస్తేగా... నా ‘ఆ’  ప్రయాణం రెండురోజులు ప్రీ పోన్‌ అయిందనీ, అతను చింపి ఇచ్చింది దాని తాలూకూ ‘చెల్లు చీటీ’ అనీనూ. నా ఏకైక పుత్రుడికి నేనివ్వబోతున్న పుట్టినరోజు కానుకిది... వాడు మా ఇద్దరి బర్త్‌ డేలకీ ఏదో సర్ర్‌పైజ్‌ ప్లాన్‌ చేస్తాడెపుడూ. మా ఆఫీసుల్లో తనకు చనువున్న ఆంటీతోనో అంకుల్తోనో కుమ్మౖకై వీడి సర్ర్‌పైజ్‌ ప్లాన్లు అమలుచేయించి మమ్మల్ని ఆశ్యర్యపరచటం అలవాటు. మరి నేనూ వాడికివ్వాలిగా... ఎంతో కొంత సర్ర్‌పైజ్‌! అందుకే ఇది ఆర్డరు పెట్టా. కానీ ఆ గిఫ్ట్‌ ఓ జీవితకాలపు సర్ర్‌పైజ్‌ తిరిగి నాకే ఇవ్వబోతుందని తెలియటానికి నాకో ఆరుగంటల టైం పట్టింది. టెన్త్‌ నుంచే సెల్‌ఫోన్‌ కొనమని నస మొదలుపెట్టినా సునీలూ, నేనూ ఒకే మాట మీదుండి తర్వాత చూద్దాం అంటూ గడిపేశాం. ఇంటర్‌ మధ్యలో మళ్ళీ  యాగీ మొదలుపెట్టేసరికి నువు బాగా చదివి నైన్‌ పాయింట్స్‌ తెచ్చుకో కొంటానని మాట ఒదిలేశాడు సునీల్‌.

‘ఏడ్చినట్టుంది వాడికి ఆ కెపాసిటీ ఉంది. అది కాస్తా తుంగలో కలుపుద్దనేగా సెల్‌ ఒద్దనేది.. ఇంటర్‌ పూర్తి చేయనీ అనలేవా సునీల్‌?’ అని తను మొత్తుకుంది. అందరికీ ఉంది మమ్మీ క్లాస్‌లో... ఈ కష్టం పగోడిక్కూడా రాకూడదన్నంత ‘ఫీల్‌’తో ముఖం మాడ్చుక్కూర్చున్నాడు. ఇక సునీలెక్కడ ఆగుతాడూ... వెంటనే సెల్‌ఫోన్‌ రెడీ! తనకి సమకూర్చడమే తెలుసు గానీ కంట్రోల్‌ చేయడం తెలీదు. మా సుపుత్రుడు ముఖానికి దాన్ని అమర్చుకుని, సెల్లుకు సొంత కవల సోదరుడిలాగా తిరగటం మొదలెట్టాడు. ఎదురుగా నించొని ఏదైనా మనం అడుక్కోవచ్చు. మరేదైనా చెప్పుకోవచ్చు. వాడు మాత్రం అందులోంచి తలెత్తేదే లేదు. ఊ...ఊ..అనటమే. కదిలేదే లేదు. చివరకు టాయిలెట్లోక్కూడా తీసుకుపోతుంటే సహించలేక నాలుగు పద్ధతైన తిట్లు తిట్టాగానీ అవి కూడా సెల్లు దాఖలా అయిపోయాయ్‌.

నా ఎనర్జీ వేస్ట్‌ అని తెలిశాక వాడిని మానేసి మా గదిలో మేం ఇద్దరం తిట్టుకునేవాళ్ళం. ‘కష్టపడి ఇల్లుకట్టి కల్లుతాగి కూలగొట్టాడట ఎవడో నీలాగే ఏం ఫోన్లో ఏంటో’ అని సునీల్‌ని సతాయించేదాన్ని. ఓ నెల కాగానే వాడికి సైటు కళ్ళద్దాలు సమకూర్చి పెట్టింది తన బాధ్యతగా ఫోను. వీడికి క్రమంగా వినే అలవాటు పోతే డిగ్రీ ఎలా పూర్తి చేస్తాడూ? అని నాకొకటే దిగులు. బాగా ఆలోచించి ‘ఇది’ ఆర్డరు పెట్టానందుకే! నాకర్థం అయిపోయింది ఇక నా ప్రాణం పోక తప్పదనీ...మూడు బారల దూరంలో అటుతిరిగి కూర్చున్న ముద్దుల కొడుకు తనను ‘చెవులారా’ సాగనంపబోతున్నాడనీనూ. ‘అరే నాన్నా’ వినపడదు పాపం! పొద్దున్నుండి చూస్తున్నదేగా తంతు. కళ్ళు మూసుకుని తలూపుతూంటాడంతే.

అబ్బా.. గుండెలపై చేతితో గట్టిగా అదుముకున్నా... అయ్యో..సాయంత్రం మేనకోడలి పెళ్లికి వెళ్ళాలే. ఇక అంతా ఇటే వస్తారేమో! ‘ఒరేయ్‌...బాబూ...డ్రెస్సింగ్‌ టేబుల్లోంచి నాలుక కింది మాత్తర్లు తీసీయరారేయ్‌... అబ్బా....ప్రాణం పోయేట్టుందిరా....నేను నా కంటే నీకే ఎక్కువ అవసరంరో’...ఊ....మ్‌. నాలో నేనా...పైకా నేను మాట్లాడుతుంటా?! ఏమో. ‘ఒరేయ్‌..సన్యాసి..ఒక్కసారి ఇటు చూడ్రా’.. బలహీనమైన గొంతు... బలహీనమైన ఆలోచనలూ. బలవంతంగా లేచే ప్రయత్నం.. అబ్బే...ఉహూ... ఇందాకటి వరకూ ఆ అద్దం దగ్గరే కదా చచ్చానూ..ఏ మాత్రం చేయిలాగినా బిళ్ళ చప్పరిద్దునే. నోట్లో నిజంగా మందుబిళ్ళ స్పర్శ...ఒళ్ళు తేలిపోతుందేవిటీ...ఓహో పిల్లాడు చేతులపై ఎత్తుకుని  అంబులెన్స్‌ ఎక్కిస్తున్నందుకా....హమ్మయ్య సేఫబ్బా నేను...ఎంతైనా మా వాడుకూడా నాలాగే వెంట వెంటనే స్పందించి నిర్ణయాలు తీ...సు...కు...ని....అరె..మా సీలింగ్‌ ఫేన్‌ నా ముఖం మీదికొచ్చి మరీ తిరుగుతుందెందుకూ.

నిజమా...కలా..ఊహా...ఆశా...తెలీలా... ఇంకా ఇక్కడే ఉన్నానేంటీ? హూ... సాయంత్రం నా చుట్టూ చేరి  వంటచేసి, నడుం వాల్చి హాయిగా నిద్రలోనే వెళిపోయిందంటమ్మా...ఎంత గొప్ప చావో! అని చెప్పుకుంటారైతే అంతా. ఔను.. వంటచేసే పోవటం...గొప్పేగా మరి.. ఏడుపు నిండిన నవ్వు వచ్చింది. ఆఖరి ప్రయత్నంగా మోచేతిపై లేచే ప్రయత్నం చేస్తూ...చేతికి దొరికిన రిమోట్‌ వాడికి విసురుదామను...కుంటూండ...గానే...రెండు నిమిషాలు కుదిపేసి జాలీగా భుజాలెగరేసుకుంటున్న కొడుకుని కళ్ళనిండా  ‘జాలి’గా చూస్తూండగా....పోయింది.. ఎన్నిటికోసమో ప్రాకులాడిన ప్రాణం! పరుగులెత్తిన ప్రాణం! పిల్లల మీద పెట్టిన ప్రాణం...పువ్వులనీ, పుస్తకాలనీ, భానుమతనీ, శ్రీ శ్రీ అనీ,  వెన్నెల్లో ఆడపిల్లా, అమావాస్య చంద్రుడూ... ఎన్నింటినో ప్రేమించిన ప్రాణం...ఆఖరుసారి అంతులేని నిస్సత్తువనూ, నొప్పినీ కలిగించి, తెలియని తీరాలకై వేగంగా బయటపడింది. కోడలితో, మనుమలతో పరిచయం లేకుండానే... వియ్యపోళ్ళని చూడకుండానే... కొడుకు పెళ్లికి పట్టుచీర రెప రెపతో సందడిగా సంతోషంగా తిరగకుండానే...పో..యిం...ది. అరె... ఎంతఖాళీ ఎంత తీరికెంత శాంతీ! ఊహ తెల్సాక ఇంత పనిలేకుండా ఎన్నడూ లేను. ఎత్తులో కూర్చొని కాళ్ళూపుకుంటూ అదే గదిలో ఉన్నా. నా నిర్జీవదేహం మంచంపై పడుంది. కర్రవాటు దూరంలో వాడింకా తలూపుతూ అలాగే కూర్చుని ఉన్నాడు. ఎంజాయ్‌ చేస్తూ.

ఐనా నాకు బుద్ధుండాలి...బర్తడే గిఫ్ట్‌... బర్త్‌ డేకివ్వాలిగానీ ముందే చూపిస్తే వీడాగే రకమా?! ఎంజాయ్‌మెంట్‌ అంతుచూస్తూ అమ్మ ‘అంత’ మయేది చూడకుండానే కూర్చున్నాడు. ఒక్కసారిగా నాలో బాధ.. ఇపుడొకసారి పోయి ‘దీన్ని’ కనిపెట్టినోడిని రెండు పీకివస్తేనో.. మొన్న వీటిని ధరించి  వినపడక  రైలు పట్టాలు దాటుతా చనిపోయిన  ఒక్కగానొక్క రమగారి పిల్లాడు గుర్తొచ్చాడు. వీడినీ, మా వెధవనీ కూడా పన్లోపని రెండు పీకుతా.. ఎలాగూ  కనపడను గాబట్టి. వావ్‌..మా ఎదవ లేచాడు. ఇప్పుడదిరి, బెదురుతాడు చూడూ...పాపం పిచ్చికన్న! నన్నెంత మిస్‌ అవుతాడో... వాడు మంచం దగ్గరకొచ్చి ‘మమ్మీ..అన్నం తిందామా?’ ఒక్కసారే అడిగాడు చెవిలోంచి ఒక వైరే తీసి. నేను పలక్కపొయే సరికి ‘సర్లె..నువు పడుకోలే..నేను పెట్టుకుంటాలే’  మళ్ళీ వైరు చెవిలో ఇరికించుకుని డైనింగ్‌ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఒరే నీ యయ్య...తట్టిలేపరా..నీయమ్మ కట్టెకాల... నీ అడ్జస్ట్మెంట్‌ తగలెయ్య.. ఇంత తెలివిలేని వెధవనా నేను కన్నదీ... ఇహ బ్యాంక్‌ నుండి సునీల్‌ రావల్సిందేనా..నా అతీ,గతీ తేలాలంటే...ప్చ్‌. నా శరీరం అలా అంతసేపు ఏ ఐడీ లేకుండా, చచ్చిన మనిషికి తప్ప చచ్చినట్టు ఎవరికీ తెలీక ...ఫ్యాన్‌ గాలికి ముంగురులు ఊగుతూ పడుంది. నా ఆత్మ జలదరించింది. కానీ  ఏదో తెలియని రిలీఫ్‌...ఎవరితోనూ చేయించుకోకుండా, తల్లిగా, భార్యగా, ఎంప్లాయిగా... క్లీన్‌ చిట్తో బయటపడ్డాను.

ఇదీ మంచిదేలే. ఊహూ... కానేకాదు.. వీడి పెళ్ళి ఆదర్శంగా చేస్తానన్నదీ... కోడలితో ఫ్రెండ్లీగా ఉంటానన్నదీ... మనమరాలికి అంజలి అని పేరు పెడతానన్నదీ...అన్నీ ‘ఆన్లైన్‌ యమపాశాలు’ తీసుకుపోయాయి. కానీ ఇంత సిల్లీగా.. సింపుల్‌ గానా పోయేది? సాయంత్రం సునీల్‌ ‘టీ...టీ.’  అంటూ మంచం చుట్టూ తిరిగి ఎప్పటికో  గమనించాక...ఆపై నేనూహించిందే. మేనకోడలి పెళ్ళిజనం అంతా ఖర్చులు కలిసొచ్చి...ఆనందం నుండి విషాదానికీ, సన్నాయి నుండి షహనాయికీ షిఫ్ట్‌ అయ్యారు. ‘గుత్తొంకాయ చేసిందంటమ్మా వాళ్ళాయన కిష్టమని’ ఒదిన కన్నీళ్ళతో! హు.. చావెవరిదైనాకానీ... గుత్తొంకాయనొదల్రే.. హ..హ...హ’. ‘వాషింగ్‌ మెషీన్లో బట్టలలాగే ఉన్నాయమ్మా.. మధ్యాహ్నం వేసుకుంది గావునూ.’ పిన్ని ఇంట్లో ఓ రౌండేసొచ్చి ముక్కు పిండుకుంది. కాదెహే...లేవంగానే వేసేసా...మధ్యాహ్నం ఏడుందీ చాకిరేవుకీ...చావురేవైపోతేనూ! ఇంతలో నాకు ఓ షాక్‌..నా పుత్ర రత్నం కాసేపటికో... కూసేపటికో జరిగిన సీన్లు రివైజై..రియలైజ్‌ అవటం చూసి తరిద్దామనుకుంటే...వాడు నా పార్థివ శరీరంపై పడి– ‘ఇవిగో అమ్మ నాకోసం కొన్న లాస్ట్‌ మెమరబుల్‌ గిఫ్ట్‌’ అంటూ ఆ నల్లని యమపాశపు ‘ఇయర్‌ ఫోన్స్‌’ అందరికీ చూపించి,  ముద్దాడుతూ గావురుమంటూ ‘వాటిని’  అతి జాగ్రత్తగా జేబులో దాచుకున్నాడు.

అరే..ఒద్దురా...పాపిష్టివిరా...హెడ్‌ ఫోన్స్‌ కావవి...హెడ్‌ కొరివి రా నాకూ! ఎంత శ్రద్ధగా తీసుకున్నానురా వాట్నీ! పగోడిని పంచాంగమడిగితే, మధ్యాహ్నానికే మరణం అన్నాట్ట. అయ్యో...వీడు పూజించేసేట్టున్నాడే. ‘ఏవీ ఇలా చూపించూ. మేమంతా చూస్తాం మీ అమ్మిచ్చిన గిఫ్‌ ్ట‘పిన్నికి ఏదొక న్యూస్‌ లేటెస్ట్‌ ది కావాలి. వాడు తీసిస్తున్నాడు...ఇక నా గురించి మానేసి వాటి గురించే ఈ పూటంతా చెప్పుకుంటారు గావును. ఛ...ఖర్మ..ఖర్మ! హూ..ఇక పొండి. కర్మ కాండలు చేసుకోండి. మీ ఖర్మ... ఇక నా సమయం అయిందో, లేక అక్కడ ఉండాలనిపించలేదో తెలియదు, ఆలోచనారహితమైన నా ఆత్మ ప్రయాణం నా భర్తనీ, కొడుకునీ ఆర్తిగా చూసుకుంటూ ముందుకు సాగింది. ‘అరరే...అరరే...నేడు కన్నీట తేనె కలిసే’ ఎవరి టీవీలోంచో ఇష్టమైన పాట వినపడుతోంది.
►మనూ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement